నిన్ను చుడాలనిపిస్తే. ..

నిన్ను చుడాలనిపిస్తే అద్దంలో నన్ను చూసుకుంటున్నా
నీతో మాట్లాడాలనిపిస్తే నాతో నేను మాట్లాడుకుంటున్నా
నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలనిపిస్తే కళ్ళు మూసుకుని
నా హృదయంలో ఏం జరుగుతుందో గమనించుకుంటున్నా

ప్రకటనలు
Published in: on మార్చి 11, 2015 at 7:48 ఉద.  వ్యాఖ్యానించండి  
Tags: ,

అష్టమూర్తి

తొలియడుగుకు తలమునీవు తుది నిదురకు
పాన్పు నీవు నడుమ జీవి బ్రతుకు కొరకు
సర్వమిచ్చు కరుణ నీవు శర్వనామ
అవని రూప అభయమిమ్ము అష్టమూర్తి

సృష్టిమొదట నీవుగలవు సృష్టి పిదప
నీవు గలవు సృష్టి జరుగ నీవుగలవు
సృష్టి లయకు నీవు గలవు సృష్టి భవ
అంబు రూప అభయమిమ్ము అష్టమూర్తి

కానలందు గృహములందు కడలియందు
కాయమందు కడకు జీవి కాష్టమందు
రూఢముగను నీవుగలవు రుద్రనామ
అనల రూప అభయమిమ్ము అష్టమూర్తి

నిదురయందు మెలకువందు నీవులేక
నిలువలేము ప్రాణకరము నీగమనము
ఉర్విలోని జనులకెల్ల ఉగ్రనామ
అనిల రూప అభయమిమ్ము అష్టమూర్తి

నాదజనన నిలయమై అనంతతత్వ
భూతమై విశ్వకోటినిమిడ్చుకొన్న
విమల సత్య దైవంబగు భీమనామ
అంబరముగ అభయమిమ్ము అష్టమూర్తి

నీగమనము కాలమగును నీకిరణము
ధరకు వెలుగు ఆరొగ్యప్రదాత, గొలుచు
జనులు నీరూపు కనుచు ఈశాననామ
అర్క రూప అభయమిమ్ము అష్టమూర్తి

కడలినందు మనమునందు కదలికలకు
కారకుడవు ఓషధములు కరుణనిచ్చి
దీనులను రక్షించెడి మహదేవనామ
అబ్జ రూప అభయమిమ్ము అష్టమూర్తి

మోహమునకు కారకుడవు మోక్షమునకు
కారకుడవు సకలజీవ కాయములను
జీవుడిగను వెలుగునిన్ను శ్రీపశుపతి
యనుచు కొలుతు అభయమిమ్ము అష్టమూర్తి

రెండు ముక్కల్లో ధ్యానం

.
ధ్యానం అంటే బయటి కళ్ళు మూసుకోవడం కాదు లోపలి కళ్ళు తెరచుకోవడం
.

ఎద -వ్యధ

ఎద ఎదకు ఎన్నెన్నో కథలు

ప్రతికథకు మరెన్నో వ్యధలు

కథ మార్చేదెవరు వ్యధ తీర్చేదెవరు?

రాయి తగిలితే నొప్పిరానిదెవ్వరికి

గుండె పగిలితే కన్నీరు పొంగనిదెందరికి

జీవితమన్నాక కష్టం రాకుండాఉంటుందా

ఓ సుఖం వచ్చి ఆ కష్టాన్ని కష్టపెట్టకపోతుందా

గాయగేయము

.
గుండెలోన పొంగుతోంది హాలాహలం
దాన్ని శివునిలాగ మింగలేక
బాధను దిగమింగలేక
ఏమిచేయ పాలుపోక
మునుపటిలా ఉండలేక
మనసంతా మలినమై
ఉచ్చ్వాసే అనలమై
మిగిలినాను జడుడిలా
మహాదుఃఖ కడలిలా
కాయానికి గాయమయితె రక్తధారలు
హృదయానికి గాటుపడితె దుఃఖధారలు
ఇది గుండెకాయమాలపించు గాయగేయము
శృతిలేని గానము గతిలేని గమనము
అప్పటి వరమే ఇప్పటి శరమై
కాలపు వడితో దిగబడగా
విలవిలలాడుతు మనసు కూలుతూ
కన్నీటి సంద్రమై వెలువడగా
వేదన వీణకు వెతల తీగలు
మీటితె పలికే దుఃఖస్వరాలు
మరపు మత్తుయే మహామంత్రము
ఇది మాయాలోకపు అతివిచిత్రము

ఆత్మపూజ

.
మేఘాల మెట్లెక్కి
గగన వీధుల దాటి దాటి
అంతరిక్షపు తోట అచ్చెరువున చేరి
విరిసి రాలిన తీరు
మెరిసే విరితారల నేరిఏరి
నిండు జాబిలి పూగిన్నెలో
కెత్తుకుని హత్తుకుని
మనోమార్గము త్రోవ
తనువాలయము నందు జొచ్చి
హృదయ ఫలకము మీద
దొర్లుతూ పొర్లుతూ
గెంతుతూ ఊగుతూ
పసిపాపని రీతి పాడుతూ ఆడేటి
నిత్యానందరూపునకు
పరమాత్మనామునకు
ప్రేమమీరంగ చేయుదు పాదపూజ
అద్వైత భావమున చేతు ఆత్మపూజ

ప్రేమలోకం

.
ఏటి గట్లపై పరుగులు
చేతుల్లో చేతులేస్తూ అడుగులు
పూలతోటల్లో ఆటలు
కోకిలతో పోటీ పడుతూ పాటలు
.
ఎంత చెప్పినా తరగని ఊసులు
ఆగమన్నా ఆగని నవ్వులు
ప్రపంచంతో పనిలేని చూపులు
పెదాలపై నాట్యం చేసే ముద్దులు
.
బుంగమూతి అలకలు
అలక తీర్చే కౌగిలింతలు
సయ్యాటల్లో చిలిపి విసుర్లు
వెన్నెట్లో తీపి కబుర్లు
.
ఎడబాటంటే వేదన
ప్రతీ అణువుపై ఆరాధన
ప్రేమవాయువే జీవన శ్వాస
కాలం ఇలా ఆగిపోవాలన్నదే ఆశ
.
రోజులు క్షణాలయ్యే లోకం
స్పర్శ ఆనందమయ్యే లోకం
మనసుకు మనసు తోడుండే లోకం
మాటలకందని ప్రేమలోకం
.

ఆవేదన::ఆలోచన

.
మతం కోసం మారణకాండలు చేస్తున్నాం
కులం కోసం సమిష్టి విలువలు కూల్చేస్తున్నాం
ప్రాంతం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నాం
వీటన్నింటిని సృష్టించిన మనిషిని మాత్రం చంపేస్తున్నాం
మారదాం…మారుద్దాం
మతం గోల మానేసి మానవత్వం చాటుకుందాం
కులం గోడ కూల్చేసి సమిష్టి బలం పెంచుకుందాం
ప్రాంతం కంటే మనిషి ప్రాణం గొప్పదని తెలుసుకుందాం
చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి ఒక్క జాతిగా మసలుకుందాం


Published in: on డిసెంబర్ 5, 2009 at 7:25 సా.  Comments (1)  
Tags: , , , , , , ,

మా అమ్మ

అమ్మ మనసు:
మొదటిసారి నా ఏడుపు విన్నప్పుడే
వెన్నలాంటి అమ్మ మనసు కరిగిపొయింది
అప్పట్నుంచి ఇప్పటికీ
నేనే అమ్మకు మనసు
అమ్మ కోపం:
నాకు జ్వరమొచ్చి ఏడ్చినప్పుడు
అమ్మకు దేవుడిపై కోపమొచ్చింది
భయపడ్డ దేవుడు
నన్ను ఆడుకోనిచ్చి అమ్మను నవ్వించాడు
అమ్మ నవ్వు:
నేను పెద్దాణ్ణి ఐపొయానని ఎవరో అంటే
మా అమ్మకు నవ్వొచ్చింది
పెద్దాళ్ళంతా మంచాలపై పడుకుంటారట
నాకుమల్లే అమ్మ ఒడిలో కాదట

నేనే ఎందుకని?

మొగ్గ పువ్వునడిగింది
ఇన్ని పువ్వులుండగా
సుగంధంబు వ్యాపించగా
మళ్ళీ నేనెందుకని? నేనే ఎందుకని?

రాలిన పువ్వుకు బదులుగా
తుమ్మెద నెలవుకు వీలుగా
నువ్వు పూయాలని
నువ్వందుకేనని

పిల్లగోవు తల్లిఆవునడిగింది
ఇన్ని ఆవులుండగా
పాలు యేరులై పారగా
మళ్ళీ నేనెందుకని? నేనే ఎందుకని?
పెరిగిన గరికను మేయడానికి
ప్రకృతి సమతుల్యత కాపాడడానికి
నువ్వు పుట్టావని
నువ్వందుకేనని

విత్తు చెట్టునడిగింది
ఇన్ని చెట్టులుండగా
అడవులన్నీ నిండగా
మళ్ళీ నేనెందుకని? నేనే ఎందుకని?
కాలుష్యము కరిగింపగా
ప్రాణవాయువు నివ్వగా
నువ్వెదగాలని
నువ్వందుకేనని
పసిపాప బ్రహ్మనడిగింది
ఇంత జనం ఉండగా
జగతి అంతా నిండగా
మళ్ళీ నేనెందుకని? నేనే ఎందుకని?
వ్యక్తిగా ఎదగడానికి
సమిష్టిగా కదలడానికి
అపర బ్రహ్మగ మారాలని
నువ్వందుకేనని