గుండె అన్నదీ కుండేనేమో

.

గుండె అన్నదీ కుండేనేమో

కన్నీళ్లతొ అది నిండాలేమో

బాధ బ్రతుకూ తావి విరులు

విడివడి ఎరుగని ఆత్మబంధువులు

.

చినుకు స్పర్శతో పులకించిన విరి

బ్రతుకు తోటలో విరబూసినది

పూసిన విరి ఆ చినుకును కానక

పూరెక్కలు ముక్కలై విలపించినది

.

వలచిన మనసుని గెలుచుట కోసం

మనసులొ మనిషిని చేరుట కోసం

కలల అలలపై పయనము చేసి

వ్యధల కడలిలో మజిలీ చేసా

.

నాదీ అన్నది మనిషికి లేదు

ప్రేమ అన్నది నిత్యం కాదు

చావూ పుట్టుక దైవాధీనం

కాలం ఆడే మాయాజూదం

.

ప్రకటనలు

ప్రియా.. దరిజేరవా

ప్రియా..
.
నా ఊహా తుమ్మెదలు
నీ వదన పుష్పంపై వ్రాలి
చిరునవ్వు మకరందాన్ని గ్రోలి
ఆనంద లాస్యమాడుతున్నాయి
.
ప్రేమవాయువు నా ఉచ్చ్వాసై
గుండెల్లోనున్న నిన్ను తాకి
సుగంధభరిత నిశ్వాసై
పరవళ్ళు త్రొక్కుతూ పరుగులిడుతోంది
.
నీ రూపం నే కనురెప్పవేసినపుడు
నల్లని చీకటిలో తెల్లని శశిరేఖలా
కన్నులు విప్పారినపుడు
అంతటా తానైన సర్వవ్యాపిలా కనిపిస్తోంది.
.
ఓ ప్రియా.. అనుక్షణం నీకై తపించే నాకై
.
తనతో పరిగెడుతూ ఆటలాడుతున్న
బుల్లిపిట్ట అలసిపోతే జాలిపడి
చినుకులా జారిపడ్డ కృష్ణమేఘంలా
.
బలంగా వీచిన గాలికి
తనపైనుండి రివ్వున ఎగిరిపోయిన తుమ్మెదకు
ఆ గాలితోనే సుగంధ రాయబారమంపిన పుష్పరాజంలా
.
పగలంతా కనపడలేదని
అలిగి ముడుచుకున్న కలువకు
నిశిలో వెన్నెల ముద్దులు పెట్టి
విప్పారేలా చేసిన నిండు జాబిలిలా
.
నవరస మాలికవై నా మనోసామ్రాజ్య ఏలికవై
కోయిల గానమై విడదీయరాని బంధమై
ఓ ప్రియా… నువు నా దరిజేరవా

.

ప్రేమలోకం

.
ఏటి గట్లపై పరుగులు
చేతుల్లో చేతులేస్తూ అడుగులు
పూలతోటల్లో ఆటలు
కోకిలతో పోటీ పడుతూ పాటలు
.
ఎంత చెప్పినా తరగని ఊసులు
ఆగమన్నా ఆగని నవ్వులు
ప్రపంచంతో పనిలేని చూపులు
పెదాలపై నాట్యం చేసే ముద్దులు
.
బుంగమూతి అలకలు
అలక తీర్చే కౌగిలింతలు
సయ్యాటల్లో చిలిపి విసుర్లు
వెన్నెట్లో తీపి కబుర్లు
.
ఎడబాటంటే వేదన
ప్రతీ అణువుపై ఆరాధన
ప్రేమవాయువే జీవన శ్వాస
కాలం ఇలా ఆగిపోవాలన్నదే ఆశ
.
రోజులు క్షణాలయ్యే లోకం
స్పర్శ ఆనందమయ్యే లోకం
మనసుకు మనసు తోడుండే లోకం
మాటలకందని ప్రేమలోకం
.

ప్రేమ

.
ప్రేమ ఏది కాదంటే….
మాటల్లోను పాటల్లోను చెప్పెయ్యగలిగితే
నీ చెవులు వాటిని వినెయ్యగలిగితే
అది కాదు ప్రేమ
.
కథల్లోను కవితల్లోను వ్రాసెయ్యగలిగితే
నీ కళ్ళు వాటిని చదివెయ్యగలిగితే
అది కాదు ప్రేమ
.
అమ్మాయి బాగుందని అందంగా నవ్విందని
నీ గుండె లయ తప్పితే
అది కాదు ప్రేమ
మరి ప్రేమంటే…..
ప్రతి మాట పాటలా వినిపిస్తే
అది ప్రేమ
మంచి తప్ప మరేమీ కనిపించకపోతే
అది ప్రేమ
తను నువ్వు ఒకటే అనిపిస్తే
అది ప్రేమ
ఇవ్వడమే తప్ప తీసుకోవాలనే కోరిక లేకపోతే
అది ప్రేమ
.