గమ్యం

కనులు మూస్తే….రంగుల చీకటి
కనులు తెరిస్తే…వెలుగుల మబ్బులు
నడచిన కొద్దీ…తరగని దారులు
నేలకున్నట్టి నాలుగు చెరగుల
మనిషికున్నవి తీరని అప్పులు
డబ్బు ఒక్కటే కాదప్పు పదార్ధం
మాట తప్పినా అది తీరని బాకీ
ధర్మము, అర్ధము, కామము, మోక్షము
పురుషార్ధంబుల సాధించుటయే
మనిషి గమ్యమని…మునులు పెద్దలు
ఎంత చెప్పినా…గుండెలు బాదిన
ఈర్షాసూయలు, భయకోపాలు
పట్టిన మనిషిని మార్చుట మాత్రం
కష్ట సాధ్యమే అదేమి చిత్రం
ఉన్నదున్నది ఒక్కటె సూత్రం
పరి పరి విధముల ఆలోచించుట
అతనిని అతనే అభినందించుట
మనసుని ఆపే ధ్యానం చేయుట
తనపై తనకు నమ్మక ముంచుట
మనిషి చేసిన దేవుని రూపం
మార్చలేదురా ఖర్మపు శాపం
జీవితానికి ఎన్నో మెట్టులు
మెట్టు మెట్టు పై ఎన్నో ముల్లులు
ముళ్ళ బాటను దాటాలంటే
ధైర్యపు చెప్పులు వాడాలంతే
కృష్ణుడు, జీసస్, బుద్ధుడు, ప్రవక్త
ఎందరు పుట్టిన, ఎన్ని చెప్పినా
నీకు నువ్వుగా కదిలే వరకూ
బుర్రకు బూజు వదిలే వరకూ
దొరకదు సోదర విజయపు కాంతి
దొరికే వరకు ఉండదు శాంతి
చిన్న నవ్వుతో మనసుల గెలువు
తోటివారికి అండగ నిలువు
గతం కళ్ళకు గంతలు కట్టు
చేసేపనిలో దృష్టిని పెట్టు
భవిషత్ బ్రహ్మవు నీవే ఒట్టు
సంఘపు నీతిని గంగలొ ముంచు
నమ్మితె నీ హృది నిను నడిపించు
పూర్తిగ నమ్మకు ఎవ్వరినైనా
మితృలు ఎవరో, శతృవులెవరో
చెప్పుట కష్టము చివరకు అయినా
నీకు నువ్వుగా భుజం తట్టుకో
నీ ప్రతిబింబం కళ్ళ కద్దుకో
ఒక్కొక్కడుగూ వేస్తూ పోతే
ప్రతీ అడుగుని ఆస్వాదిస్తే
జీవిత మధురిమ విధం తెలిస్తే
ప్రతీ పథంబు గమ్యంబేనని
చుట్టూ ఉన్నది రమ్యంబౌనని
తెలిసిన నాడు ౠషివౌతావు
మరణించాకా జీవిస్తావు

The URI to TrackBack this entry is: https://naagola.wordpress.com/2009/11/03/%e0%b0%97%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

One Commentవ్యాఖ్యానించండి

  1. చాలా చాలా బాగుంది 🙂


వ్యాఖ్యానించండి