శివశివా… నిందాస్తుతి

ఇసుక రేణువులోన దూరియుందువు నీవు

బ్రహ్మాండమంతయును నిండియుందువు నీవు

చివురాకులాడించు గాలిదేవర నీవు

ఘన  కానలను గాల్చు కారుచిచ్చువు నీవు

క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు నీవు

కాలయమునిబట్టి కాలదన్ను నీవు

పెండ్లి జేయరాగ మరుని మండించినావు

పెండ్లియాడి సతికి సగమిచ్చినావు

దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి

వికటాట్టహాసమున భయపెట్టినావు

కడలి చిలుకు వేళ కాలకూటము బుట్ట

దాని త్రావి సురల గాచినావు

ఈ తిక్క శివునితో వేగలేననుచూ

ముక్కంటి కోపాన్ని ఓపలేననుచూ

వదిలిపోదమన్న వేరు దైవము లేదు

నీవు తప్ప నాకు గతియు లేదు

ఏమిసేతును దేవ సర్దుకొందును లెమ్ము

అమ్మవారి నడిగి మసలుకొందు

దూరముగ నీవున్న నా భయము హెచ్చును

నాదాపు నుండుటకు నీవొప్పుకొనుము

నీ ఆలితో గూడి నాగుండెలోనుండి

ఏడేడు లోకాల నేలుకొనుము

నా ఋణము తీర్చుకొన ఇవ్వుమొక చిరువరము

నా మనము నీ పదము నుండునటుల

 

ప్రకటనలు

పాటపై కవిత

మనమున ఊహలు భుగభుగ పొంగగ

పదములు రొప్పుతు పరుగులు పెట్టగ

కవిత్వమన్నది వెల్లువ కావగ

భావావేశము దేహము నిండగ

కనులు బిగించి భృకుటి ముడేసి

వాయువు కక్షర ఆయువు పోసి

తీరని ఆర్తిని కాయము జేసి

గళమున ఎగసి జిహ్వను దొర్లి

పెదవుల తలుపులు టపటప కొట్టి

విశ్వవీనులను జొచ్చుకుపోయి

జగతి గుండెయను సేదదీర్చెడి

సరిగమపదని స్వరముల మూట

కవులు వ్రాసెడి కమ్మని పాట

హే..పురాణ పురుషులగు బావా బావమరుదులారా!

సీ.
పాలసంద్రమె ఇల్లు పరుపేమొ పెనుబాము పట్టుబట్టలుగట్టు బావమరిది
కాటియందే ఇల్లు కట్టు బట్టే తిత్తి బిచ్చమెత్తుచునుండు బీద బావ
జనని గర్భము బుట్టు శంఖుచక్రము బట్టు బలదైత్యులను గొట్టు బావమరిది
ఉన్నచోటేనుండు ఉలకకా పలకకా పరమశాంతముతోడ బావగారు
ఆ.
ఒంటివాడు విభుడు ఓంకార రూపుడు
వేయి పేర్ల తోటి వెలుగువాడు
చిత్తమందు జనులు చిన్ముద్ర వేయగా
రూప లేమి రెండు రూపులెత్తె

బావమరిది పాల సముద్రాన్ని ఇల్లుగా చేసుకుని, పట్టుబట్టలు ధరించి, పెద్ద పామైన ఆదిశేషుని పరుపుగా చేసుకొని శయనిస్తుంటాడు. బావ గారేమో శ్మశానంలో కాపురముంటూ, జంతువుల తోలును బట్టగా కట్టుకొంటూ, బిచ్చమెత్తుకుని తిరిగే బీదవాడు. బావమరిదేమో తల్లి గర్భం నుండి జన్మిస్తూ (అనేక జన్మతెత్తుతూ) ఆయుధాలు ధరించి బలగర్వితులైన రాక్షసులను శిక్షిస్తూ ఉంటాడు. బావగారేమో ఉలక్కుండా పలక్కుండా ఉన్నచోటే ఉండే పరమశాంత స్వరూపుడు.

ఒక్కడే అయిన పరమాత్మ ఓంకార స్వరూపుడు, వేయి నామాలతో పిలువబడేవాడు. భక్తులు తమ మనస్సులో ఉంచి ధ్యానం చేసుకొనుటకై రూపమే లేని వాడు రెండు రూపాలను ధరించెను. అటువంటి శివకేశవ స్వరూపములకు ప్రణమిల్లుతున్నాను.

భరింపుమీశా!

ఆకలి దప్పిక తీరగ
నాకెన్నడు గుర్తురావు నా సిరియందున్
శోకము లేశము కలిగిన
నీకిది తగునా యనేడ్తు నిక్కము ఈశా!

నాకు ఆకలి, దప్పిక తీరినప్పుడెపుడూ నీవు గుర్తురావు. అదంతా నా అదృష్టం అంటాను. కానీ దుఃఖం కొంచెం కలిగినా, నీకిది తగునా అంటూ నిన్ను నిందిస్తూ ఏడుస్తాను. ఇది మాత్రం తప్పదు ఈశా.

హే… జగజ్జననీ!

క.       దుర్జన భంజని నగసుత
          ధూర్జటి రంజని హరినుత తోయజ నేత్రిన్
          ఘర్జిత సింగపు గామిని
          వర్జిత జన్మునిగజేయు పావన దుర్గా

తాత్పర్యము: దుర్జనులను నశింపజేయునది,  ధూర్జటియైన పతి పరమశివుని రంజింపజేయునది, పర్వతరాజు హిమవంతుని పుత్రికయైనది, లోకపాలకుడైన హరిచేత నమస్కరింపబడునది, కమలముల వంటి కన్నులు కలిగినది, ఘర్జన చేయు సింహము మీద సంచరించునది, లోకపావని యగు దుర్గామాతా… నన్ను జన్మరహితునిగా జేయుము తల్లీ.


ఏమి భాగ్యము గణపయ్యా..

సీ.

గోరుముద్దలు నీకు గోముగా పెట్టుచూ
……భువనేశ్వరీమాత ముద్దుసేయ
తొడపైకి నెక్కింప తూగాడుచుండగా
……విశ్వగురుడు నీకు విద్యనేర్ప
కైలాసగిరిపైన కార్తికేయుని తోటి
…...కేరింతలాడుతూ కేళిసల్ప
నిరతమూ ఆనంద నిలయుడై వెలిగేటి
……విఘ్నరాజా నిన్ను విరులగొలుతు

తే.

అగము జందెపు వేలుపా ఆయువిమ్ము
కొండకూతురి సూనుడా కుదురునిమ్ము
సకలవిద్యల నాథుడా చదువునిమ్ము
ప్రమథగణముల పాలకా పరమునిమ్ము

తెలుగు పాట

నెలరాజు నగవులు సెలయేటి పరుగులు

కలగలసి వెలిగేటి తెలుగింటి పదములు

రామచిలుకలు మెచ్చు రసరమ్య పలుకులు

అప్సరల భంగిమల అక్షర క్రమములు || అప్సరల||

 

అ అనగ అమ్మనుచు ఆ అనగ ఆవనుచు

తొలిపూజనీయులే తొలుత పదములు కాగ

సంస్కారవంతమగు ఈ భాష నీ భాష

చివురాకు రెపరెపల మన తెలుగు భాష || చివురాకు ||

 

అవధాన విద్యయును అందాల పద్యమును

సొంతమగు సరళమగు అపురూప భాష

అర్చింపగానిట్టి అమృతమయ భాషను

నర్తింపనీవోయి నీ నోట తెలుగును ||  నర్తింపనీవోయి ||

నిరంతర గమ్యం

 
       ఈ జీవన ప్రవాహంలో పుట్టిన ప్రతి మనిషీ.. ఎన్నో ఆలోచనల మలుపులు తిరుగుతూ, సంఘర్షణలు, సంతోషాలు, విషాదాల ఎత్తుపలాలు దాటుకుంటూ, తుది మజిలీ మరణాన్ని చేరేవరకూ తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. కానీ అత్యంత విలువైన దొకటి అతనికి అందకుండా అతని చుట్టూనే పరిభ్రమిస్తోంది. గుప్పెట్లో బంధిద్దామంటే దొరకని పాదరసంలా అది మనిషికి చిక్కకుండా జారిపోతూ ఉంది. విశాలమైన దోసిలితో పట్టాలిగాని, ముడుచుకుపోయిన గుప్పెటకు అది దొరకడం దుస్సాధ్యం మరి. ప్రతీ పనికి పరమావధి ఏదో, ఏది ఉంటే మరేదీ అక్కరలేదో, దేనివల్ల శాశ్వత నిష్క్రమణ సమయంలో కూడా దుఃఖం కలుగదో, ఆ వెలకట్టలేని విలువైన విశేషానుభూతి పేరే ఆనందం. అదే మానవ జీవితపు నిరంతర గమ్యస్థానం.

కాలం తెలివైనది. అది ముందుకు సాగుతూ మనిషి ఆలోచనలు మార్చుకుంటూ వెళిపోతుంటుంది. మారిన ఆలోచనల వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానంలో పడి మూలుగుతున్న మనిషిని చూసి వినోదిస్తుంటుంది. జవాబుదారీతనం కలిగిన స్వతంత్రుల గుంపుగా ఉండవలసిన సమాజాన్ని, భయస్తులు, బద్ధకస్తులు, ముసుగుమనసు మనుషుల కలయికగా మార్చివేసింది. తప్పించుకు తిరగడం ఈ కాలపు తెలివిగా తీర్మానించబడింది. గొప్పదనం హృదయాన్ని బట్టికాక, సమాజంలో హోదాని బట్టి లెక్క వేయబడుతుంది. దురలవాట్లుగా చెప్పబడేవి ఇప్పుడు సాధారణ అలవాట్లుగా భావించబడుతున్నాయి. సంపద, అధికారం, కీర్తి, సౌఖ్యం జీవిత గమ్యాలుగా మారిపోయాయి. తెల్లని అన్నం వంటి వీటికి, ఆనందం అనే శ్రేష్ఠమయిన కూర కలిపి తిన్నప్పుడే రుచిపుడుతుంది, బలం కలుగుతుంది, సంతృప్తీ మిగులుతుంది.

మనిషి అంతరాత్మకు కాక కేవలం సమాజానికి జవాబుదారీగా మారిపోయాడు. అవతలివారి పొగడ్త మీదో, తోటివారికంటే గొప్పవాడనిపించుకోవడం అనే తపన మీదో ఆధారపడి ఆనందాన్ని కొలుచుకుంటున్నాడు. పదిమందీ ప్రశంసిస్తే కలిగే ఆనందం భయంతో కూడిన బాధ్యతను పెంచుతుంది. క్రొత్త ఆలోచనలకు వారి ప్రశంసాకారణాలు పరిధులుగా ఏర్పడిపోతాయి. ఫలితంగా ఆలోచనల్లో స్వతంత్రత, నూతనత్వం మందగిస్తాయి, ఆనందం నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోతుంది. అదే, లోపలి మనిషి ప్రశంస వలన కలిగే ఆనందం స్వతంత్రతతో కూడిన ఉత్సాహాన్నిస్తుంది. సృజనాత్మకతను వికసింపజేస్తుంది. ఆలోచనే ఆనందంగా మారిపోతుంది. కానీ ఈ లోపలి మనిషితో మన బంధం రోజురోజుకీ బలహీనపడిపోతూ ఉంది. మనతో మనం గడపడానికి సమయం కేటాయించుకోలేకపోతున్నాం. మనల్ని మనకు దగ్గరచేసే ఏకాంతం అనేది పుస్తకాల్లో మాటగానే మిగిలిపోతోంది.

సాంస్కృతిక విప్లవం మంచికంటే చేటే ఎక్కువ చేసింది. సంపాదన మీద విపరీతమైన మక్కువ, సమాజంలో ఉన్నతికోసం పడే ఉబలాటం, కుటుంబసభ్యుల మద్య బంధాలని పలుచన చేసింది. భార్యాభర్తల ఉద్యోగాల వల్ల పిల్లలు ఆయాలకు, హాస్టళ్లకు అప్పగించబడుతున్నారు. స్కూలునుండి ఇంటికి రాగానే మంచినీళ్లిచ్చి ప్రేమగా దగ్గరకు తీసుకోవాల్సిన అమ్మ ఇప్పుడు ఆఫీసులో క్షణం తీరిక లేకుండా ఉంటోంది. అమ్మప్రేమ అనే మధురిమ ఒకప్పటి కాలానికి సంబంధించిన మధురభావనగా మిగిలిపోనుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదించిన డబ్బుతో పిల్లల్ని అన్ని వసతులూ గల హాస్టళ్ళు కలిగిన కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రులను అంతకంటే మంచి పేరున్న వృద్ధాశ్రమాలలో చేర్పించి ఋణం తీర్చుకుంటున్నారు. తాము చిన్నతనంలో నేర్చుకున్న న్యూటన్ మూడవ సూత్రాన్ని తెలియకుండానే అమలు చేస్తున్నారు. ప్రతీ చర్యకూ దానికి అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది కదా.

ఇప్పటికంటే మన పూర్వతరాలవారే ఎక్కువ శాతం ఆనందంగా ఉన్నారని అంగీకరించగలిగితే, అందుకు కారణమైన వారి అలవాట్లను, జీవన విధానాన్ని వివేచనతో బేరీజు వేసి అవలంబించగలిగితే, ఆనందాన్ని పట్టుకోవడానికి దారి దొరకవచ్చు. కాల పరీక్షకు నిలబడి, తత్వాన్ని మనకు మంచి కథల రూపంలో అందించిన ప్రాచీన సాహిత్యం కచ్చితంగా మనకు సహాయపడుతుంది. అంతరాత్మను వినగలిగే ఏకాంతం మనిషిని ప్రశాంతతకు దగ్గర చేస్తుంది, ఒంటరితనం బారిన పడకుండా కాపాడుతుంది. అలుపెరుగని ప్రయత్నం చేసి అవసరం లేని అలవాట్లను, మన బుద్ధిని తప్పుదారి పట్టించే వ్యక్తులను వదులుకో గలగాలి. మొదట్లో ఇది కష్టంగా అనిపించినా క్రమేణా గొప్ప ఆనందాన్నిస్తుంది. “లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు; అక్కరలేనిదానిని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు.” ’నిన్న’, ’రేపు’ తాళ్లయితే ’నేడు’ ఉయ్యాలబల్ల. గతం యొక్క అనుభవసారాన్ని, భవిష్యత్తు మీద విశ్వాసాన్ని ఆదరువుగా చేసుకుని వర్తమానంలో క్రీడిస్తూ జీవించగలగాలి. నిరంతర గమ్యమయిన ఆనందాన్ని చేరుకోగలగాలి.

రెండు ముక్కల్లో మూడు వాక్యాలు

 
ఒకరికొకరు దగ్గరవ్వడమంటే.. ఎంతదూరం పాటించాలో తెలిసుండటం
 
జీవితం అంటే.. దారిలో దొరికిన పండుని కూర్చొని తినడం కాదు.. చెట్టునున్న నచ్చిన పండుని కోసుకు తినడం
 
లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు
అఖ్ఖర్లేనిదాన్ని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు
.

నా విష్ణువు

 
వైకుంఠ పుర నివాస దేవదేవ జగపతి
ఖగపతిపై దివిసీమల విహరించే శ్రీపతి
ఆదిశేషు పడగ నీడ పవ్వళించు ధరపతి
సర్వవ్యాపి దివ్యజ్యోతి పరంధామ ప్రకృతి   ||వైకుంఠ పుర||
 
సుందర మీనానివై గిరినెత్తిన కూర్మమై
వసుంధరను గాచినట్టి అద్భుత వారాహమై
ఊరువుపై ధనుజునుంచి పొట్టచీల్చి ప్రేగు త్రెంచి
ప్రహ్లాదుని బ్రొచినట్టి ఉగ్రనరసింహమై   ||వైకుంఠ పుర||
 
వామనుడై అరుదెంచి మూడడుగులు యాచించి
త్రివిక్రముడై వ్యాపించిన బాలబ్రహ్మచారివై
బ్రాహ్మణునిగ జనియించి క్షాత్రముతో ప్రభవించి
రాజన్యుల శిక్షించిన పరశురామ దేవరవై   ||వైకుంఠ పుర||
 
సత్యధర్మ రూపమై దివ్యనామ తారకమై
ధారణిపై నడయాడిన సీతారామస్వామివై
దామోదర వాసుదేవ కంసాంతక గోవిందా
గీతామృత బోధకా పూర్ణపురుష శ్రీకృష్ణా   ||వైకుంఠ పుర||
 
అహింసా వ్యాపకా ప్రేమతత్వ బోధకా
నిశ్చల నిర్మల ఆత్మ బుద్ధదేవ భగవానుడా
శ్వేతాశ్వరూఢుడా కరవాలధారుడా
ధర్మసంస్థాపక కల్క్యావతరుడా   ||వైకుంఠ పుర||
 
అవతారపురుషుడా అఖిలాండనాథుడా
ఆదిదేవ జీవేశ్వర నన్ను ప్రేమ కావరా
శ్రద్ధనిమ్ము భక్తినిమ్ము గతితప్పని బుద్ధినిమ్ము
నన్ను నేను తెలుసుకునే ఆత్మప్రబోధమిమ్ము  ||వైకుంఠ పుర||