లలిత భావ నిలయా నవ రసానంద హృదయా
వికచారవింద నయనా సదయా జగదీశ్వరీ
మధువు చిలుకు గమక మొలుకు వరవీణా పాణి
ఎన్నిసార్లు విన్నా, ఈ పాట వింటుంటే కలిగే తన్మయత్వానికి ఇప్పటికీ తరుగు లేదు. సాహిత్యాన్ని అనుసరించి లలిత రాగంలోను, సరస్వతి రాగంలోను, శ్రీరాగంలోను ఈ పాటకు వరుస కట్టమని ఈ సినిమా సంగీత దర్శకులైన ఘంటశాల మాష్టారిని ఆదేశించారట మల్లాదివారు. అలా సంగీతసాహిత్యాలు పరమాద్భుతంగా మేళవించి ఈ పాట సుధాసముద్రాన్ని పొంగించింది. విశ్వానాథ వారు తన ‘కావ్యానందం’లో వివరించిన రసానందభూతి, ఇటువంటి పాటలు కూడా కలిగించగలవనిపించింది. అందుకే “ఆయన పలుకుల్లోంచి అమృతం పుట్టింది – అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది” అని మల్లాది వారి పాటల గురించి వేటూరి వారన్న మాటలను ఎప్పుడూ స్మరించుకుంటుంటాను. సినిమాలకోసం ఆయన రాసిన పాటలు ఎన్ని ఉన్నా, ఆయన పేరుతో ఉన్నవి మాత్రం రెండువందల లోపే! అందులో ఎన్నో ఆణి ముత్యాలుగా తళుకులీనుతూనే ఉన్నాయి.
ఇక మల్లాది వారి కథల గురించి మాట్లాడాలంటే, ముందు ఉబికి వచ్చే ఆనందాన్ని అదిమిపెట్టుకొవడాన్ని సాధన చేయాలి. ఆయన కథలు చాలా సాఫీగా వెళ్ళిపోయినట్టు ఉండవు. చాలాచోట్ల మనం ఆగి, ఆలోచించి ముందుకు వెళుతుండాలి. అసలు గొప్పతనం అంతా ఇక్కడే ఉందనిపించేది. అయితే, మల్లాది వారి రచనా తీరే అంత? లేక కావాలని ఇలా వ్రాస్తుంటారా? అన్న నా సందేహానికి సమాధానం కూడా తరువాత ఒకచోట దొరికింది. “రచన అన్నది అరటిపండులా ఒలిచి చదువరి చేతుల్లో పెడితే అతని మెదడుకు పనే ఉండదు. అందులో కవిత్వమూ ఉండదు. అతడు కాసేపు ఆలోచించి అర్థం చేసుకోవడమే మంచిది” అని సముద్రాల గారితో మల్లాది వారన్నారట, ఒకానొక సందర్భంలో.
ఇక మల్లాది వారి వ్యాసాల విషయానికి వస్తే, 80 యేళ్ళ క్రితమే పేరొందిన అన్ని పత్రికలలో వారి రచనలు, వ్యాసాలు అచ్చయ్యేవి. స్వయానా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే. నా కవి మిత్రులు, మన కథకులు, చలవ మిరియాలు మొదలైన శీర్షికలతో వారు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే… ఈ “చలవ మిరియాలు”
‘ఈ కవితా విశ్వానికి అంతా నిన్ను నాధుణ్ణిగా చేస్తాను…సరేకాదూ..’ అని ఆదిమూర్తి ఆ పసికందును లాలించి ఉంటాడు. ఆ దీవెన బలాన సాక్షాత్కరించి ఉంటాడు: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు’ అని విశ్వనాథవారి కోసం వ్యాసం మొదలుపెడుతూ అంటారు మల్లాది వారు. “తెలుగులో ఉండే గొప్ప నవలల్లో ఒకటి చదవాలంటే…’ఏకవీర’ మనసుకెక్కుతుంది. ఆ రసాభినవేశంతో…ఆ రసావేశంలో…’అంతరాత్మ’ను మరచిపోనిదెవ్వరు?” అన్న మాటల్లో మల్లాది వారికి విశ్వనాథ వారి రచనా శైలిపై ఉన్న అభిమానం తెలుస్తుంది. ‘నర్తనశాల’ నాటకం చదివితే, విశ్వనాథ వారిది నాటక కర్తగా ఎంతటి అత్యున్నత స్థానమో అర్థమౌతుందంటారు. వీరరసోద్రేకురాలిగా ద్రౌపదిని ఇంతవరకూ ఏ తెలుగు నాటక కర్తా అంత బాగా చూపించలేదన్నది మల్లాది వారి ఉవాచ. ఇక ‘కిన్నెరసాని పాటలు’ తెలుగు భాషకు అమూల్యాలంకారాలని ఘంటాపథంగా చెప్తారు మల్లాది.
మల్లాది వారు ఈ వ్యాసం రాసే సమయానికి పింగళివారు సినీకవిగా ఇంకా అవతారం ఎత్తలేదు.
అయితే అప్పటికే వారు తన జేబున్నీసా, వింధ్యరాణి, నారాజు వంటి నాటకాలు రచించి ప్రసిద్ధికెక్కారు. తెలుగు వారి కీర్తి పతాకను ఎగురవేయగల దిట్టగా పింగళిగారు ఎదగగలరని బహుశా భవిష్యత్తును ముందుగానే తరచి చూసుంటారు మల్లాదివారు.
‘తెలుగు వారంటేను దేవతలె మెచ్చాలి
తెలుగు తల్లీ నీకు జోహార్’
అంటూ పింగళి వారి నారాజు నాటకం లోని కొన్ని పంక్తులను ఉదహరిస్తారు శాస్త్రి గారు. ఇది చదవగానే, కొంతకాలం క్రితమే చదివిన నారాజు నాటకం మళ్ళీ తిరగెయ్యాలనిపించింది. వేశాను. అందులో చిత్రావతి అనే ఓ ముఖ్యమైన పాత్ర పాడే గీతికను మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను.
తెలుగువారే దేశదేశల నేలాలి
ఇది ఆ గీతికలో కొంతభాగం మాత్రమే! ఇలా పింగళి వారి నాటకాలలోని కథలను, ఔన్నత్యాన్ని వివరిస్తూ సాగుతుందీ వ్యాసం.
తెలుగులో బాలసాహిత్యానికి ఊపిరులూదినవారిలో చింతా దీక్షితులు గారు అగ్రగణ్యులు. రచనలు చేయడంలో కూడా ప్రతిఫలాపేక్షలేని మనిషని మల్లాది వారు దీక్షితులవారిని శ్లాఘిస్తారు.
‘బూచాడు’ పాటని ఉదహరిస్తూ…
‘చీకటి అమ్మా, చీకటి అమ్మా
ఇంట్లో చీకటి, దొడ్లో చీకటి
వంటి అలతి అలతి పదాల కూర్పుని ప్రశంసిస్తూ మురిసిపోతారు మల్లాది వారు. వరూధిని నాటకం గురించి చెబుతూ, ఇటువంటి నాటకం ఏ పారిస్ లోనో తప్ప మనదేశంలో ప్రదర్శించడానికి వీలుపడదంటారు. ఎందుకంటే..”వరూధిని మంచుతెరలు తప్ప మరేమీ కట్టుకోకూడదు కాబట్టి” అని సరసంగా చెబుతారు.
“ఈ శతాబ్దంలో వచన రచనకు పెట్టింది పేరు… ఒక్క ఇద్దరికే” అంటారు మల్లాది వారు. వారిలో ఒకరు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు అయితే, రెండవవారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారంటారు. చెళ్ళపిళ్ళ వారు కబుర్లలో ఎన్నో కథలు చెప్పారు – శ్రీపాదవారు కథలుగా ఎన్నో కబుర్లు చెప్పారంటారు.
వడ్లగింజలు వంటి కథ లేదని, యిల్లుపట్టిన వెధవాడపడుచు శ్రీపాదవారు తప్ప మరొకరు వ్రాయలేరని, “అనుభవాలూ-జ్ఞాపకాలూ…” నూరేండ్ల తెలుగుతనపు కూలంకష క్రోడీకరణ అని అంటారు.
“శ్రీపాద వారికి హిందీ అనే పేరు మినహా, ఆ భాషలో ఒక్క అక్షరమూ రాదు. చదువ దలచుకోనూలేదు. హిందీ వల్ల తెలుగుకు అపకారం రూఢీగా జరుగుతున్నదని వారి మనసులో నాటుకు పోయినదంటారు” మల్లాది వారు. “భావదారిద్య్రం ఉన్న వాళ్ళకు గాని, భాషాంతర అవలంబనం నాకేమంత అవసరం వచ్చింది. పుట్టుకతో వచ్చిన తెలుగులో మన తెలివితేటలు చూపించగలిగితే చాలు” అన్నది శ్రీపాదవారి నిర్ధుష్టాభిప్రాయమట.
“ఆయన రచనలు మరో భాషకు లొంగవు! జాను తెనుగు నేర్చిన వారికే, తెలుగువారైన వారికే శ్రీ శాస్త్రిగారి కథలు చదివి ఆనందించే అదృష్టము!” అని ముక్తాయింపునిస్తారు.
“ఏకైక వీరుడు” అని మొదలు పెడతారు మల్లాదివారు చలం గారి కోసం.
“లోకాన్ని ఎదిరించడంలో, తప్పు విప్పి చెప్పడంలో, దిమ్మతిరిగేటట్టు అనుశాసించడంలో, ఎంత ధైర్యం? – ఎదురుపడి, పలుకరించి నిలిపి, బాతాఖానీ వేయడానికి, ఏ మిత్రుడైనా, అభిమాని అయినా మొగమాటపెట్టినప్పుడు ఎంత బిడియం.” అని చలంగారి కోసం చెబుతూ ఆశ్చర్యం ప్రకటిస్తారు శాస్త్రి గారు. “మనసును, నిలువెల్లా నిండిపోయిన హృదయాన్ని, సొంతానికి ఏమాత్రమూ వినియోగించుకొనే ఇష్టం లేకపోవడమే” అని అందుకు కారణం కూడా వారే చెబుతారు.
ఫ్రాన్సు నవలాకారుడు జోలా… ‘లాసిమో’, ‘నానా’ అనే తన గ్రంథములను ప్రచురించినప్పుడు యూరోపియన్ పత్రికలు ఆయన్ని దుయ్యబట్టాయట. అదే పరిస్థితి చలంగారికి కూడా ఎదురయ్యిందంటారు మల్లాదివారు.
‘సాహిత్య ప్రపంచంలో క్రొత్త రీతులకు ద్రోవ చూపించి, కవితాకన్యకు క్రొత్తపోకడలు నేర్పింది… నవకవులందరిలోకి తొలుదొల్త శ్రీ తల్లావఝుల శివశంకరశాస్త్రి గారే’ అన్నది మల్లాది వారి మాట. బెంగాలీ నుండి తెలుగులులోకి ఎందరో ఎన్నో నవలల్ని అనువదించినా. మంచి నవల మాత్రం శివశంకరశాస్త్రి గారి ‘కుంకుమ భరిణె’ ఒక్కటే అని మల్లాది వారి అభిప్రాయం.
ఇక “భావకవులమనుకునే భావుకులందరు ఆయన క్రీగంటి ప్రసారం కోసం వేచియంటారు” అని మల్లాది వారన్న మాటను బట్టి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు భావ కవిత్వంలో ఎంతటివారో అర్థం అవుతుంది. వేదులవారి కథలు, ఫ్రెంచి కథకుడు ‘మపాసా’ను, రష్యన్ ఔపన్యాసక సమ్రాట్ ‘టర్నీవు’ను గుర్తుచేస్తాయని చెప్పడం ద్వారా, మల్లాది వారికి భారతీయేతర సాహిత్యం మీద కూడా ఎంతటి పట్టు ఉన్నదో అవగతమవుతుంది. వేదుల వారి ‘చిన్న మరదలు’ కథ చదువరులను పరవశింప చేస్తుందన్నది మల్లాది వారి అభిప్రాయం.
సంస్కృతంలో ఉన్న ఛందో విశేషాలన్నీ తెలుగు నుడికారానికి ఏ మాత్రమూ ఉపయోగించవంటారు మల్లాది వారు. ఆర్ష సంప్రదాయాన్ని అతిక్రమించడానికి భయపడి, విధిలేక కొన్ని వృత్తాల్నివాడుకుంటూ గ్రంథ రచన చేసే వారిది ఒకరకమైన మనోదౌర్భల్యమే అని తీర్మానిస్తారు.
గోగాకు పాడుగాను, గొల్లోడు పోయెరో
దుత్త మీద దుత్త పెట్టి లలనా
దుద్దుకూరు సంతకెళితే..” ఇలా సాగే ఒక జానపద గీతాన్ని ఉదహరిస్తూ, ఈ పాటకు అశ్లీలత్వాన్ని అంటగట్టే ఛాందసులుండవచ్చును గాని, రసవంతంగా, మనోహరంగా లేదనే అరసికులు మాత్రం… తెలుగుదేశ దౌర్భాగ్యం వశాన కాని ఉండరంటారు.
అలాగే నవీనకవుల్లో అపశబ్దాలను వాడేవారి సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉందంటారు. భావానికి, భాషకీ సామరస్యము, సామంజసము ప్రయత్నంమీద సాధిద్దామనే సహనం, సహృదయత లేకుండాపోయాయంటారు. “చిన్నదీ – మేల్వన్నెదీ – అది కన్నెగొల్లా చిన్నదీ – హంసనడకల చిన్నదీ – అరిటాకు కంటే వన్నెదీ ” అని చదువురాని కవి వ్రాసిన జానపద గీతంలో ఉట్టి పడే మాధుర్యం, ఈ నవీనతరం కవిపుంగవులకు సాధ్యం కావడం లేదంటారు.
“దొంగతనం, సూతకంలా వెల్లడయిన క్షణాన అమల్లోకి వచ్చేదే కానీ, దానికి ప్రత్యేక సత్తా లేదు” అంటూ చోరమీమాంస ప్రారంభిస్తారు మల్లాది వారు.
“దొంగతనం చేసినందుకు కాదు తమరు నాకు ఈ శిక్ష విధించుతూన్నది. దొంగతనం చేసి నిభాయించుకోలేక, పట్టుబడినందుకు” అని వెనకటికి ఒక చోరాచార్యుడు న్యాయాధికారికి తత్వం ఉపదేశించాడట.
ఇంత గొప్పదైన చోరకళను 64 కళలలో ఎందుకు చేర్చలేదనే దానికి కూడా మల్లాది వారు కారణం చెప్పారు. ఆ 64 కళలుకు మల్లే ఈ చోరకళ నీరసమైనది కాదుట, ప్రచండమైనదట. అందుకే వాటి గాటన దీనిని కట్టలేదట.
అంతే కాకుండా, యులిసిస్ తాతగారు గజదొంగ కాకపోయుంటే, ఆ మహానుభావుడిని ఒళ్ళో కూర్చోబెట్టుని ఒడుపుగా దెబ్బకొట్టడం నేర్పకపోయుంటే, ట్రోజన్ వీరుల సిగపూవు వాడేదేనా అని ప్రశ్నిస్తారు?
దొంగబద్ధాలు అనే ప్రయోగంలో ఉన్న లోతును బట్టి చూస్తే అది సత్యవాక్కంటారు. “దొంగ వైన అబద్ధాలు” లేదా “దొంగ యొక్క అబద్ధాలు” అని మనం దానిని చదువుకోవచ్చు. రెంటికీ అర్థం నిజమనే కదా. దొంగ దొర వ్యతిరేకార్థాలు కాదనీ, దొంగ ముదిరితేనే దొర అనే మరో పరమసత్యాన్నీ నుడువుతారు మల్లాదివారు. ఇలా ఈ వ్యాసమంతా హాయిగా, చమత్కారభరితంగా సాగిపోతుంది.
అటుపైన రెండు వ్యాసాలలో ఒకదాంట్లో ఇలవేలుపులైన దేవుళ్ళ కష్టాలను గురించి ఏకరువు పెట్టిస్తే, రెండవ దాంట్లో దేవుళ్ల శృంగారాల గురించి చమత్కరిస్తారు.
“పూజారి ఉన్నంత వరకూ ఆ దేవుడికి మైనారిటీ వెళ్ళదు – ఏ వరం ఇవ్వబోయినా అది చెల్లదు” అంటూ ప్రాసలతో పరిహాసాలాడతారు.
విజయరాఘవ రాయలు రాజ్యం చేసే కాలంలో శృంగార స్వరూపిణిగా, సాహిత్య సరస్వతిగా వెలిగిన రంగాజీ గురించి ఒక వ్యాసంలో, రంగాజీ కోరిక మీద క్షేత్రయ్య రచించిన పదముల గురించి ఇంకొక వ్యాసంలో వివరిస్తారు.
“నీ వగలు చూసి చెలి రేపగలు సొక్కుచును
పూవు జముదాడి దొర హావలికి జిక్కెన్
మావెలది నేలుకొన రావలదె నీవు దయ
తో విజయ రాఘవ మహీవర పరాకా”
అన్నవి రంగాజీ రచించిన దాసవిలాసమనే కావ్యంలోని పంక్తులు. మహరాజామెను కనకాభిషేకముతో గారవించినాడట.
తంజావూరు రాజుల నాయకత్వ మంతరించిన తరువాత, మరల అలాంటి మన్ననలకు తెలుగు తల్లి నోచుకోలేదని, రంగాజీని మరపించే, ఆమెకు దీటువచ్చే కాంతలు మరల ఉదయించలేదని అంటారు శాస్త్రి గారు.
బందరులోని మహనీయులు అనే వ్యాసంలో బందరు ప్రాంతం వారైన, మనకు తెలియని మహానుభావులు కోసం చెబుతారు. చిన్నతనంలో ఆంబోతు పొడవడానికి రాబోతే అప్రయత్నంగా అన్నా అని అరిచారట రంగదాసు అనే ఆయన. అప్పుడా ఆంబోతు కొమ్ము మళ్ళించి, యికిలించిందట. రంగదాసు ఆ బసవన్నను చూసి పగలబడి నవ్వాడట. ఆ నవ్వు అలా జన్మాంతం నవ్వుతూనే ఉన్నాడట. ఆ రంగదాసే రంగావధూత. ఇంకొకరు వేణుగోపాలస్వామి దర్శనం పొందిన దూదేకుల సాహెబు ఇస్మాల్ దాసు. అతని సంకీర్తనలు వందేళ్ళ క్రితం వరకూ చాలామంది పాడుకుంటూనే ఉండేవారట. ఇక కొన్ని తరాల క్రితం వరకూ సంజె దీపం వేళ, చాలామంది బీదా బిక్కీ తలుచుకునే పేరు తక్కెళ్ళ జగ్గడిది.
భర్త దేశాంతరం వెళ్ళినప్పుడు, కామాతురతతో రాజు పొందుకోసం పెడదోవ పట్టబోయిన హేమవతీ అనే ఇల్లాలుకి, ఓ హంస ఇరవై రాత్రుల పాటు చెప్పిన ఇరవై కథల కథైన “హంస వింశతి”కి మల్లాది వారు రాసిన పీఠిక చదివి ఆనందించవలసినదే గాని, దాని రుచిని లేశమాత్రంగానైనా చూపించే శక్తి నాబోటి వారి అక్షరాలకింకా సమకూరలేదు.
ఇంకా అహల్యా సంక్రందనము, రాధికా స్వాంతనము, సారంగధర చరిత్రము ఇలా వీటన్నిటికోసం చెప్పుకుంటూ వెళతారు మల్లాది వారు.
“నేను-నా కతలు” అనే వ్యాసంలో చాలాభాగం ముళ్ళపూడివారి బుడుగు భాషలా ఉంటుంది. కాకపోతే బుడుగు కాస్త పైస్థాయి భాష నేర్చితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
“అమ్మకు బోలెడు పని. చెంబులూ తప్పాలాలు, అమ్మకు అందకుండా పరుగెత్తుతుంటాయి; కొడితే సొట్టపోతాయని అమ్మ వాళ్ళను కొట్టడు.
నన్నూ కొట్టదు. కొడితే, పటికబెల్లం పెట్టాలిగా!
ఊహూ, ఊహూ అంటే పిప్పరమెంట్లూ, బిసకోతులూ-
అన్నీ తింటే అన్నం ఎందుకూ?
తినకపోతే, మామ్మ కత చెప్పదుగా-” ఇలా సాగిపోతుంది.
కథ సహజం గా అనిపించే అసహజం అయ్యుండాలంటారు మల్లాది వారు. కవనం చెప్పేవాళ్ళ నోళ్ళ – కథలు వ్రాసేవారి మునివేళ్ళ సరస్వతీదేవి కాపురం ఉంటుందంటారు.
“ధర్మపన్నమ్” అనే వ్యాసంలో పూర్వం ఒకానొక కాలంలో “స్త్రీ” ని ఒక భోజ్య వస్తువుగా ఎలా చూసేవారో చెబుతారు. అతిథి మర్యాదలలో భాగంగా, ఆ అతిథి కోరితే తన భార్యను కూడా ఆ అతిథి కోరిక తీర్చడానికి పంపించడం అనే ఓ భయంకరమైన ఆచారం ఉండేదట. తన తల్లి కూడా ఆ అమానుష అధర్మానికి బలవ్వబోతుంటే, తన తండ్రిని, ఆ నీఛపు పద్ధతిని ఎదిరించి, ఆనాటి ఆ ధర్మాన్ని అభిశంసించి, సమూలంగా పెకలించి వేసిన శ్వేతకేతువు వృత్తాంతం చెప్పిన తీరు అద్భుతం.
యడవల్లి సూర్యనారాయణ గారు, డి.వి.సుబ్బారావు గారు, నెల్లూరు నాగరాజారావు గారు, స్థానం నరసింహారావు గారు, టి. రాఘవాచార్యులు గారు మొదలైన నాటకరంగ దిగ్గజాల మీద మల్లాది వారు వ్రాసిన వ్యాసాలు అన్నీ రస గుళికలే.
ప్రహ్లాద నాటకంలో నాగరాజారావు గారు హిరణ్యకశిపుడు. శ్రీనివాసాచారిగారు లీలావతీనట. ప్రహ్లాదుని మీద కాఠిన్యం వహించవద్దని భర్త చేయి పట్టుకుని లీలావతి వేడుకునే అంకం దగ్గర ప్రేక్షకులకు చాలా కంగారుగా ఉండేదట. వస్తాదులా ఉండే ఆ లీలావతి (శ్రీనివాసాచారి) చేతిలో హిరణ్యకశిపుని హస్తం ఎక్కడ నలిగిపోతుందనో అని.
ప్రసిద్ధులైన రచయితల గురించి, నటుల గురించి చెబుతున్నప్పుడు, వారి గొప్పతనాన్ని ఎంతగా శ్లాఘిస్తారో, వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపడంలో అంత కాఠిన్యాన్ని వహిస్తారు మల్లాది వారు.
రాగద్వేషాలనే వ్యాసంలో ఏ కవికి ఏ బిరుదివ్వాలో చమత్కారంగా నిశ్చయం చేస్తారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ‘బాష్పకవి నయాగరా’, కాటూరి వేంకటేశ్వరరావు గారికి ‘కవన కాషాయాంబర’, ముద్దుకృష్ణ గారికి ‘అపర మొపాసా’, తల్లావఝల వారికి ‘భావకవి సంజాయిషీదార్’, మోటూరి సత్యనారాయణ గారికి ‘అఖిలాంధ్ర హిందీ తర్జుమాదార్’ ఇలా ఇంకో పదిమందికి బిరుదులిచ్చేశారు శాస్త్రి గారు.
“ఇవి బహిరంగ లేఖలు” అనే వ్యాసం లో ఆయన వ్రాసిన 4 లేఖలూ మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఎప్పుడో ఎనభై యేళ్ళ క్రితం కృష్ణాపత్రికలో ప్రచరించబడిన ఆ లేఖల కోసం ఆయన ఎంచుకున్న విషయాలు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. అందులో ఒక లేఖలో
“నా సోదర కవులకు విజ్ఞప్తి.
నేడు మన సంఖ్య అపరిమితంగా పెరగడం చేతనో, రెండక్షరాలు గీకే ప్రతి పిల్లకాయ కవి అని బిరుదు పెట్టుకోవడం చేతనో – మన మందరకు లోకువై పోయాము” అంటూ ఒక కవి పడ్డ రెండు పేజీల బాధ లోనుంచి హాస్యాన్ని విరజిమ్ముతారు. ‘తారకమంత్రం’ అనే వ్యాసం నిండా కూడా హాస్యమే ఒలుకుతుంది.
చివరిలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి పత్రికా ముఖంగా పరమానందయ్య శిష్యుడు పేర వ్రాసిన ఉత్తరం ఉంటుంది. తెలుగు భాష దీనావస్థ గురించిన వ్యాసమది.
ఇంకా ఎందరో ప్రముఖులను గురించి, విషయాలను గురించిన వ్యాసాలు ఎన్నో ఉన్నాయీ పుస్తకంలో. ‘ఆవిడ పట్టిన నోము దేశమంతా పట్టారట’, ‘ఆకూ అందదు – పోకా దక్కదు’ వంటి సామెతలు సందర్భానుసారంగా బోలెడన్ని చెబుతారు. ఎంతో మంది ప్రఖ్యాతులైన రచయితలకు ముద్దుగా మొట్టికాయలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొట్టికాయ వేసే విధానంలో ముద్దుతనం కనిపిస్తున్నా, అవతలి వారికి దెబ్బ గట్టిగానే తగులుతుందనడంలో ఏమాత్రం సందేహాలు పెట్టుకోనవసరం లేదు.
ఇది పుస్తక పరిచయం కాదు. సమీక్ష అంతకన్నా కాదు. ఈ పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన ఆనందం. కేవలం మహదానందం. స్వస్తి.