చిత్రము ఈశా!

హరియందుము శివుడందుము
తిరుపతి కాశీలు పోయి తిరుగాడెదమూ
పరికింపము మా హృదిలో
చిరుదివ్వెగ వెలుగు నిన్ను చిత్రము ఈశా!

ప్రకటనలు

ఏమి భాగ్యము గణపయ్యా..

సీ.

గోరుముద్దలు నీకు గోముగా పెట్టుచూ
……భువనేశ్వరీమాత ముద్దుసేయ
తొడపైకి నెక్కింప తూగాడుచుండగా
……విశ్వగురుడు నీకు విద్యనేర్ప
కైలాసగిరిపైన కార్తికేయుని తోటి
…...కేరింతలాడుతూ కేళిసల్ప
నిరతమూ ఆనంద నిలయుడై వెలిగేటి
……విఘ్నరాజా నిన్ను విరులగొలుతు

తే.

అగము జందెపు వేలుపా ఆయువిమ్ము
కొండకూతురి సూనుడా కుదురునిమ్ము
సకలవిద్యల నాథుడా చదువునిమ్ము
ప్రమథగణముల పాలకా పరమునిమ్ము

హే…శంకరా!

సీ.

కాటిలో నెందుకు కాపురము శివుడా

……కూర్చొమ్ము నాగుండె గూటిలోన

మేటిదేవర నీకు మెడలోన పామేల

…… నాభక్తి ముత్యాల నగను గొనుము

సాటిలేనీ శూలి సామజం తోలేల

……సితమైన మనసిత్తు సిరిగ కట్టు

కూటికోసము కాలకూటమెందుకు స్వామి

 ……ఆత్మనివేదన మారగించు

తే.

పరమ పదమగు పదము శ్రీపతి కొలిచెడి

పదము సకల సురవరులు పట్టు పదము

అన్నపూర్ణకు నిజనిలయ పదము భవ

కడలి దాటించు కాలారి కరుణ పదము

ఓ ప్రియురాలా..

.
ఓ ప్రియురాలా… నీవెంత కఠినాత్మురాలవు
....నిర్ధాక్షిణ్యంగా  నను ప్రేమలో ముంచేసి
ఆ ప్రేమ అలల తాకిడిలో ఊపిరాడని నన్ను చూసి
....ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావా!
.
బంతిపూల వనం నుండి బయటకు రాలేక
....చక్కర్లు కొట్టే సీతాకోకచిలుకలా
నను నీ తలపుల తోటలో బంధీని చేసి
....సంబరపడుతున్నావా!
.
ఇంత విశాల ప్రపంచంలో మరెక్కడా చోటే లేనట్టు
....చిన్నని నా హృదయంలో దూరి
గుండె చప్పుడును లాలిపాటగా మార్చుకుని
....నిద్రపోతున్నావా!
.
ఓ ప్రియురాల..
....నా మనసుకు ఊసువై మేనుకు శ్వాసవై
నేను నువ్వై నువ్వే ఆనందమై.. నన్ను జయించావా!
....నాకోసమే జన్మించావా!.
.

ప్రేమలోకం

.
ఏటి గట్లపై పరుగులు
చేతుల్లో చేతులేస్తూ అడుగులు
పూలతోటల్లో ఆటలు
కోకిలతో పోటీ పడుతూ పాటలు
.
ఎంత చెప్పినా తరగని ఊసులు
ఆగమన్నా ఆగని నవ్వులు
ప్రపంచంతో పనిలేని చూపులు
పెదాలపై నాట్యం చేసే ముద్దులు
.
బుంగమూతి అలకలు
అలక తీర్చే కౌగిలింతలు
సయ్యాటల్లో చిలిపి విసుర్లు
వెన్నెట్లో తీపి కబుర్లు
.
ఎడబాటంటే వేదన
ప్రతీ అణువుపై ఆరాధన
ప్రేమవాయువే జీవన శ్వాస
కాలం ఇలా ఆగిపోవాలన్నదే ఆశ
.
రోజులు క్షణాలయ్యే లోకం
స్పర్శ ఆనందమయ్యే లోకం
మనసుకు మనసు తోడుండే లోకం
మాటలకందని ప్రేమలోకం
.

ఏడుపు

.
పుట్టి మనం ఏడుస్తాం
పోయి మనవాళ్లని ఏడిపిస్తాం
పుడుతూ తెచ్చుకున్నదాన్ని
పొతూ ఇచ్చేస్తామన్న మాట
.
నొప్పి కలిగితే ఏడుస్తాం
నవ్వుల పాలైతే ఏడుస్తాం
బాధ దేహానికైనా హృదయానికైనా
ఏడుపే మొదటి ఓదార్పన్న మాట
.
ఎప్పుడు ఏడ్చినా ఎందుకు ఏడ్చినా
కన్నీళ్ళు వస్తాయి…అవి
గుండె బరువు దించడానికి
అందమైన కళ్ళు కడగడానికి అట
.
చుట్టపు చూపుగా వస్తేనే
ఏడుపుకి అందం
చీటికీ మాటికీ వచ్చేస్తే
జీవితానికి నిరాశే బంధం
.
కష్టమొచ్చినా నష్టమొచ్చినా
ముందుగా ఏడ్చేస్తాం…కానీ
ఆ ఏడుపునే ఏడిపించగలిగితే
జీవితాంతం నవ్వేస్తాం
.

స్పర్శ

.
చిన్నారులకు తల్లి స్పర్శ ఆనందం
పడతులకు పూల స్పర్శ ఆనందం
భావకులకు కవితా స్పర్శ ఆనందం
ప్రేమికులకు ఒకరి స్పర్శ ఒకరికి ఆనందం
.
బాధితులకు ఓదార్పు స్పర్శ ఆనందం
ఎదిగేవారికి ప్రోత్సాహపు స్పర్శ ఆనందం
గెలిచిన వారికి అభినందన స్పర్శ ఆనందం
జీవితం విలువ తెలిస్తే నీ స్పర్శ నీకానందం
.

పెదవులు

.
చిరునవ్వులను చిందించేవి
తేనె పలుకులను పలికించేవి
శృంగారానికి ముందుండేవి
ముద్దులు ఇచ్చి మురిపించేవి
.
పాలమీగడలా మెత్తనైనవి
పూల మేనులా అందమైనవి
సుధారసముతో తయారైనవి
వర్ణనకందని పెదవులవి
.