గుండె అన్నదీ కుండేనేమో

.

గుండె అన్నదీ కుండేనేమో

కన్నీళ్లతొ అది నిండాలేమో

బాధ బ్రతుకూ తావి విరులు

విడివడి ఎరుగని ఆత్మబంధువులు

.

చినుకు స్పర్శతో పులకించిన విరి

బ్రతుకు తోటలో విరబూసినది

పూసిన విరి ఆ చినుకును కానక

పూరెక్కలు ముక్కలై విలపించినది

.

వలచిన మనసుని గెలుచుట కోసం

మనసులొ మనిషిని చేరుట కోసం

కలల అలలపై పయనము చేసి

వ్యధల కడలిలో మజిలీ చేసా

.

నాదీ అన్నది మనిషికి లేదు

ప్రేమ అన్నది నిత్యం కాదు

చావూ పుట్టుక దైవాధీనం

కాలం ఆడే మాయాజూదం

.

ప్రకటనలు

గాయగేయము

.
గుండెలోన పొంగుతోంది హాలాహలం
దాన్ని శివునిలాగ మింగలేక
బాధను దిగమింగలేక
ఏమిచేయ పాలుపోక
మునుపటిలా ఉండలేక
మనసంతా మలినమై
ఉచ్చ్వాసే అనలమై
మిగిలినాను జడుడిలా
మహాదుఃఖ కడలిలా
కాయానికి గాయమయితె రక్తధారలు
హృదయానికి గాటుపడితె దుఃఖధారలు
ఇది గుండెకాయమాలపించు గాయగేయము
శృతిలేని గానము గతిలేని గమనము
అప్పటి వరమే ఇప్పటి శరమై
కాలపు వడితో దిగబడగా
విలవిలలాడుతు మనసు కూలుతూ
కన్నీటి సంద్రమై వెలువడగా
వేదన వీణకు వెతల తీగలు
మీటితె పలికే దుఃఖస్వరాలు
మరపు మత్తుయే మహామంత్రము
ఇది మాయాలోకపు అతివిచిత్రము

బాధ

.
ఆమె నా జీవితం లోకి వచ్చేంతవరకూ
గుండెల్లో ఎవరూ లేరే అన్న బాధ
వచ్చాక…తనను నా ప్రేమలో
ముంచెత్త లేకపోతున్నానే అన్న బాధ
నా ప్రేమను తనపై కురిపించినా
తను తీసుకోలేకపోతుందే అన్న బాధ
తను నన్ను వద్దను కున్నప్పుడు
ఎందుకిలా జరిగిందా అన్న బాధ
తను తిరిగి నా దగ్గరకు వచ్చేసినప్పుడు
మళ్ళీ వెళిపోతుందేమోనన్న బాధ
ఇప్పుడు నేను తనని వద్దనుకున్నప్పుడు
మళ్ళీ వచ్చేస్తుందేమోనన్న బాధ
అన్నిటికన్నా మిన్నగా
నాకు నేను దూరమైపోతున్నానేమో అన్న బాధ