భరింపుమీశా!

ఆకలి దప్పిక తీరగ
నాకెన్నడు గుర్తురావు నా సిరియందున్
శోకము లేశము కలిగిన
నీకిది తగునా యనేడ్తు నిక్కము ఈశా!

నాకు ఆకలి, దప్పిక తీరినప్పుడెపుడూ నీవు గుర్తురావు. అదంతా నా అదృష్టం అంటాను. కానీ దుఃఖం కొంచెం కలిగినా, నీకిది తగునా అంటూ నిన్ను నిందిస్తూ ఏడుస్తాను. ఇది మాత్రం తప్పదు ఈశా.

ప్రకటనలు

నా…రాముడు

ఇనవంశ చంద్రుడై ఈశ్వరుడు నరుడై

…..అవతరించెను బ్రోవ అవని యందు

ధర్మమే తనువాయె తత్వమే శమమాయె

…..శ్రీదేవి సగమాయె శివుడు బంటు

శ్రుతిపథపు అడుగు సుధ చిలుకు పలుకు

.….సౌధామినీ హాస ఝరులనొలుకు

కమనీయ రూపమై కారుణ్య హృదయమై

.….రంజిల్లు నా స్వామి రామ మూర్తి

….

భవుని ధనువు మించు బరువు భవము నాది

అసుర మూకల బోలిన అహము నాది

కావుమో రఘురామ ఆకాస శ్యామ

మోహ మదముల గూల్చు సమ్మోహ నామ

హే… జగజ్జననీ!

క.       దుర్జన భంజని నగసుత
          ధూర్జటి రంజని హరినుత తోయజ నేత్రిన్
          ఘర్జిత సింగపు గామిని
          వర్జిత జన్మునిగజేయు పావన దుర్గా

తాత్పర్యము: దుర్జనులను నశింపజేయునది,  ధూర్జటియైన పతి పరమశివుని రంజింపజేయునది, పర్వతరాజు హిమవంతుని పుత్రికయైనది, లోకపాలకుడైన హరిచేత నమస్కరింపబడునది, కమలముల వంటి కన్నులు కలిగినది, ఘర్జన చేయు సింహము మీద సంచరించునది, లోకపావని యగు దుర్గామాతా… నన్ను జన్మరహితునిగా జేయుము తల్లీ.


హే… కృష్ణా!

క.       కన్నాయని పిలువ జనని
          దన్నుగ నిలచిన బుడతలు దౌడులు తీయన్
          ఉన్నపళము దబ్బునపడ
          వెన్నను పొర్లాడు కృష్ణు ప్రియమున కొలుతున్

తాత్పర్యము:  మిత్రుల భుజములమీదనెక్కి, ఉట్టి కట్టిన వెన్నకుండను తీయబోతున్న తరుణంలో,  కన్నా.. యను యశోద పిలుపు వినగానే మిత్రులందరూ భయంతో ఒక్కసారిగా పరుగులెత్తగా, వెన్నకుండతోపాటు దబ్బున పడిపోయి, నేలనొలికిపోయిన వెన్న మొత్తం ఒంటికి అంటుకుపోయిన కృష్ణ పరమాత్మను అత్యంత ప్రేమతో కొలుతును.

ఏమి భాగ్యము గణపయ్యా..

సీ.

గోరుముద్దలు నీకు గోముగా పెట్టుచూ
……భువనేశ్వరీమాత ముద్దుసేయ
తొడపైకి నెక్కింప తూగాడుచుండగా
……విశ్వగురుడు నీకు విద్యనేర్ప
కైలాసగిరిపైన కార్తికేయుని తోటి
…...కేరింతలాడుతూ కేళిసల్ప
నిరతమూ ఆనంద నిలయుడై వెలిగేటి
……విఘ్నరాజా నిన్ను విరులగొలుతు

తే.

అగము జందెపు వేలుపా ఆయువిమ్ము
కొండకూతురి సూనుడా కుదురునిమ్ము
సకలవిద్యల నాథుడా చదువునిమ్ము
ప్రమథగణముల పాలకా పరమునిమ్ము

హే…శంకరా!

సీ.

కాటిలో నెందుకు కాపురము శివుడా

……కూర్చొమ్ము నాగుండె గూటిలోన

మేటిదేవర నీకు మెడలోన పామేల

…… నాభక్తి ముత్యాల నగను గొనుము

సాటిలేనీ శూలి సామజం తోలేల

……సితమైన మనసిత్తు సిరిగ కట్టు

కూటికోసము కాలకూటమెందుకు స్వామి

 ……ఆత్మనివేదన మారగించు

తే.

పరమ పదమగు పదము శ్రీపతి కొలిచెడి

పదము సకల సురవరులు పట్టు పదము

అన్నపూర్ణకు నిజనిలయ పదము భవ

కడలి దాటించు కాలారి కరుణ పదము

తెలుగు పాట

నెలరాజు నగవులు సెలయేటి పరుగులు

కలగలసి వెలిగేటి తెలుగింటి పదములు

రామచిలుకలు మెచ్చు రసరమ్య పలుకులు

అప్సరల భంగిమల అక్షర క్రమములు || అప్సరల||

 

అ అనగ అమ్మనుచు ఆ అనగ ఆవనుచు

తొలిపూజనీయులే తొలుత పదములు కాగ

సంస్కారవంతమగు ఈ భాష నీ భాష

చివురాకు రెపరెపల మన తెలుగు భాష || చివురాకు ||

 

అవధాన విద్యయును అందాల పద్యమును

సొంతమగు సరళమగు అపురూప భాష

అర్చింపగానిట్టి అమృతమయ భాషను

నర్తింపనీవోయి నీ నోట తెలుగును ||  నర్తింపనీవోయి ||

అసలుమనిషి

…..బొటనవ్రేలు పరిమాణంలో ఉన్న కాంతి దశదిశలా తన కిరణాలను ప్రసరిస్తోంది. దేదీప్యమానమైన ఆ కాంతిలో సమస్తమూ కనబడుతోంది. ఆ ప్రదేశములో నవ్వులూ లేవు, ఏడుపులూ లేవు. గంభీరత్వము లేదు, కోమలత్వమూ లేదు. అసలు ఆలోచనలే లేవు. ఉన్నదల్లా శాంతి, దాని వలన వచ్చిన ప్రశాంతత. ఆ వెలుగులో కనబడుతున్న మనిషి అందగాడు. అతనికి కోరిక, భయం లేవు అందుకే బాధ లేదు. సుఖాపేక్ష లేదు, అందుకే దుఃఖమూ లేదు. అసలు అతని ముఖంలో కనబడుతున్న భావం పేరేమిటో? శరీరంలోని అణువణువూ ఆనంద పదార్థమై, ఆ సర్వాణువుల సంయోగము చేత జనించినదేదో ఒక భావ రూపాన్ని ధరించి అతని ముఖాన్ని ఆవరించినట్లుగా ఉంది. గతము, భవిష్యత్తు స్ఫురణకు వస్తే ఆ మనిషి మాయమైపోతున్నాడు. అతను వర్తమాన రథమెక్కిన నిరాలోచనుడు. ప్రశాంతత పరుపుపై పరుండిన ఆనందపూరితుడు. కామక్రోధ, భయదుఃఖములనే చీకటి దుప్పట్లు కప్పుకోని కాంతిపురుషుడు.

…..అక్కడ నుండి దూరంగా కొన్ని అడుగులు వేయగా గోడ ఒకటి అడ్డు తగిలింది. దానిని దాటగానే మసక చీకటి అలుముకుంది. అక్కడ కొందరేదో చేయబోతున్నారు, మిగిలినవారు వారినది చేయనివ్వకుండా ఆపేస్తున్నారు. అక్కడ ఎక్కడ విన్నా ‘వాళ్లను కిందకు లాగేయండి, లాగేయండి’ అనే శబ్ధాలే వినబడుతున్నాయి. ఆ అసహ్యకర రొదలను వినలేక పరిగెడుతూ ఇంకొంత దూరం వెళ్లగానే మరో గోడ అడ్డు తగిలింది.

…..అక్కడ కనబడిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. మనుషులను బళ్లకు కట్టి ఆ బళ్లనెక్కి వెళుతున్నవారు కనిపించారు. బండి మీదున్న వారు బండికి కట్టబడిన వారిని కర్రలతో మోదుతున్నారు. బళ్లకు కట్టబడినవారి కళ్లు తమకు అలా బండినెక్కే అవకాశం, సమయం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ వాతావరణంలో ఉండలేక, మరికొంత దూరం ప్రయాణించగా అడ్డుతగిలిన గోడ దాటగా కనబడిన ప్రదేశమంతా చిత్రంగా ఉంది.

….. అక్కడందరూ నలుగురేసి, అయిదుగురేసిగా విడిపోయి ఉన్నారు. ప్రతి జట్టులోని పెద్దవారు జట్టులో చిన్నవారిని క్షణం కూడా విడచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంతలో విచిత్రంగా చిన్నవారి నుండి ఇంకొంతమంది పుడుతున్నారు. వీరు పుట్టగానే చిన్నవాళ్లు తమ పెద్దవాళ్లను దూరంగా తరిమివేసి, తమనుండి పుట్టినవారిని జాగ్రత్తగా పట్టుకుని ఆనందిస్తున్నారు. తరిమివేయబడినవారు చేసే ‘నాది, నావారు’ అనే ఆర్తనాదాలతో ఆ ప్రదేశం మారుమ్రోగిపోతోంది.

….. అక్కడ నుండి మరింత దూరం ప్రయాణించగా, అడ్డొచ్చిన గోడ దాటగానే ఉన్న ప్రదేశంలో అందరూ కనబడినవన్నీ దాచేస్తున్నారు. ఒకరి దగ్గరకు ఇంకొకరు వెళ్లగానే వాళ్లు ఖాళీ చేతులు చూపుతూ, తమవద్ద ఏమీ లేవన్నట్టు సంజ్ఞలు చేసుకుంటున్నారు. వాళ్లు అటు వెళ్లగానే, ఆబగా మరిన్ని వస్తువులు తెచ్చుకుని దాచేస్తూ కంగారుపడిపోతున్నారు.

….. ఆ ప్రదేశం నుండి ఇంకొంత దూరం ప్రయాణం చేయగా అడ్డుతగిలిన గోడ చాలా వేడిగా కాలిపోతూ ఉంది. దానిని అతికష్టంమీద దాటగా కనబడిన దృశ్యం భయంకరమైనది. అక్కడవారి కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. శరీరాలు కంపించిపోతున్నాయి. ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటూ అరుస్తున్నారు. అక్కడ ఒక్కక్షణం కూడా నిలువలేక పరిగెడుతూ ఉండగా అడ్డుతగిలిన గోడనెక్కి దూకగా కనబడిన దృశ్యం విబిన్నమైనది.

…..మిగిలిన ప్రదేశాల వారంతా వీరికే పుట్టారా? అన్నట్టుగా ఉన్నాయి వీరి రూపురేఖలు. అక్కడున్నవారంతా వారికెదురుగా ఉన్న డబ్బు, బంగారం, భవంతులు, నగ్నశరీరాల వంక కళ్లార్పకుండా ఆబగా చూస్తున్నారు. వారి ముఖాలలో కొంతసేపు ఉత్సాహం, మరికొంతసేపు నిరుత్సాహం. ఏదైనా చేయగలిగే తెగింపు ఒకసారి, అమ్మో అనే భయం మరోసారి. ఇలా అనేకానేక భావాలు మార్చిమార్చి కనబడుతున్నాయి.

 …..ఇన్ని దృశ్యాలను చూసిన ఆశ్చర్యంలో మెల్లగా అడుగులేస్తూ ఉండగా, ఆ మసక చీకటిలో ఒక మనిషి కనిపించాడు. అతనిని ఎక్కడో చూసిన జ్ఞాపకం. కానీ ఆ జ్ఞాపకమేదో కలలో జ్ఞాపకంలా అనిపిస్తోంది. అతను నవ్వుతున్నాడు, కానీ కొంతసేపటికే ఆ నవ్వు ఏడుపుగా మారిపోతోంది. ముఖంలో ధైర్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా, లోపలి బెరుకు తెలుస్తూనే ఉంది. తానెవరో తనకే తెలియని మనిషి, తానెవరో ఇతరులకు తెలియకూడదని తాపత్రయ పడుతున్నాడు. తానొక నకిలీ. కానీ తనకావిషయం తెలియదు. ఇంతకీ ఎవరీ మనిషి? గుర్తుకువచ్చింది. మొట్టమొదట వెలుగులో కనిపించిన మనిషి. నిజమే! ఈ మనిషి అచ్చూ ఆ మనిషినే పోలి ఉన్నాడు. ఇతనో నకిలీ మనిషి. అంటే మొదట కనబడిన మనిషే ఈ మనిషి యొక్క నిజం మనిషి. వర్తమానం తప్ప మరేమీ ఎరుగని మహామనిషి. దుఃఖ మెరుగని పూర్ణానందపు మనిషి. ఒక్కముక్కలో చెప్పాలంటే… సిసలైన అసలు మనిషి 

…..పైన కనబడినదంతా బాహ్య ప్రపంచం కాదు. దానికంటే ఘనమైనది, విశాలమైనది అయిన అంతర ప్రపంచం. ఆ గోడల మధ్య ఉన్నవారంతా మన మనసుకు పుట్టినవారే. చూసిన ప్రతీది పొందాలనే కోరికతో రగిలిపోయే కాముకుడు, ఆలోచనను చంపేసే కోపంతో ఉగిపోయే క్రోధితుడు, ప్రోగుచేసుకున్నదానిని తృప్తిగా అనుభవించక, భయంతో దాచుకునే లోభి, తన ఆనందాన్ని తనవారనుకున్న ఇతరుల చేతులలో పెట్టి దుఃఖించే మోహితుడు, బలధనాదికారములతో విర్రవీగే మదాంధుడు, తోటివారి ఉన్నతి చూసి ఓర్వలేని మాత్సర్యపరుడు, ఇలా అందరూ మనవారే, మనలో పుట్టినవారే. వీరంతా తమతమ సామ్రాజ్యాలను స్థాపించుకుని మనలోని అసలు మనిషిని బయటకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. మహాబలశాలురయిన వీరి అడ్డు తొలగించడమెలా? అసలుమనిషిని చూసేదెలా? లేక ఎప్పటికీ ఇలా నకిలీమనిషిగా నిరంతర వ్యధతో కుమిలిపోతూ ఉండిపోవల్సిందేనా?

లేదు…అలా ఎప్పటికీ కాదు.

…..అనంత బ్రహ్మండాల పెట్టు అయిన మనస్సనే సువిశాల ప్రపంచాన్ని తనలోనే నిక్షిప్తం చేసుకున్న మనిషికి అసాధ్యమున్నదా? ముమ్మాటికి లేదు. త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే మహోన్నతజీవి అయిన మనిషికి అసాధ్యమన్నదే లేదు. ప్రతిమనిషీ ఎవరికివారే ఒక ఆలోచనచేసి, ధ్యానాది సాధనముల సహాయంతో, నిరంతర ఆత్మవిశ్లేషణతో లోపలివైపుకు ముందడుగు వేసి పయనం మొదలుపెడితే , ఆ ప్రయాణంలో ఏదో ఒకరోజు ఆ ఆలోచనకూడా ఆవిరైపోయి,  అసలుమనిషి కనిపిస్తాడు. ఇంతకాలం అంతరప్రపంచంలో ఎన్నో చీకటి గోడల అవతల ఉండిపోయిన ఆ మనిషి, ఈ బాహ్యప్రపంచంలో విహరించగలుగుతాడు. నిజమైన జీవితాన్ని జీవించగలుగుతాడు.

నందమూరి తారక రామారావు

.
1931 వ సంవత్సరం సెప్టెంబరు 15 వ తారీఖు;మొట్టమొదటి తెలుగు చలనచిత్రం ’భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజు. అప్పటికి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లవాడొకడు తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్నాడు. తను పరిపాలించడానికి ఓ రంగం సిద్ధమౌతున్న సంగతి అతనికి అప్పుడు తెలియదు. కాలంతో పరిగెడుతూ పిల్లవాడు యువకుడయ్యాడు. కాలేజీ చదువుతో పాటు నాటకాలు ఒకవైపు, కుటుంబానికి ఆసరాగా సైకిలు మీద తిరుగుతూ ఇంటింటికీ పాలుపొయ్యడం మరోవైపు. తనమీద ఎక్కి తిరుగుతున్న అతను కృతజ్ఞతాపూర్వకంగా తనను రానున్న రోజుల్లో జెండా ఎక్కిస్తాడన్న విషయం ఆ సైకిలుకీ తెలియదు. ఈలోగా కాలం ఇంకాస్త ముందుకు వెళ్ళి అతనిని ఓ చిన్న పోలీసు ఇనస్పెక్టరు పాత్ర ద్వారా సినిమా రంగంలో ప్రవేశపెట్టింది. ఇక అక్కడనుండి అతను వడివడిగా అడుగులు వేసుకుంటూ తెలుగు ప్రజల గుండెలవైపు వేగంగా రాసాగాడు. స్ఫురద్రూపంతోను, అనుపమాన నటనా కౌశలంతోను తెలుగు చలనచిత్ర సీమలో సార్వభౌమపీఠం అధిష్టించాడు. తెలుగు వారి రాముడుగా, కృష్ణుడుగా, సినిమా దేవుడుగా నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతుడయ్యాడు.
.
నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే. అసలు దానవీరశూరకర్ణ సినిమా చూసిన తరువాత, ఒకవేళ నిజం దుర్యోధనుడు ఈ భూమ్మీదకు వచ్చినా నువ్వు నువ్వుకాదు ఎన్టీఆరే అసలు నువ్వంటావేమో. పాతాళభైరవిలో సాహసం చేసే డింభకుడిగా అలరిస్తే, కన్యాశుల్కం సినిమా చూసిన తరువాత గురజాడ వారి గిరీశం ఎలా ఉంటాడో ఊహించేసుకుంటాం. గుండమ్మకథ సినిమాలో సగం ఊడిపోయిన బొత్తాలున్న చొక్కా, పొట్టి నిక్కరు వేసుకున్న అంజిగాడు కనపడతాడు తప్ప ఎన్టీఆర్ కనిపించడు. పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు. ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. సుమారు మూడు నూర్లు సినిమాలలో నటించిన ఈ నటరత్నానికి లభించిన అవార్డులు మాత్రం లెక్కకు చాలా తక్కువ. తెలుగు కథానాయకులలో దాదాసాహెబ్ ఫాల్కేలు, పద్మభూషణ్ లు పొందిన నటులందరూ ఎవరిని మహానటుడని పొగుడుతుంటారో అటువంటి ఎన్టీఆర్ కి మాత్రం ’పద్మశ్రీ’ తోనే సరిపెట్టేసింది కేంద్రప్రభుత్వం. ఆయన రాజకీయవేత్తకూడా కావడమే ఇందుకు ప్రబలమైన కారణం కావచ్చు.
.
భారతదేశంలో కేవలం ఇద్దరే ఇద్దరు నటులు అటు సినిమారంగం లోను. ఇటు రాజకీయరంగం లోను తారాపథాన్ని అందుకున్నారు. వారిలో ఒకరు తమిళుల అన్న ఎమ్జీయార్ కాగా ఇంకొకరు తెలుగువారి అన్న ఎన్టీఆర్ . సినిమా కృష్ణునిగా ధర్మసంస్థాపనకోసం అవతరిస్తానని అభయం ఇచ్చిన ఎన్టీఆర్ , ’తెలుగుజాతి ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయ అవతారం ఎత్తాడు. తెలుగుదేశాన్ని స్థాపించి రాజకీయాల్లో నెలల బాలుడిగా ఉండగానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆడవారికి ఆస్తిలో వారసత్వపు హక్కు, కిలో రెండురూపాయిల బియ్యం, మద్యపాన నిషేదం, ట్యాంక్ బండపై తెలుగు మహామహుల విగ్రహ ప్రతిష్ట, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ స్థాపన మొదలైన కార్యక్రమాలు అతని ఆచరణశీలత్వానికి ప్రతీకలు. కానీ రంగుల బురదవంటి రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత బుద్ధికి బురద అంటక మానదు. కొందరు రంగుని చూసి మురిసిపోతుంటే, ఇంకొందరు బురదను చూసి ఛీత్కరించుకుంటారు. ఈ పరిస్థితికి ఎవ్వరూ అతీతులు కారు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులూ, దగ్గరవారి రాజకీయ అవసరాలు కలసి అతనిని ముఖ్యమంత్రి పీఠం నుండి తోసివేసాయి. దశాబ్ధాలపాటు తెలుగు చలనచిత్రసీమని, ఏడేళ్ళపాటు తెలుగు నేలని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ అవమానకరరీతిలో పదవి నుండి ఆ తరువాత ఈ లోకం నుండి నిష్క్రమించాడు. గెలుస్తూ బ్రతికిన ఎన్టీఆర్ ఓడిపోతూ మరణించాడు. తెలుగులో ఎంతమంది గొప్పనటులు వచ్చినా తరాలు దొర్లినా ’మహానటుడి’ స్థానం మాత్రం ఆచంద్రతారార్కం తనకే సుస్థిరం చేసుకుని ఈ సినిమా రాముడు నిజం దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు.
.

స్వార్థం

.
ఒక జీవిని పుట్టించి దానిని నచ్చినట్టు ఆడించి వినోదించే వాడొకడున్నాడు. వాడు మనుషులకి తెలియకపోవడం, తెలుసుకోవడం, తెలుసుండటం అనే మూడింటినిచ్చి ఆడుకోమన్నాడు. ప్రపంచం మైదానం, ఒప్పుకోవడం తప్పుకోవడం పరిధులు, మంచి చెడు ఆడే విధానాలు, గెలుపు ఓటమి గమ్యాలు, కాలం న్యాయనిర్ణేత, సిద్ధాంతం: గెలిచినవారు గెలిచాం కదా అని ఊరుకుంటే ఓడిపోతుంటారు, ఓడినవారు మళ్లీమళ్లీ ఆడుతుంటే గెలుస్తుంటారు. ఈ ఆటను పుట్టించి వీక్షిస్తూ వినోదిస్తున్న పరమాత్మే ప్రేక్షకుడు.అసలు ఆటకు కావలసిన ప్రదేశం, గమ్యాలు, విధానాలు అన్నీ సిద్ధమైనా ఆట మొదలవ్వలేదు. ఆటగాళ్లందరూ నిశ్చలంగా ఆనందంగా కూర్చుని ఉన్నారు. వీరిని కదిలించడానికి ఆటను మొదలుపెట్టడానికి భగవానుడు ఒక అద్భుతాన్ని సృష్టించి ఆటగాళ్లలో ప్రవేశపెట్టాడు. అంతే ఒక్కసారిగా ఆటగాళ్లందరూ చెలరేగిపోయారు. ఆట మొదలైంది. అలా మొదలైన ఆట ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. నేను నెగ్గాలన్న తపనను మనిషిలో కలిగించడానికి అతనిలో ప్రవేశపెట్టబడిన ఆ అద్భుత శక్తి పేరే స్వార్థం. తన వినోదం కోసం స్వార్థాన్ని పుట్టించిన భగవంతుడే ఈ సృష్టికి మొట్టమొదటి స్వార్థపరుడు.

కాలం గడిచే కొద్దీ స్వార్థం అనేక రూపాలు సంతరించుకుంది. బిడ్డ తనవాడు కాబట్టి బావుండాలనే తల్లి యొక్క స్వార్థం ప్రేమ. అవతలి మనిషి లాభం పొందాలంటే తనూ కొంత లాభం పొందాలనే స్వార్థం వ్యాపారం. కృష్ణుడికి పాండవులు నెగ్గాలన్న కోరిక వెనుక ఉన్న స్వార్థం పేరు ధర్మం. అవతలి వారిని నాశనం చేసైనా సరే తాము బాగుపడాలనుకునే స్వార్థం దురాశ. ఇలా ప్రతి విషయంలోను అంతర్లీనంగా, మూలవస్తువుగా వెలుగొందుతున్న ఈ స్వార్థం చిరంజీవి. స్వార్థం అనేది లేని విషయం లేదు. చివరకు ’నిస్వార్థం’ అనే పదంలో కూడా ’స్వార్థం’ ఉంది.

స్వార్థం ఉండటం తప్పుకాదు. అది నిప్పులాంటిది. నిప్పుతో పొయ్యీ అంటించుకోవచ్చు, ఇల్లూ అంటించవచ్చు. పొయ్యి అంటించినప్పుడు అది ఉపయోగకారి. ఇల్లు అంటించినప్పుడు అది వినాశకారి. అలాగే స్వార్థం కూడా. తన కొడుకు మహావీరుడు కావాలన్న జిజియాభాయి స్వార్థం మరాఠా రాష్ట్రానికి ఛత్రపతిని అందించింది. నా సోదరభారతీయులు అన్నగాంధీజీ స్వార్థం భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా చేసింది. తమ పిల్లలు బావుండాలనే స్వార్థం తల్లిదండ్రులకు లేకపోతే వారిమీద శ్రద్ధ చూపించనూ లేరు, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దనూ లేరు. కానీ తమ పిల్లలు తప్పు చేసినా, నా పిల్లలు కదా అని శిక్షించకుండా ఉపేక్షించేలా చేసే మితిమీరిన స్వార్థం పిల్లలకు తప్పుడు ఆలోచనా విధానం నేర్పిస్తుంది, సమాజాన్ని పాడుచేస్తుంది. అనేకమంది రాజకీయనాయకులు, సంపన్నుల పిల్లలు భ్రష్టుపట్టిపోవడానికి కారణం ఈ స్వార్థమే.

నా ఇల్లు పచ్చని చెట్లతో కళకళలాడాలనే స్వార్థం మనలో కలిగితే పర్యావరణ సమస్య చాలావరకూ పరిష్కారం అయిపోయినట్టే. నా కొడుకు బాగా డబ్బున్నవాడు కావాలని కాకుండా గొప్పమనసున్న వాడు కావాలనే స్వార్థం తల్లికి తండ్రికి కలిగితే అవినీతి సమస్యకు ఆయువు మూడినట్టే. ప్రతి మనిషికీ తనను తాను తెలుసుకోవడం కోసం ఎక్కువ సమయం తనతోనే గడపాలనే స్వార్థం కలిగితే మానసిక దౌర్భల్యాలకు మందు లభించినట్టే. స్వార్థాన్నికూడా నిస్వార్థంగా వాడగలిగితే జీవితానికి అర్థం తెలిసినట్టే.

.