పాటపై కవిత

మనమున ఊహలు భుగభుగ పొంగగ

పదములు రొప్పుతు పరుగులు పెట్టగ

కవిత్వమన్నది వెల్లువ కావగ

భావావేశము దేహము నిండగ

కనులు బిగించి భృకుటి ముడేసి

వాయువు కక్షర ఆయువు పోసి

తీరని ఆర్తిని కాయము జేసి

గళమున ఎగసి జిహ్వను దొర్లి

పెదవుల తలుపులు టపటప కొట్టి

విశ్వవీనులను జొచ్చుకుపోయి

జగతి గుండెయను సేదదీర్చెడి

సరిగమపదని స్వరముల మూట

కవులు వ్రాసెడి కమ్మని పాట

ప్రకటనలు

నా విష్ణువు

 
వైకుంఠ పుర నివాస దేవదేవ జగపతి
ఖగపతిపై దివిసీమల విహరించే శ్రీపతి
ఆదిశేషు పడగ నీడ పవ్వళించు ధరపతి
సర్వవ్యాపి దివ్యజ్యోతి పరంధామ ప్రకృతి   ||వైకుంఠ పుర||
 
సుందర మీనానివై గిరినెత్తిన కూర్మమై
వసుంధరను గాచినట్టి అద్భుత వారాహమై
ఊరువుపై ధనుజునుంచి పొట్టచీల్చి ప్రేగు త్రెంచి
ప్రహ్లాదుని బ్రొచినట్టి ఉగ్రనరసింహమై   ||వైకుంఠ పుర||
 
వామనుడై అరుదెంచి మూడడుగులు యాచించి
త్రివిక్రముడై వ్యాపించిన బాలబ్రహ్మచారివై
బ్రాహ్మణునిగ జనియించి క్షాత్రముతో ప్రభవించి
రాజన్యుల శిక్షించిన పరశురామ దేవరవై   ||వైకుంఠ పుర||
 
సత్యధర్మ రూపమై దివ్యనామ తారకమై
ధారణిపై నడయాడిన సీతారామస్వామివై
దామోదర వాసుదేవ కంసాంతక గోవిందా
గీతామృత బోధకా పూర్ణపురుష శ్రీకృష్ణా   ||వైకుంఠ పుర||
 
అహింసా వ్యాపకా ప్రేమతత్వ బోధకా
నిశ్చల నిర్మల ఆత్మ బుద్ధదేవ భగవానుడా
శ్వేతాశ్వరూఢుడా కరవాలధారుడా
ధర్మసంస్థాపక కల్క్యావతరుడా   ||వైకుంఠ పుర||
 
అవతారపురుషుడా అఖిలాండనాథుడా
ఆదిదేవ జీవేశ్వర నన్ను ప్రేమ కావరా
శ్రద్ధనిమ్ము భక్తినిమ్ము గతితప్పని బుద్ధినిమ్ము
నన్ను నేను తెలుసుకునే ఆత్మప్రబోధమిమ్ము  ||వైకుంఠ పుర||
 
 

గుండె అన్నదీ కుండేనేమో

.

గుండె అన్నదీ కుండేనేమో

కన్నీళ్లతొ అది నిండాలేమో

బాధ బ్రతుకూ తావి విరులు

విడివడి ఎరుగని ఆత్మబంధువులు

.

చినుకు స్పర్శతో పులకించిన విరి

బ్రతుకు తోటలో విరబూసినది

పూసిన విరి ఆ చినుకును కానక

పూరెక్కలు ముక్కలై విలపించినది

.

వలచిన మనసుని గెలుచుట కోసం

మనసులొ మనిషిని చేరుట కోసం

కలల అలలపై పయనము చేసి

వ్యధల కడలిలో మజిలీ చేసా

.

నాదీ అన్నది మనిషికి లేదు

ప్రేమ అన్నది నిత్యం కాదు

చావూ పుట్టుక దైవాధీనం

కాలం ఆడే మాయాజూదం

.

రెండు ముక్కల్లో భగవంతుడు

తనదికానిది అంటూ ఏదీలేని తనుకానిది అంటూ ఏదీకాని బ్రహ్మపదార్థమే భగవంతుడు

భార్యాబాధితాష్టకం

దేవుని మించిన తోడు
రాముని మించిన ఱేడు
భర్తని మించిన పనోడు
వెదకిన దొరకరు ఏనాడు

కాలము వేసెను గాలము
పెళ్లొక మాయాజాలము
భార్యకు భర్తే దైవము
మరి ఎందుకు నిత్యము కయ్యము

రెక్కలు విరిగిన పక్షులు
చెట్లుగ మారని విత్తులు
కత్తులు పోయిన శూరులు
పతులుగ మారిన పురుషులు

తిరిగెను ఎన్నో గుళ్ళు
వేసెను మూడే ముళ్ళు
వాచెను రోజూ ఒళ్లు
అయ్యో పాపం మొగుళ్ళు

క్షయుడై పోయెను చంద్రుడు
సగమై పోయెను శివుడు
సంద్రము దాటెను రాముడు
దేవుడి పాపమె మగడు

పెళ్ళాం పట్టిన పంతము
తీర్చిన కథ సుఖాంతము
లేనిచో సాధింపే జీవితాంతము
ఇదే అసలు సిసలు వేదాంతము

రాయిని తన్నగనేల
గోడను గుద్దుటనేల
నిప్పున దూకుటనేల
భర్తగ మారగనేల?

వచ్చెడి భావము ఆగదు
శతకము రాసిన చాలదు
ఇది నా భార్యకు నిజముగ నచ్చదు
నను కొట్టక మాత్రము వదలదు

మూడు ముళ్ళు వేసేటప్పుడు జీవితానికి చిక్కుముళ్ళు వేసుకుంటున్నామని తెలియక మురిసిపోయి, ఆ తరువాత ఎంత ప్రమాదంలో పడ్డామో తెలుసుకుని జడిసిపోయి.. నోరెత్తలేక, చెవులు మూసుకోలేక, ముఖంతో నవ్వుతూ మనసుతో ఏడుస్తూ, జీవితమనే బండికి ఎద్దులా మారి భార్యనే వెలకట్టలేని బరువును మహరాణిలా ఎక్కించుకుని ఈడుస్తూ ఒగరుస్తూ జీవిస్తున్న ప్రతి భార్యాబాధిత భర్తకు ఈ  అష్టకం అంకితం.