విశ్వనాథ వారి భ్రమరవాసిని

 అలల సవ్వడులలతో హోరెత్తుతూ.. తిరిగి నెమ్మదించి, ప్రశాంతత పొందిందనే లోపుగనే మరింత ఉధృత కెరటాలతో ఎగసిపడి, కల్లోలము నుండి ప్రశాంతతకు, ప్రశాంతత నుండి కల్లోలానికి తన పథాన్ని మార్చి మార్చి, నురగల నగవులో లేక నశ్రువులో చిందించే సాగరానికి సైదోడు… మనిషి మనస్సు. ఆలోచనల, కోరికల పుట్టినిల్లయిన అటువంటి మనస్సును గూర్చి, దాని స్వభావమును గూర్చి ఒక ఆలోచన చేయించి, ఆంతరిక ప్రపంచ జ్ఞానమును, బాహ్య ప్రపంచ విజ్ఞానమును కలబోసి, అక్షరములుగా పోతపోసి  మనకందించిన ఋషులవంటి మహనీయులున్నారు. గత వంద, రెండువందలేండ్ల కాలములో చూసినట్లయితే అటువంటి మహారచయిత ఒకరు పవిత్ర కృష్ణానదీ తీరాన జన్మించి, మనసుకు ఆహ్లాదాన్ని, బుద్ధికి విజ్ఞానాన్ని, ఆత్మకు ఆనందాన్ని కలిగించగల తన రచనలతో కవికుల సమ్రాట్టుయై, రాశీభూత విజ్ఞానమై, ఆంధ్రుల మహద్భాగ్యమై ప్రకాశించెను. ఆ ప్రభావశీల ప్రకాశరేఖలు నేటికీ అనేకుల మనస్సులలో.. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గురువరేణ్యుల రూపమున మూర్తికట్టి వెలుగొందుచున్నవి. పురాణవైర గ్రంథమాల, కాశ్మీర రాజవంశ చరిత్ర, వేయిపడగలు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చెలియలికట్ట మొదలైన అనేకానేక నవలలు కలియుగ రాజవంశ నిజ చరిత్రను, లౌకిక విజ్ఞానాన్ని, ఇంకా మనిషి ఆలోచనపు లోతులను మనకందిస్తాయి. అంతేకాక మనస్సును పట్టి కుదుపుతూ, దానిని దాటి మరింత లోతుగా వెళ్లడానికి ప్రయత్నించే భావనాతరంగమొకటి పుస్తకం చదువుచున్నంతసేపు మనలో కదలాడుతూనే యుంటుంది. అటువంటి రచనలలో నొకటి… కాశ్మీర రాజవంశ చరిత్ర నందలి ఆరవ మరియు ఆఖరి నవల… భ్రమరవాసిని.

కాశ్మీరాధిపతి రణాదిత్యుని శోభనపు గదిలో కథ మొదలౌతుంది. నూత్న వధువు రణరంభాదేవి రాకకై ఎదురుచూస్తున్న రణాదిత్యుని మనస్సును… అప్పటివరకూ జరిగిన సంఘటనలు, గోడలపై చిత్రాలు, ద్వారబంధము ప్రక్కనే ముమ్మూర్తులా రణరంభాదేవిలా యున్న ఒక శిల్పము కలవరపెడుతుంటాయి. అటుపై ఆమె గదిలో అడుగిడిన తదుపరి వారి మధ్య జరిగిన సంభాషణ, రాజును మరింత విస్మయానికి గురిచేస్తుంది. రణరంభాదేవి, తాను సాక్షాత్ శ్రీమహాలక్ష్మి స్వరూపమగు భ్రమరవాసినినని, రణాదిత్యుని కోరిక మేరకు రణరంభగా జనించి ఆతని భార్యనైతినని, ఆమెనాతడు స్పృశింప సాధ్యము కాదని చెప్పును. అంతియేకాక, అతనిని మోహవశుడను జేసిన ద్వారబంధము దగ్గరి ప్రతిమను మంచముపై పరుండబెట్టుమని చెప్పి, తాను భ్రమరమై భ్రమరీనినాదము జేయుచూ ఆతనిని నిద్రపుచ్చుటతో కథ ప్రథమ భాగము పూర్తియగును.

పెండ్లి జరిగిన కులూతదేశము నుండి కాశ్మీరానికి బయలుదేరిన పెండ్లి బృందముతో కులూతదేశ యువరాణి అమృతప్రభ ను కూడా తీసుకువచ్చిన రణరంభాదేవి, మార్గమధ్యములో సర్వాంగీకారముతో ఆమెకు రణాదిత్యునకు వివాహము జరిపించును. శ్రీనగరము చేరిన పిమ్మట రణాదిత్యుడు స్వప్నములలో తన పూర్వజన్మ కథయంతయూ తెలుసుకొనును. అతడు క్రితం జన్మమున మధుసూధనుడను సంపన్న బ్రాహ్మణుడు. పెద్దల బలవంతము మీద ఇష్టము లేకున్ననూ రూపవతి కానటువంటి నీలమణిని వివాహమాడతాడు. నాలుగేండ్ల వారి వివాహజీవితములో అతడామెతో సంసార సుఖమనుభవించడు. కాలక్రమాన వ్యసనపరుడై ఆస్థి యందలి పెద్ద మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. నీలమణి మాత్రం భర్త తెచ్చిన మహాలక్ష్మీ విగ్రహాన్ని ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తూ, శుక్రవారం పూజలు చేస్తూ తన్మయత్వాన్ని అనుభవిస్తుంటుంది. భార్యను అమ్మాయని పిలుచుట ప్రారంభించిన భర్తతో నీలమణి నిష్ఠూరంగా అన్నట్టి “మీకు అమ్మ భార్య. భార్య అమ్మ” మాటలు ఒక శాపంగా పరిణమించి భవిష్యద్కథకు దోహదం చేస్తాయి. మధుసూధనుడు పరివర్తన దశలో యుండగానే, నీలమణి తన సవతి తల్లి అసూయకు బలైపోతుంది. విరక్తుడై తిరుగుచున్న మధుసూధనుడు, అనుకోకుండా ఒకనాడు తన ఇంట పూజామందిరంలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని చదువుతాడు. అందులో వివరింపబడిన అతి క్లిష్టమయిన భ్రమరవాసినీ వ్రతాన్ని బూని, ఇంటినీ, ఉరునీ విడచి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, చివరకు దేవిని ప్రసన్నం చేసుకుంటాడు. అమ్మ అనుగ్రహించేవేళ సమ్రాజ్యాధిపత్యముతోపాటు, వివేకహీనుడై ఆ అమ్మనే భార్యగా కోరతాడు. దయామయి అయిన అమ్మ అనుగ్రహించి అంతర్హితురాలౌతుంది. ఇదీ రణాదిత్యుని స్వప్న వృత్తాంతం. అప్పటి మధుసూధనుడే ఇప్పటి రణాదిత్యుడు, నీలమణియే అమృతప్రభ, సాక్షాత్ శ్రీ వైష్ణవీ మహామాయయగు భ్రమరవాసినియే రణరంభాదేవి.

ఆ తరువాత రణాదిత్యునితో జైత్రయాత్ర గావింపజేసిన రణరంభాదేవి, అతనిని సామ్రజ్యాధిపతిగా, భారత చక్రవర్తిగా చేస్తుంది. చివరగా రణాదిత్యునికి పాతాళలోక వాసముననుగ్రహించి, తాను శ్వేతద్వీపమున వింధ్యపర్వత గుహాంతర్భాగములో భ్రమరవాసినిగా భక్తులననుగ్రహిస్తూ వెలుగొందుతుంటుంది. ఇదీ స్థూలంగా భ్రమరవాసిని కథ.

కథ గొప్పదనం ఒకెత్తయితే, కథకుడు దానిని నడిపిన వైనం రెండెత్తులనవచ్చును. విశ్వనాథ వారి ప్రతిరచన యందు ఒక విశిష్టత యుంటుంది. పాత్రల మధ్య సంభాషణలతో ఒక విషయాన్ని చర్చించి అవకాశమున్నంత వరకూ వాదానికిరువైపులా పదునుపెట్టించి పరుగులెత్తించి చివరకు సత్యాన్ని రూఢీ చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈ కథలో కూడా భ్రమరవాసినీ రణాదిత్యుల మధ్య సంభాషణలటువంటివే. ఇక పాత్ర చిత్రీకరణల విషయానికి వస్తే… రణరంభాదేవి దయాస్వరూపిణి, తనను కోరిన భక్తుని అవివేకాన్ని మన్నించి ననుగ్రహించిన తల్లి. అతని కోరికీడేర్చుటకు మానవకాంతగ జనించి, రణాదిత్యుని పట్టమహిషియై ఆతనికి సామ్రాజ్యత్వమును కట్టబెట్టిన వైష్ణవీ మహాశక్తి. రణాదిత్యుని పాత్ర ఓ తరహా వైచిత్రి కలిగిన పాత్ర. అతడెంతటి మహావీరుడైనప్పటికీ కథలో ముప్పావుపాలు అయ్యేవరకూ జరిగేదంతా ఎందుకు జరుగుచున్నదో, తనకు వచ్చే కలల రహస్యమేమిటో తెలియక సంధిగ్థంలో నడిచే పాత్ర. సౌందర్యం, అమాయకత్వం రంగరించబడిన పాత్ర అమృతప్రభది. భర్త తిరస్కారానికి గురైనప్పటికీ, భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, మహాలక్ష్మీ ఆరాధనలో తన్మయత్వాన్ని పొందే పాత్ర నీలమణిది. నచ్చని పెళ్లి చేసుకుని, వ్యసనపరుడై తిరిగి పరివర్తన చెంది దేవ్యనుగ్రహాన్ని పొందినవాడు మధుసూధనుడు. ఇలా ప్రతిపాత్ర అద్భుతంగా మలచబడి నడపబడినవే.

ఇది యంతా కథేమిటో చెప్పడానికి ఉపయోగపడుతుంది గానీ, కథామాధుర్యాన్ని చవిచూడాలంటే మాత్రం భ్రమరవాసిని చదవవలసినదే. తన్మయమొందిన హృదయముతో నిద్దురలో భ్రమరీనినాదము వినవలసినదే.

ప్రకటనలు

అసలుమనిషి

…..బొటనవ్రేలు పరిమాణంలో ఉన్న కాంతి దశదిశలా తన కిరణాలను ప్రసరిస్తోంది. దేదీప్యమానమైన ఆ కాంతిలో సమస్తమూ కనబడుతోంది. ఆ ప్రదేశములో నవ్వులూ లేవు, ఏడుపులూ లేవు. గంభీరత్వము లేదు, కోమలత్వమూ లేదు. అసలు ఆలోచనలే లేవు. ఉన్నదల్లా శాంతి, దాని వలన వచ్చిన ప్రశాంతత. ఆ వెలుగులో కనబడుతున్న మనిషి అందగాడు. అతనికి కోరిక, భయం లేవు అందుకే బాధ లేదు. సుఖాపేక్ష లేదు, అందుకే దుఃఖమూ లేదు. అసలు అతని ముఖంలో కనబడుతున్న భావం పేరేమిటో? శరీరంలోని అణువణువూ ఆనంద పదార్థమై, ఆ సర్వాణువుల సంయోగము చేత జనించినదేదో ఒక భావ రూపాన్ని ధరించి అతని ముఖాన్ని ఆవరించినట్లుగా ఉంది. గతము, భవిష్యత్తు స్ఫురణకు వస్తే ఆ మనిషి మాయమైపోతున్నాడు. అతను వర్తమాన రథమెక్కిన నిరాలోచనుడు. ప్రశాంతత పరుపుపై పరుండిన ఆనందపూరితుడు. కామక్రోధ, భయదుఃఖములనే చీకటి దుప్పట్లు కప్పుకోని కాంతిపురుషుడు.

…..అక్కడ నుండి దూరంగా కొన్ని అడుగులు వేయగా గోడ ఒకటి అడ్డు తగిలింది. దానిని దాటగానే మసక చీకటి అలుముకుంది. అక్కడ కొందరేదో చేయబోతున్నారు, మిగిలినవారు వారినది చేయనివ్వకుండా ఆపేస్తున్నారు. అక్కడ ఎక్కడ విన్నా ‘వాళ్లను కిందకు లాగేయండి, లాగేయండి’ అనే శబ్ధాలే వినబడుతున్నాయి. ఆ అసహ్యకర రొదలను వినలేక పరిగెడుతూ ఇంకొంత దూరం వెళ్లగానే మరో గోడ అడ్డు తగిలింది.

…..అక్కడ కనబడిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. మనుషులను బళ్లకు కట్టి ఆ బళ్లనెక్కి వెళుతున్నవారు కనిపించారు. బండి మీదున్న వారు బండికి కట్టబడిన వారిని కర్రలతో మోదుతున్నారు. బళ్లకు కట్టబడినవారి కళ్లు తమకు అలా బండినెక్కే అవకాశం, సమయం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ వాతావరణంలో ఉండలేక, మరికొంత దూరం ప్రయాణించగా అడ్డుతగిలిన గోడ దాటగా కనబడిన ప్రదేశమంతా చిత్రంగా ఉంది.

….. అక్కడందరూ నలుగురేసి, అయిదుగురేసిగా విడిపోయి ఉన్నారు. ప్రతి జట్టులోని పెద్దవారు జట్టులో చిన్నవారిని క్షణం కూడా విడచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంతలో విచిత్రంగా చిన్నవారి నుండి ఇంకొంతమంది పుడుతున్నారు. వీరు పుట్టగానే చిన్నవాళ్లు తమ పెద్దవాళ్లను దూరంగా తరిమివేసి, తమనుండి పుట్టినవారిని జాగ్రత్తగా పట్టుకుని ఆనందిస్తున్నారు. తరిమివేయబడినవారు చేసే ‘నాది, నావారు’ అనే ఆర్తనాదాలతో ఆ ప్రదేశం మారుమ్రోగిపోతోంది.

….. అక్కడ నుండి మరింత దూరం ప్రయాణించగా, అడ్డొచ్చిన గోడ దాటగానే ఉన్న ప్రదేశంలో అందరూ కనబడినవన్నీ దాచేస్తున్నారు. ఒకరి దగ్గరకు ఇంకొకరు వెళ్లగానే వాళ్లు ఖాళీ చేతులు చూపుతూ, తమవద్ద ఏమీ లేవన్నట్టు సంజ్ఞలు చేసుకుంటున్నారు. వాళ్లు అటు వెళ్లగానే, ఆబగా మరిన్ని వస్తువులు తెచ్చుకుని దాచేస్తూ కంగారుపడిపోతున్నారు.

….. ఆ ప్రదేశం నుండి ఇంకొంత దూరం ప్రయాణం చేయగా అడ్డుతగిలిన గోడ చాలా వేడిగా కాలిపోతూ ఉంది. దానిని అతికష్టంమీద దాటగా కనబడిన దృశ్యం భయంకరమైనది. అక్కడవారి కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. శరీరాలు కంపించిపోతున్నాయి. ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటూ అరుస్తున్నారు. అక్కడ ఒక్కక్షణం కూడా నిలువలేక పరిగెడుతూ ఉండగా అడ్డుతగిలిన గోడనెక్కి దూకగా కనబడిన దృశ్యం విబిన్నమైనది.

…..మిగిలిన ప్రదేశాల వారంతా వీరికే పుట్టారా? అన్నట్టుగా ఉన్నాయి వీరి రూపురేఖలు. అక్కడున్నవారంతా వారికెదురుగా ఉన్న డబ్బు, బంగారం, భవంతులు, నగ్నశరీరాల వంక కళ్లార్పకుండా ఆబగా చూస్తున్నారు. వారి ముఖాలలో కొంతసేపు ఉత్సాహం, మరికొంతసేపు నిరుత్సాహం. ఏదైనా చేయగలిగే తెగింపు ఒకసారి, అమ్మో అనే భయం మరోసారి. ఇలా అనేకానేక భావాలు మార్చిమార్చి కనబడుతున్నాయి.

 …..ఇన్ని దృశ్యాలను చూసిన ఆశ్చర్యంలో మెల్లగా అడుగులేస్తూ ఉండగా, ఆ మసక చీకటిలో ఒక మనిషి కనిపించాడు. అతనిని ఎక్కడో చూసిన జ్ఞాపకం. కానీ ఆ జ్ఞాపకమేదో కలలో జ్ఞాపకంలా అనిపిస్తోంది. అతను నవ్వుతున్నాడు, కానీ కొంతసేపటికే ఆ నవ్వు ఏడుపుగా మారిపోతోంది. ముఖంలో ధైర్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా, లోపలి బెరుకు తెలుస్తూనే ఉంది. తానెవరో తనకే తెలియని మనిషి, తానెవరో ఇతరులకు తెలియకూడదని తాపత్రయ పడుతున్నాడు. తానొక నకిలీ. కానీ తనకావిషయం తెలియదు. ఇంతకీ ఎవరీ మనిషి? గుర్తుకువచ్చింది. మొట్టమొదట వెలుగులో కనిపించిన మనిషి. నిజమే! ఈ మనిషి అచ్చూ ఆ మనిషినే పోలి ఉన్నాడు. ఇతనో నకిలీ మనిషి. అంటే మొదట కనబడిన మనిషే ఈ మనిషి యొక్క నిజం మనిషి. వర్తమానం తప్ప మరేమీ ఎరుగని మహామనిషి. దుఃఖ మెరుగని పూర్ణానందపు మనిషి. ఒక్కముక్కలో చెప్పాలంటే… సిసలైన అసలు మనిషి 

…..పైన కనబడినదంతా బాహ్య ప్రపంచం కాదు. దానికంటే ఘనమైనది, విశాలమైనది అయిన అంతర ప్రపంచం. ఆ గోడల మధ్య ఉన్నవారంతా మన మనసుకు పుట్టినవారే. చూసిన ప్రతీది పొందాలనే కోరికతో రగిలిపోయే కాముకుడు, ఆలోచనను చంపేసే కోపంతో ఉగిపోయే క్రోధితుడు, ప్రోగుచేసుకున్నదానిని తృప్తిగా అనుభవించక, భయంతో దాచుకునే లోభి, తన ఆనందాన్ని తనవారనుకున్న ఇతరుల చేతులలో పెట్టి దుఃఖించే మోహితుడు, బలధనాదికారములతో విర్రవీగే మదాంధుడు, తోటివారి ఉన్నతి చూసి ఓర్వలేని మాత్సర్యపరుడు, ఇలా అందరూ మనవారే, మనలో పుట్టినవారే. వీరంతా తమతమ సామ్రాజ్యాలను స్థాపించుకుని మనలోని అసలు మనిషిని బయటకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. మహాబలశాలురయిన వీరి అడ్డు తొలగించడమెలా? అసలుమనిషిని చూసేదెలా? లేక ఎప్పటికీ ఇలా నకిలీమనిషిగా నిరంతర వ్యధతో కుమిలిపోతూ ఉండిపోవల్సిందేనా?

లేదు…అలా ఎప్పటికీ కాదు.

…..అనంత బ్రహ్మండాల పెట్టు అయిన మనస్సనే సువిశాల ప్రపంచాన్ని తనలోనే నిక్షిప్తం చేసుకున్న మనిషికి అసాధ్యమున్నదా? ముమ్మాటికి లేదు. త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే మహోన్నతజీవి అయిన మనిషికి అసాధ్యమన్నదే లేదు. ప్రతిమనిషీ ఎవరికివారే ఒక ఆలోచనచేసి, ధ్యానాది సాధనముల సహాయంతో, నిరంతర ఆత్మవిశ్లేషణతో లోపలివైపుకు ముందడుగు వేసి పయనం మొదలుపెడితే , ఆ ప్రయాణంలో ఏదో ఒకరోజు ఆ ఆలోచనకూడా ఆవిరైపోయి,  అసలుమనిషి కనిపిస్తాడు. ఇంతకాలం అంతరప్రపంచంలో ఎన్నో చీకటి గోడల అవతల ఉండిపోయిన ఆ మనిషి, ఈ బాహ్యప్రపంచంలో విహరించగలుగుతాడు. నిజమైన జీవితాన్ని జీవించగలుగుతాడు.

బ్లాగుపుస్తకం మరియు తెలుగు కీబోర్డ్ – ఒక పరిచయం

 ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత ఉరకలేస్తోంది. తమవారు పొరుగు దేశంలో ఉన్నా, పొరుగింట్లో ఉన్నా పెద్దతేడా ఏమీ లేదన్నంతగా సమాచార సాంకేతికత అభివృద్ధి చెందింది. మెల్లిమెల్లిగా కనుమరుగు వైపుకు పయనిస్తున్న చిన్నపాటి ఎన్నో భాషలు ఇంటర్నెట్ పుణ్యాన తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం ఇంగ్లీషు మాత్రమే ఇంటర్నెట్ భాషగా చలామణీ అయ్యేది. ఎవరితోనైనా ఇంటర్నెట్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్నా, తమ అభిప్రాయాలను నలుగురితో పంచుకోవాలన్నా ఇంగ్లీషే శరణ్యం. అందుకే, ఇంగ్లీషు వచ్చిన కొద్దిమందికి తప్ప మిగిలిన జనసామాన్యానికి ‘ప్రపంచం ఓ కుగ్రామం’గా మారిందన్న మాటలో పూర్తిస్థాయి వాస్తవం కనబడేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో పెనుమార్పు వచ్చింది. ప్రపంచం నలుమూలలా అనేక భాషలు ఇప్పుడు కంప్యూటర్ తెరలపై దర్శనమిస్తున్నాయి. వివిధ దేశాలలో ఉన్న తమవారితో మాతృభాషలోనే సందేశాలు పంపుకునే అవకాశం అన్ని భాషలవారికీ లభించింది. ఈ ఒరవడిలో వివిధ భాషలకు విస్తృత ప్రచారం కలిగించగల అత్యుత్తమ మాధ్యమంగా నిలబడిన వ్యవస్థ వెబ్‌లాగ్.  దాని సంక్షిప్త రూపమే, మనకు తరచుగా వినపడే ఇంటర్నెట్ పదం… బ్లాగ్.

కొన్ని సంవత్సరాలుగా తెలుగులో బ్లాగ్స్ వ్రాస్తున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తమలోని సృజనాత్మకతని పుస్తకాల రూపంలో జనంలోకి తీసుకెళ్లలేక పోతున్న కవులు, రచయితలకు ఈ బ్లాగ్స్ గొప్ప ఊరటనిస్తున్నాయి. ఇలా బ్లాగ్స్ వ్రాసేవారి లిస్ట్‌లో వంటావార్పు చేసుకుంటూనే, సరదాగా ఆ వంటలు ఎలా చేయాలో వివరించే మహిళలు ఉన్నారు. ప్రకృతి దృశ్యాలను తమ కెమేరాలతో క్లిక్ మనిపించి, వాటిని బ్లాగ్స్‌లో పోస్ట్ చేసి ఆనందించే పెద్దవారున్నారు. తమపని తాము చేసుకుంటూ, ఖాళీ సమయాలలో తోచిన విషయాల మీద తోచినట్లు వ్రాసుకుని సరదాగా టైమ్‌పాస్ చేసే ఉద్యోగులూ ఉన్నారు. నిరంతరం బిజీగా ఉండే అమితాబ్, అమీర్‌ఖాన్, రామ్‌గోపాల్‌వర్మ వంటి సినీ ప్రముఖులూ ఉన్నారు. కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే చాలా సులువుగా వ్రాయగలిగే ఈ బ్లాగ్స్‌ని వ్రాస్తున్న తెలుగువారి శాతం మాత్రం చాలా తక్కువ. కోట్లమంది తెలుగువారిలో బ్లాగ్స్ చదివేవారి సంఖ్య లక్షల్లో ఉన్నా, వ్రాసేవారి సంఖ్య మాత్రం వేలల్లోనే ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉన్నా, ఒక ప్రధాన కారణం మాత్రం.. బ్లాగ్స్ గురించిన అవగాహనారాహిత్యం. బ్లాగ్స్ ఎలా క్రియేట్ చేయాలో, వాటిలో ఎలా వ్రాయలో, ఏమేమి వ్రాయవచ్చో సరిగా తెలియకపోవడం. సరిగ్గా ఈ సమస్యని తీర్చడానికా అన్నట్లు ఈ మధ్యకాలంలోనే పుస్తక విపణిలోకి, తెలుగువారి ముంగిళ్లలోకి ప్రవేశిస్తున్న పుస్తకం… సురవర.కాం వారి ‘బ్లాగు పుస్తకం’.

ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పనిచేసిన అనుభవం కలిగినటువంటి వ్యక్తి, సాధ్యమైనంతమంది తెలుగువారిని బ్లాగ్‌ప్రపంచ భాగస్వాములుగా చేయాలనే ‘బ్లాగు పుస్తకం’ ఆలోచనకు మూలబిందువు అయిన శ్రీ చావా కిరణ్ గారు, “మనసులో మాట” బ్లాగ్ ద్వారా సంవత్సరాలుగా తెలుగు బ్లాగర్లకు సుపరిచితమైన శ్రీమతి సుజాత గారు, తెలుగుభాషకు తనవంతు సేవ చేయాలన్న తపన కలిగిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, “సత్యాన్వేషణ” బ్లాగర్ అయిన రహ్మనుద్దీన్ షేక్ ఈ పుస్తకానికి రూపకర్తలు.

ఇక ఈ పుస్తకంలోని విశేషాల గురించి ప్రస్తావించాల్సి వస్తే..

  1. ఇది తెలుగులో బ్లాగ్స్ గురించి వచ్చిన మొట్టమొదటి పుస్తకం.
  2. బ్లాగ్ క్రియేషన్‌కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా విడిచిపెట్టకుండా వివరించబడింది.
  3. అవసరమైన ప్రతిచోటా సులభంగా అర్థం చేసుకోవడానికి కలర్ స్క్రీన్‌షాట్స్ జతచేయబడ్డాయి.
  4. బ్లాగ్స్ ఉపయోగించడంలో ఎదురయ్యే సాధక బాధకాలు సోదాహరణంగా వివరించబడ్డాయి.
  5. ఈ-మెయిల్ క్రియేట్ చేసుకునే విధానం పొందుపరచబడింది.
  6. కంప్యూటర్ మీద, ఇంగ్లీష్ భాష మీద కొద్దిపాటి అవగాహన ఉన్న ప్రతీవారు చాలా సులభంగా బ్లాగ్ క్రియేట్ చేసుకోగలిగేటంతటి సరళతలో పుస్తకం వ్రాయబడింది.

ఎంత గొప్ప ఆలోచనైనా అది కార్యరూపం ధరించే సమయంలో కొన్ని పొరపాట్లు దొర్లడం చాలా సహజం. అటువంటి పొరపాట్లు ఈ పుస్తకం ముద్రణలో కూడా దొర్లాయి. క్రొత్త అధ్యాయాలను క్రొత్త పేజీలలో మొదలుపెట్టక పోవడం, పదాల మధ్య అనవసరమైన దూరాలు, కొన్ని అక్షర దోషాలు, ఒకే రచయిత కాకపోవడం వలన కనబడే పదప్రయోగాల మధ్య అంతరం మొదలైనవి ఈ పొరపాట్లలో కొన్ని. ధర కూడా కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. కానీ “బ్లాగు పుస్తకం” రూపకర్తల కృషి, పుస్తకం ద్వారా అందించిన విషయం, తెలుగుభాషకు వారు చేస్తున్న సేవ ముందు పై విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సురవర.కాం వారు ఇటీవల కాలంలో మార్కెట్ లోకి విడుదలచేసిన “తెలుగు కీబోర్డ్”, వారు తెలుగుభాషకు చేస్తున్న సేవకు మరో ఉదాహరణ.

ఎటువంటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండా, ఆన్‌లైన్‌తో పనిలేకుండానే తెలుగుభాషలో టైప్ చేసుకోవడానికి ఉపయోగపడే కీబోర్డ్ ఇది. ఇంగ్లీష్, తెలుగు రెండు భాషలలోను టైప్ చేసుకోగలగడమే కాక, అది పూర్తిగా యునీకోడ్ లే-అవుట్‌లో ఉండటం మరో విశిష్టత. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీ, విస్టా, విండోస్ 7, లినక్స్ అపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేయగలిగే ఈ కీబోర్డ్‌తో చాలా సులువుగా కథలు, నవలలు, ఈ-మెయిల్స్ టైప్ చేసుకోవచ్చు. తెలుగులో బ్లాగ్స్ వ్రాసేవారికి ఇది అత్యంత ఉపయోగకరమైన సాధనం.

తెలుగుభాషను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లాలన్న సురవర వారి ఆశయం వల్ల, ఎందరో తెలుగువారు తెలుగుభాషకు సేవ చేసుకుంటూ ఉపాధి పొందే అవకాశాలు వెల్లువలా వస్తాయని ఆశిద్దాం. ఇటువంటి సంస్థను ఆదర్శంగా తీసుకుని తెలుగును సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లగలిగే మరిన్ని సంస్థలు పుడతాయని భావిద్దాం. ఇలా తెలుగుభాషకు, తెలుగుభాషాభిమానులకు చేయూతనిస్తున్నవారిని మనస్ఫూర్తిగా అభినందిద్దాం.

బ్లాగుపుస్తకం మరియు తెలుగు కీబోర్డ్ గురించి మరింత సమాచారం కోసం http://www.suravara.com ను సందర్శించండి.

Published in: on ఫిబ్రవరి 18, 2012 at 9:52 సా.  వ్యాఖ్యానించండి  
Tags: , , , ,

నందమూరి తారక రామారావు

.
1931 వ సంవత్సరం సెప్టెంబరు 15 వ తారీఖు;మొట్టమొదటి తెలుగు చలనచిత్రం ’భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజు. అప్పటికి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లవాడొకడు తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్నాడు. తను పరిపాలించడానికి ఓ రంగం సిద్ధమౌతున్న సంగతి అతనికి అప్పుడు తెలియదు. కాలంతో పరిగెడుతూ పిల్లవాడు యువకుడయ్యాడు. కాలేజీ చదువుతో పాటు నాటకాలు ఒకవైపు, కుటుంబానికి ఆసరాగా సైకిలు మీద తిరుగుతూ ఇంటింటికీ పాలుపొయ్యడం మరోవైపు. తనమీద ఎక్కి తిరుగుతున్న అతను కృతజ్ఞతాపూర్వకంగా తనను రానున్న రోజుల్లో జెండా ఎక్కిస్తాడన్న విషయం ఆ సైకిలుకీ తెలియదు. ఈలోగా కాలం ఇంకాస్త ముందుకు వెళ్ళి అతనిని ఓ చిన్న పోలీసు ఇనస్పెక్టరు పాత్ర ద్వారా సినిమా రంగంలో ప్రవేశపెట్టింది. ఇక అక్కడనుండి అతను వడివడిగా అడుగులు వేసుకుంటూ తెలుగు ప్రజల గుండెలవైపు వేగంగా రాసాగాడు. స్ఫురద్రూపంతోను, అనుపమాన నటనా కౌశలంతోను తెలుగు చలనచిత్ర సీమలో సార్వభౌమపీఠం అధిష్టించాడు. తెలుగు వారి రాముడుగా, కృష్ణుడుగా, సినిమా దేవుడుగా నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతుడయ్యాడు.
.
నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే. అసలు దానవీరశూరకర్ణ సినిమా చూసిన తరువాత, ఒకవేళ నిజం దుర్యోధనుడు ఈ భూమ్మీదకు వచ్చినా నువ్వు నువ్వుకాదు ఎన్టీఆరే అసలు నువ్వంటావేమో. పాతాళభైరవిలో సాహసం చేసే డింభకుడిగా అలరిస్తే, కన్యాశుల్కం సినిమా చూసిన తరువాత గురజాడ వారి గిరీశం ఎలా ఉంటాడో ఊహించేసుకుంటాం. గుండమ్మకథ సినిమాలో సగం ఊడిపోయిన బొత్తాలున్న చొక్కా, పొట్టి నిక్కరు వేసుకున్న అంజిగాడు కనపడతాడు తప్ప ఎన్టీఆర్ కనిపించడు. పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు. ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. సుమారు మూడు నూర్లు సినిమాలలో నటించిన ఈ నటరత్నానికి లభించిన అవార్డులు మాత్రం లెక్కకు చాలా తక్కువ. తెలుగు కథానాయకులలో దాదాసాహెబ్ ఫాల్కేలు, పద్మభూషణ్ లు పొందిన నటులందరూ ఎవరిని మహానటుడని పొగుడుతుంటారో అటువంటి ఎన్టీఆర్ కి మాత్రం ’పద్మశ్రీ’ తోనే సరిపెట్టేసింది కేంద్రప్రభుత్వం. ఆయన రాజకీయవేత్తకూడా కావడమే ఇందుకు ప్రబలమైన కారణం కావచ్చు.
.
భారతదేశంలో కేవలం ఇద్దరే ఇద్దరు నటులు అటు సినిమారంగం లోను. ఇటు రాజకీయరంగం లోను తారాపథాన్ని అందుకున్నారు. వారిలో ఒకరు తమిళుల అన్న ఎమ్జీయార్ కాగా ఇంకొకరు తెలుగువారి అన్న ఎన్టీఆర్ . సినిమా కృష్ణునిగా ధర్మసంస్థాపనకోసం అవతరిస్తానని అభయం ఇచ్చిన ఎన్టీఆర్ , ’తెలుగుజాతి ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయ అవతారం ఎత్తాడు. తెలుగుదేశాన్ని స్థాపించి రాజకీయాల్లో నెలల బాలుడిగా ఉండగానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆడవారికి ఆస్తిలో వారసత్వపు హక్కు, కిలో రెండురూపాయిల బియ్యం, మద్యపాన నిషేదం, ట్యాంక్ బండపై తెలుగు మహామహుల విగ్రహ ప్రతిష్ట, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ స్థాపన మొదలైన కార్యక్రమాలు అతని ఆచరణశీలత్వానికి ప్రతీకలు. కానీ రంగుల బురదవంటి రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత బుద్ధికి బురద అంటక మానదు. కొందరు రంగుని చూసి మురిసిపోతుంటే, ఇంకొందరు బురదను చూసి ఛీత్కరించుకుంటారు. ఈ పరిస్థితికి ఎవ్వరూ అతీతులు కారు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులూ, దగ్గరవారి రాజకీయ అవసరాలు కలసి అతనిని ముఖ్యమంత్రి పీఠం నుండి తోసివేసాయి. దశాబ్ధాలపాటు తెలుగు చలనచిత్రసీమని, ఏడేళ్ళపాటు తెలుగు నేలని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ అవమానకరరీతిలో పదవి నుండి ఆ తరువాత ఈ లోకం నుండి నిష్క్రమించాడు. గెలుస్తూ బ్రతికిన ఎన్టీఆర్ ఓడిపోతూ మరణించాడు. తెలుగులో ఎంతమంది గొప్పనటులు వచ్చినా తరాలు దొర్లినా ’మహానటుడి’ స్థానం మాత్రం ఆచంద్రతారార్కం తనకే సుస్థిరం చేసుకుని ఈ సినిమా రాముడు నిజం దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు.
.

స్వార్థం

.
ఒక జీవిని పుట్టించి దానిని నచ్చినట్టు ఆడించి వినోదించే వాడొకడున్నాడు. వాడు మనుషులకి తెలియకపోవడం, తెలుసుకోవడం, తెలుసుండటం అనే మూడింటినిచ్చి ఆడుకోమన్నాడు. ప్రపంచం మైదానం, ఒప్పుకోవడం తప్పుకోవడం పరిధులు, మంచి చెడు ఆడే విధానాలు, గెలుపు ఓటమి గమ్యాలు, కాలం న్యాయనిర్ణేత, సిద్ధాంతం: గెలిచినవారు గెలిచాం కదా అని ఊరుకుంటే ఓడిపోతుంటారు, ఓడినవారు మళ్లీమళ్లీ ఆడుతుంటే గెలుస్తుంటారు. ఈ ఆటను పుట్టించి వీక్షిస్తూ వినోదిస్తున్న పరమాత్మే ప్రేక్షకుడు.అసలు ఆటకు కావలసిన ప్రదేశం, గమ్యాలు, విధానాలు అన్నీ సిద్ధమైనా ఆట మొదలవ్వలేదు. ఆటగాళ్లందరూ నిశ్చలంగా ఆనందంగా కూర్చుని ఉన్నారు. వీరిని కదిలించడానికి ఆటను మొదలుపెట్టడానికి భగవానుడు ఒక అద్భుతాన్ని సృష్టించి ఆటగాళ్లలో ప్రవేశపెట్టాడు. అంతే ఒక్కసారిగా ఆటగాళ్లందరూ చెలరేగిపోయారు. ఆట మొదలైంది. అలా మొదలైన ఆట ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. నేను నెగ్గాలన్న తపనను మనిషిలో కలిగించడానికి అతనిలో ప్రవేశపెట్టబడిన ఆ అద్భుత శక్తి పేరే స్వార్థం. తన వినోదం కోసం స్వార్థాన్ని పుట్టించిన భగవంతుడే ఈ సృష్టికి మొట్టమొదటి స్వార్థపరుడు.

కాలం గడిచే కొద్దీ స్వార్థం అనేక రూపాలు సంతరించుకుంది. బిడ్డ తనవాడు కాబట్టి బావుండాలనే తల్లి యొక్క స్వార్థం ప్రేమ. అవతలి మనిషి లాభం పొందాలంటే తనూ కొంత లాభం పొందాలనే స్వార్థం వ్యాపారం. కృష్ణుడికి పాండవులు నెగ్గాలన్న కోరిక వెనుక ఉన్న స్వార్థం పేరు ధర్మం. అవతలి వారిని నాశనం చేసైనా సరే తాము బాగుపడాలనుకునే స్వార్థం దురాశ. ఇలా ప్రతి విషయంలోను అంతర్లీనంగా, మూలవస్తువుగా వెలుగొందుతున్న ఈ స్వార్థం చిరంజీవి. స్వార్థం అనేది లేని విషయం లేదు. చివరకు ’నిస్వార్థం’ అనే పదంలో కూడా ’స్వార్థం’ ఉంది.

స్వార్థం ఉండటం తప్పుకాదు. అది నిప్పులాంటిది. నిప్పుతో పొయ్యీ అంటించుకోవచ్చు, ఇల్లూ అంటించవచ్చు. పొయ్యి అంటించినప్పుడు అది ఉపయోగకారి. ఇల్లు అంటించినప్పుడు అది వినాశకారి. అలాగే స్వార్థం కూడా. తన కొడుకు మహావీరుడు కావాలన్న జిజియాభాయి స్వార్థం మరాఠా రాష్ట్రానికి ఛత్రపతిని అందించింది. నా సోదరభారతీయులు అన్నగాంధీజీ స్వార్థం భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా చేసింది. తమ పిల్లలు బావుండాలనే స్వార్థం తల్లిదండ్రులకు లేకపోతే వారిమీద శ్రద్ధ చూపించనూ లేరు, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దనూ లేరు. కానీ తమ పిల్లలు తప్పు చేసినా, నా పిల్లలు కదా అని శిక్షించకుండా ఉపేక్షించేలా చేసే మితిమీరిన స్వార్థం పిల్లలకు తప్పుడు ఆలోచనా విధానం నేర్పిస్తుంది, సమాజాన్ని పాడుచేస్తుంది. అనేకమంది రాజకీయనాయకులు, సంపన్నుల పిల్లలు భ్రష్టుపట్టిపోవడానికి కారణం ఈ స్వార్థమే.

నా ఇల్లు పచ్చని చెట్లతో కళకళలాడాలనే స్వార్థం మనలో కలిగితే పర్యావరణ సమస్య చాలావరకూ పరిష్కారం అయిపోయినట్టే. నా కొడుకు బాగా డబ్బున్నవాడు కావాలని కాకుండా గొప్పమనసున్న వాడు కావాలనే స్వార్థం తల్లికి తండ్రికి కలిగితే అవినీతి సమస్యకు ఆయువు మూడినట్టే. ప్రతి మనిషికీ తనను తాను తెలుసుకోవడం కోసం ఎక్కువ సమయం తనతోనే గడపాలనే స్వార్థం కలిగితే మానసిక దౌర్భల్యాలకు మందు లభించినట్టే. స్వార్థాన్నికూడా నిస్వార్థంగా వాడగలిగితే జీవితానికి అర్థం తెలిసినట్టే.

.

సచిన్ రమేష్ టెండూల్కర్

.
చిరుజల్లు కురుస్తుంటే చూసి ఆనందిస్తాం. కానీ ఆ ఆనందం కొంతసేపే, వాన వెలిసిపోతుంది. పరిమళిస్తున్న గులాబీ అందాన్ని చూసి ఆస్వాదిస్తాం. అదీ కొంతసేపే, పువ్వు వాడిపోతుంది. కానీ.. ఇరవై రెండు సంవత్సరాలుగా ఒక మనిషి మైదానంలో అడుగుపెడుతుంటే ఆనందంతో చప్పట్లు కొడుతున్నాం. అతను ఆడుతున్నంతసేపు బరువైన ఉచ్చ్వాస నిశ్వాసలతో ఆటను ఆస్వాదిస్తున్నాం. అద్భుతమైన ఆటతోను, మచ్చలేని వ్యక్తిత్వంతోను అశేష క్రీడాభిమానుల్ని రెండు దశాబ్ధాలనుండి ఉర్రూతలూగిస్తున్న ఆ ఉత్తుంగ హిమశిఖరం.. సచిన్ రమేష్ టెండూల్కర్.

ఈ ప్రపంచలోకి వచ్చిన 16 సంవత్సరాలుకే క్రీడా జగత్తుకి పరిచయమయిన సచిన్, కెరీర్ ఆరంభంలోనే పాకిస్థాన్, వెస్టిండీస్ వంటి దేశాలతో ఆడి అప్పటి అరివీరభయంకర ఫాస్ట్ బౌలర్ల భరతం పట్టిన చిచ్చరపిడుగుగా క్రికెట్ అభిమానుల గుండెల్లో దూరిపోయాడు. ఫామ్ తో సంబంధం లేకుండా పాత రికార్డులు తిరగరాస్తూ, క్రొత్త రికార్డులు పుట్టిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. అత్యధిక మ్యాచ్ లు, అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లు ఇలా చెప్పుకుంటూ వెళ్లడం కంటే, క్రికెట్ లో ఉన్న అన్ని వ్యక్తిగత రికార్డులు అని ఒక్క ముక్కలో తేల్చేయడం తేలికేమో. అతని అవార్డులు, రికార్డులు పర్వతాల్లా పేరుకుపోతే, అతని అభిమానులు సంద్రంలా ఉప్పొంగుతుంటారు. సాధారణ రిక్షావాలా మొదలు దేశాధినేతల వరకూ అతని అభిమానగణంలో కొలువుతీరిన వారే.

నాణానికి ఒకవైపు అతని ఆటతీరైతే రెండోవైపు అతని వ్యక్తిత్వం. “నేను దేవుడిని చూసాను, అతను భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాలుగవ నంబరు ఆటగాడిగా బరిలోకి దిగుతాడు” అని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం హెడెన్, సచిన్ అద్భుత ఆటతీరు ముందు మోకరిల్లినా, “క్రికెట్ మతమైతే, సచిన్ దేవుడు” అని క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ ని కీర్తించినా, కోట్లాదిమంది వెలకట్టలేని అభిమానం అతనిని ఆకాశంలో నిలబెట్టినా, సచిన్ మాటల్లో కాని, నడవడిలో కాని కించిత్ అహంకారం కూడా కానరాదు. ముంబాయిలోని సామాజిక సేవాసంస్థ అప్నాలయ ద్వారా అనేకమంది అనాథలకు విద్యతో పాటు ఆహారం, వసతి కల్పిస్తున్నాడు. తండ్రికిచ్చిన మాటకోసం కోట్లు కుమ్మరిస్తామన్నా మత్తుపానీయాలకు ప్రచారకర్తగా వ్యవహరించనన్నాడు. తన నివాస భవన నిర్మాణ సమయంలో చుట్టుప్రక్కలవారికి కలిగే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని “నిర్మాణ సమయంలో వచ్చే శబ్ధాల వలన మీకు కలిగే ఇబ్బందికి నన్ను మన్నించండి. మీ కుటుంబంలో ఒకడిగా మారబోతున్న నాకోసం ఓర్పు వహించండి” అని వినయంగా స్వదస్తూరీతో సంతకం చేసి పంపిన లేఖలు అతని హృదయ వైశాల్యానికి నిలువెత్తు ఉదాహరణలు.

అటువంటి ఉన్నత వ్యక్తిత్వం కారణంగానే, బాల్ ట్యాంపరింగ్ వివాద సమయంలో జాతి యావత్తూ అతనికి అండగా నిలబడింది. క్రికెట్ ఎల్బో గాయం కారణంగా, ఆటనుండి శాశ్వతంగా వైదొలగక తప్పదనుకున్నప్పుడు అతనికోసం ప్రార్థనలు చేసింది. భారతావని అతనిని పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులతో సగౌరవంగా సత్కరించింది. నిజానికి సచిన్ అవార్డులతో కొలవడానికి సాధ్యంకాని అసలు సిసలు భారతరత్నం. అసామాన్య క్రీడానైపుణ్యం, అద్భుత వ్యక్తిత్వం మూర్తీభవించిన అతను యువతకు ఆదర్శప్రాయుడు. వయసు మళ్ళినవారికి ప్రేమ, వాత్సల్యం కురిపించడానికి అర్హమైన ఒక సొంత మనీషి. ఒకే వాక్యంలో చెప్పాలంటే, అతను.. ప్రపంచానికి ఒక సందేశాత్మక భారత రాయబారి.

విశ్వనాథ వారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

.
ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. అంగ్లేయులను మనదేశం నుండి వెళ్ళగొట్టి మనం విజయం సాధించామనుకుంటున్నాం కానీ, వాళ్ళ భాషావ్యవహారాలను మనలో మమేకం చేసి పరోక్షంగా వారే మనపై విజయం సాధించారు. తెలుగువారిపై అనధికార ప్రపంచభాషగా వెలుగొందుతున్న ఆంగ్లభాషాప్రభావం గురించి, మాతృభాషాబోధనావశ్యకత గురించి, ఆంగ్లభాష యదార్థ స్వరూపం గురించి చమత్కార ధోరణిలో రచింపబడ్డ ఆలోచనాత్మక నవల ’విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’. కవిసామ్రాట్ గా లబ్ధప్రతిష్టుడు, జగమెరిగిన సాహితీమూర్తి, పురాణ వైరి గ్రంథమాల, కాశ్మీర రాజవంశ చరిత్ర, నేపాళ రాజవంశ చరిత్ర మొదలగు నవలా సంపుటిల ద్వారా భారతదేశ యదార్థ చరిత్రను మనకందించిన విజ్ఞానఖని, జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్న శ్రీమద్రామయణ కల్పవృక్ష కృతికర్త, వేయిపడగలు సృష్టికర్త, తెలుగుజాతి కన్న అపురూప సాహితీరత్నం కీ.శే. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ నవలారచయిత.

ఈ కథ అంతా రచయిత కలలో జరుగుతుంది. పంచతంత్రం వ్రాసిన విష్ణుశర్మ, భారతం తెనుగించిన కవిబ్రహ్మ తిక్కన స్వర్గంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇంగ్లీషు నేర్చుకోవడానికి వేరు వేరుగా భూలోకం వస్తారు. ఇంద్రుడు సలహా మేరకు వారు రచయిత కలలో ప్రవేశించి తమకు ఇంగ్లీషు నేర్పమంటారు. సరేనన్న రచయిత, ఇక అక్కడ నుండి పడే పాట్లు అన్నీఇన్నీ కావు. ఆంగ్ల శబ్ధాల వ్యుత్పత్తి, అర్థం, ఉచ్చారణ మొదలైన వాటి గురించి విష్ణుశర్మ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రచయిత తికమక పడే సన్నివేశాలు వినోదంతో పాటు ఆలోచననూ కలిగిస్తాయి. నువ్వు అనడానికి ఇంగ్లీషులో ఏమంటారంటాడు విష్ణుశర్మ. దానికి రచయిత YOU ’యు’ అనాలంటాడు. యు అనడానికి U అంటే సరిపోతుందిగా మరి ముందు YO ఎందుకు దండగ అంటాడు విష్ణుశర్మ. అలాగే OBLIQUE, CHEQUE అనే పదాలలో Q ని వాడవలసిన అవసరం ఏమొచ్చింది? కకారాన్ని పలకడానికి K అనే అక్షరం ఉందికదా అంటాడు. The, Bad, Enough పదాల ఉచ్చరణ విషయంలో కూడా విష్ణుశర్మ ప్రశ్నలు రచయితను అయోమయానికి గురిచేస్తాయి. క్యాపిటల్, స్మాల్ లెటర్స్ గురించిన ఆక్షేపణలు, గ్రామర్ విషయంలో Is, Am, Will, Shall ల ప్రయోగానికి సంబంధించి అడిగే సహేతుకమైన ప్రశ్నలు మనకు నవ్వు తెప్పిస్తున్నా, ఏదో నిజం బోధపడుతున్న భావం కలుగుతుంది. అప్పుడే వికసిస్తున్న పిల్లల మనసులపై పరభాషా ప్రభావం ఎలా ఉంటుంది, మాతృభాష పై సాధికారత వచ్చిన తరువాత పరభాషను నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? సంస్కృతం, తెలుగు మొదలైనవి సంస్కరింపబడిన భాషలుగా ఎందుకు పిలువబడుతున్నవి మొదలైన విషయాల గురించి తిక్కన, విష్ణుశర్మలు కూలంకషంగా మాట్లాడేతీరు మనకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. అప్పట్లో పాడ్యమి, అష్టమి, అమావస్య, పౌర్ణమి తిథులలో విద్య నేర్పేవారుకారట. ఆదివారం సెలవు అన్నది ఆంగ్లేయుల నుండి తీసుకున్నసంస్కృతి అట. తిక్కన కాలం నాటికే ఇంటిపేర్లు అంటూ ప్రత్యేకించి ఏవీ ఉండేవికావట. ఇలాంటి ఆసక్తికర అంశాలతోపాటు పూర్వం విద్యావిధానం ఎలా ఉండేది, భాషను నేర్చుకోవడం ఎలా మొదలుపెట్టాలి మొదలైన విషయాలమీద మంచి అవగాహన కలిగిస్తుంది. చివరకు ఇంత కంగాళీగా ఉన్న భాషను నేర్చుకోమని చెప్పి విష్ణుశర్మ, తిక్కన స్వర్గానికి వెళ్లడానికి సిద్ధపడి ట్రైన్ ఎక్కేస్తారు. మెలకువ వచ్చిన రచయితకు తనకు Head Of The Department గా ప్రమోషన్ వచ్చిందని తెలుస్తుంది. కలలో మాచవరం ఆంజనేయస్వామికి కొట్టిన వంద కొబ్బరికాయల ఫలితమే ఇదని రచయిత ముగింపు వాక్యం పలకడంతో కథ పూర్తవుతుంది.

విశ్వనాథవారి శైలి గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమేమున్నది. కథని పరిగెత్తించిన తీరు, సునిశిత హాస్యం, విష్ణుశర్మ పాత్రచిత్రీకరణ మనల్ని పేజీలవెంట పరుగుపెట్టిస్తాయి. రచయిత స్వగతంగా అనుకునేవి మనకు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తాయి. నవల చదవడం పూర్తయిన తరువాత మనభాష మీద మనకు గౌరవం పెరుగకా మానదు. మన భాష యొక్క అందాన్ని అవలోకనం చేసుకోకా మానము. సరదాగా సాగుతూనే మనల్ని విశ్లేషించుకునేలా చేసే ఓ మంచి నవల “విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు”.

నిరంతర గమ్యం

 
       ఈ జీవన ప్రవాహంలో పుట్టిన ప్రతి మనిషీ.. ఎన్నో ఆలోచనల మలుపులు తిరుగుతూ, సంఘర్షణలు, సంతోషాలు, విషాదాల ఎత్తుపలాలు దాటుకుంటూ, తుది మజిలీ మరణాన్ని చేరేవరకూ తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. కానీ అత్యంత విలువైన దొకటి అతనికి అందకుండా అతని చుట్టూనే పరిభ్రమిస్తోంది. గుప్పెట్లో బంధిద్దామంటే దొరకని పాదరసంలా అది మనిషికి చిక్కకుండా జారిపోతూ ఉంది. విశాలమైన దోసిలితో పట్టాలిగాని, ముడుచుకుపోయిన గుప్పెటకు అది దొరకడం దుస్సాధ్యం మరి. ప్రతీ పనికి పరమావధి ఏదో, ఏది ఉంటే మరేదీ అక్కరలేదో, దేనివల్ల శాశ్వత నిష్క్రమణ సమయంలో కూడా దుఃఖం కలుగదో, ఆ వెలకట్టలేని విలువైన విశేషానుభూతి పేరే ఆనందం. అదే మానవ జీవితపు నిరంతర గమ్యస్థానం.

కాలం తెలివైనది. అది ముందుకు సాగుతూ మనిషి ఆలోచనలు మార్చుకుంటూ వెళిపోతుంటుంది. మారిన ఆలోచనల వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానంలో పడి మూలుగుతున్న మనిషిని చూసి వినోదిస్తుంటుంది. జవాబుదారీతనం కలిగిన స్వతంత్రుల గుంపుగా ఉండవలసిన సమాజాన్ని, భయస్తులు, బద్ధకస్తులు, ముసుగుమనసు మనుషుల కలయికగా మార్చివేసింది. తప్పించుకు తిరగడం ఈ కాలపు తెలివిగా తీర్మానించబడింది. గొప్పదనం హృదయాన్ని బట్టికాక, సమాజంలో హోదాని బట్టి లెక్క వేయబడుతుంది. దురలవాట్లుగా చెప్పబడేవి ఇప్పుడు సాధారణ అలవాట్లుగా భావించబడుతున్నాయి. సంపద, అధికారం, కీర్తి, సౌఖ్యం జీవిత గమ్యాలుగా మారిపోయాయి. తెల్లని అన్నం వంటి వీటికి, ఆనందం అనే శ్రేష్ఠమయిన కూర కలిపి తిన్నప్పుడే రుచిపుడుతుంది, బలం కలుగుతుంది, సంతృప్తీ మిగులుతుంది.

మనిషి అంతరాత్మకు కాక కేవలం సమాజానికి జవాబుదారీగా మారిపోయాడు. అవతలివారి పొగడ్త మీదో, తోటివారికంటే గొప్పవాడనిపించుకోవడం అనే తపన మీదో ఆధారపడి ఆనందాన్ని కొలుచుకుంటున్నాడు. పదిమందీ ప్రశంసిస్తే కలిగే ఆనందం భయంతో కూడిన బాధ్యతను పెంచుతుంది. క్రొత్త ఆలోచనలకు వారి ప్రశంసాకారణాలు పరిధులుగా ఏర్పడిపోతాయి. ఫలితంగా ఆలోచనల్లో స్వతంత్రత, నూతనత్వం మందగిస్తాయి, ఆనందం నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోతుంది. అదే, లోపలి మనిషి ప్రశంస వలన కలిగే ఆనందం స్వతంత్రతతో కూడిన ఉత్సాహాన్నిస్తుంది. సృజనాత్మకతను వికసింపజేస్తుంది. ఆలోచనే ఆనందంగా మారిపోతుంది. కానీ ఈ లోపలి మనిషితో మన బంధం రోజురోజుకీ బలహీనపడిపోతూ ఉంది. మనతో మనం గడపడానికి సమయం కేటాయించుకోలేకపోతున్నాం. మనల్ని మనకు దగ్గరచేసే ఏకాంతం అనేది పుస్తకాల్లో మాటగానే మిగిలిపోతోంది.

సాంస్కృతిక విప్లవం మంచికంటే చేటే ఎక్కువ చేసింది. సంపాదన మీద విపరీతమైన మక్కువ, సమాజంలో ఉన్నతికోసం పడే ఉబలాటం, కుటుంబసభ్యుల మద్య బంధాలని పలుచన చేసింది. భార్యాభర్తల ఉద్యోగాల వల్ల పిల్లలు ఆయాలకు, హాస్టళ్లకు అప్పగించబడుతున్నారు. స్కూలునుండి ఇంటికి రాగానే మంచినీళ్లిచ్చి ప్రేమగా దగ్గరకు తీసుకోవాల్సిన అమ్మ ఇప్పుడు ఆఫీసులో క్షణం తీరిక లేకుండా ఉంటోంది. అమ్మప్రేమ అనే మధురిమ ఒకప్పటి కాలానికి సంబంధించిన మధురభావనగా మిగిలిపోనుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదించిన డబ్బుతో పిల్లల్ని అన్ని వసతులూ గల హాస్టళ్ళు కలిగిన కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రులను అంతకంటే మంచి పేరున్న వృద్ధాశ్రమాలలో చేర్పించి ఋణం తీర్చుకుంటున్నారు. తాము చిన్నతనంలో నేర్చుకున్న న్యూటన్ మూడవ సూత్రాన్ని తెలియకుండానే అమలు చేస్తున్నారు. ప్రతీ చర్యకూ దానికి అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది కదా.

ఇప్పటికంటే మన పూర్వతరాలవారే ఎక్కువ శాతం ఆనందంగా ఉన్నారని అంగీకరించగలిగితే, అందుకు కారణమైన వారి అలవాట్లను, జీవన విధానాన్ని వివేచనతో బేరీజు వేసి అవలంబించగలిగితే, ఆనందాన్ని పట్టుకోవడానికి దారి దొరకవచ్చు. కాల పరీక్షకు నిలబడి, తత్వాన్ని మనకు మంచి కథల రూపంలో అందించిన ప్రాచీన సాహిత్యం కచ్చితంగా మనకు సహాయపడుతుంది. అంతరాత్మను వినగలిగే ఏకాంతం మనిషిని ప్రశాంతతకు దగ్గర చేస్తుంది, ఒంటరితనం బారిన పడకుండా కాపాడుతుంది. అలుపెరుగని ప్రయత్నం చేసి అవసరం లేని అలవాట్లను, మన బుద్ధిని తప్పుదారి పట్టించే వ్యక్తులను వదులుకో గలగాలి. మొదట్లో ఇది కష్టంగా అనిపించినా క్రమేణా గొప్ప ఆనందాన్నిస్తుంది. “లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు; అక్కరలేనిదానిని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు.” ’నిన్న’, ’రేపు’ తాళ్లయితే ’నేడు’ ఉయ్యాలబల్ల. గతం యొక్క అనుభవసారాన్ని, భవిష్యత్తు మీద విశ్వాసాన్ని ఆదరువుగా చేసుకుని వర్తమానంలో క్రీడిస్తూ జీవించగలగాలి. నిరంతర గమ్యమయిన ఆనందాన్ని చేరుకోగలగాలి.

భగవంతుల రహస్య సమావేశం

.
…..సర్వాంతర్యామి, దేవదేవుడైన శ్రీ మహా విష్ణువు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆయన వదనంలో నిత్యం నాట్యం చేసే చిరునవ్వు ఎందుకో ఈ రోజు అలిగినట్టుంది. ఆయన గంభీర వదనాన్ని చూసి భయపడ్డ పాల సముద్రపు కెరటాలు కూడా మెల్లిగా ఆడుకుంటున్నాయి. ఆదిశేషుడు తను కొట్టే చిన్నిపాటి బుసలను కూడా మాని నిర్లిప్తంగా చూస్తున్నాడు. విష్ణు పాదాలు ఒత్తుతున్న జగన్మాతకు మాత్రం ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. ఎన్నడూ లేనిది స్వామి ఇలా వ్యాకులం గా కనిపించడంతో అమ్మవారు ఉండబట్టలేక “స్వామీ ఎందుకు మీరింత ఆలోచనామగ్నులై ఉన్నారు. ఎవరైనా భక్తునికి ఆపద వచ్చిందా?” అని అడిగింది. శ్రీహరి ఒకసారి లక్ష్మిదేవి వంక చూసి చిరునవ్వు నవ్వాడు. “లేదు దేవి. ఈ సారి ఆపద మొత్తం ప్రపంచానికి రాబోతున్నది, అది ఒక్కసారిగా కాక మెల్లి మెల్లిగా మొదలై మహోపద్రవంగా మారబోతున్నది. దానిని ఎలా నివారించాలా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు. “సృష్టి స్థితి లయ కారకులైన మీరు కూడా నివారించలేని ఆపదా ప్రభూ?” అని ఆందోళనగా అడిగింది అమ్మవారు. ఈసారి స్వామివారి సమాధానం మరో చిరునవ్వు మాత్రమే. ఆయన ఆలోచనలన్నీ రేపు జరగబోయే సమావేశం చుట్టూనే తిరుగుతున్నాయి.
.
…..నిర్జన ప్రదేశంలో సమావేశం ఏర్పాటుచేయబడింది. సమావేశానికి ఆతిథ్యమిస్తున్న విష్ణువు అందరికన్నా ముందుగా అక్కడకు చేరుకున్నాడు. ఆ తరువాత సమస్తలోకప్రభువు, పాపవినాశకుడు అయిన యెహోవా వచ్చాడు. ఆ వెంటనే సర్వలోకైకనాథుడు, పరమ పవిత్రుడు అయిన అల్లా కూడా సమావేశ స్థలిని చేరుకున్నాడు. అందరి ముఖాల్లోను ఒకటే భావం అదే వ్యాకులత. సమావేశం మొదలయ్యింది.
.
…..“మనుషులలో మూర్ఖత్వం పెరిగిపోయింది” యెహోవా ప్రారంభించాడు “ప్రేమ, సేవ అనే భావాలు మెలి మెల్లిగా కనుమరుగైపోతున్నాయి, మతమౌడ్యాం, వేర్పాటువాదం మితిమీరిపోతున్నాయి.” ఆయన మాటలలో బాధ ధ్వనిస్తోంది. “అవును” అల్లా గద్గదమైన స్వరంతో అన్నాడు. “అసలు ఎందుకిలా జరుగుతుంది?” ఆయనే మళ్ళీ ప్రశ్నించాడు. “తప్పు మనలోనే ఉన్నట్టుంది”….విష్ణువు తల పంకిస్తూ అన్నాడు. “మనలోనా?” మిగతా ఇద్దరూ ఆశ్చర్యంగా అడిగారు. “అవును మనలోనే…” కచ్చితంగా చెబుతున్నట్టుగా నొక్కి చెప్పాడు శ్రీహరి. “జీవులు ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు మరణించాలో మనమే నిర్ణయిస్తున్నప్పుడు, ఈ పరిణామానికి తప్పు మనదవుతుంది గాని వారిదెందుకవుతుంది?”. మిగతా వారికీ ఇది సరైన తర్కంగానే అనిపించింది, కానీ ఏదో తెలియని సందేహం. “కావచ్చు..కానీ మనం వారినలా మూర్ఖులుగా ప్రేమరహితులుగా మారమనలేదే?” అల్లా ప్రశ్నించాడు. “ఆ మాటకొస్తే మన పవిత్ర గ్రంధాలన్నీ ప్రేమనే ప్రవచిస్తాయి, తోటివారికి సాయపడమనే చెబుతాయి, మరి అలాంటప్పుడు తప్పు మనదెందుకవుతుంది?” మళ్ళీ ప్రశ్నించాడు. “మనం కేవలం వారికి అలా ఉండమని చెప్పామంతే, కానీ వారిని ఆచరించేలా చేయలేదేమో? బహుశా అందుకే ఈ పరిస్థితేమో?” యెహోవా సందేహంగా అన్నాడు.
.
…..ఆల్లా నవ్వుతూ మెల్లిగా చెప్పాడు “మనం వారి పుట్టుకను మరణాన్ని మాత్రమే శాసించగలం, ఆ రెంటి మధ్యలో ఉన్న జీవితాన్ని కాదు, ఆ జీవితానికి పూర్తి భాద్యుడు మానవుడే. ఈ విషయం మీ ఇద్దరికీ కూడా తెలియనిదేమీ కాదు.” “అవునవును మీరన్నది నిజమే….ఈ దేవ రహస్యం దేవుళ్ళమైన మన ముగ్గురికి తప్ప మిగతా వారికి తెలిసే అవకాశమే లేదు” యెహోవా అంగీకారంగా తలూపుతూ చెప్పాడు. విష్ణువు కూడా “మీరు చెప్పింది నిజమే…మరి తప్పు ఎక్కడ జరిగి ఉంటుందని మీ ఉద్దేశ్యం?” అన్నాడు. ముగ్గురూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు.
.
…..“మానవుడిని పుట్టించక ముందు కొన్ని కోట్ల సంత్సరాలు పాటు మనకీ సమస్య రాలేదు. అంతకు ముందు అన్నిరకాల జీవరాశులు తమ పని తాము చేసుకుంటూ ఆనందంగా జీవించేవి. ఇప్పుడీ మానవుడు మాత్రం తన ఆనందాన్ని తానే నాశనం చేసుకుంటూ మనల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు.” కొద్దిపాటి ఆవేశపూరిత స్వరంతో అన్నాడు విష్ణువు. “మానవుడు కొద్దిగా పెడదారి పడుతున్నప్పుడల్లా అవతారాలు ఎత్తుతూ వచ్చాను. ఇప్పటి వరకూ తొమ్మిది అవతారాలు ఎత్తాను, దుర్మార్గులందరినీ సంహరించాను, కాని ఇప్పుడు కల్కి అవతారం ఎత్తి దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షిద్దామంటే…. ఒక్క సన్మార్గుడూ కనపడడు. ప్రతీ ఒక్కరిలోనూ ఏదో ఒక వికారం ఉంటూనే ఉంది. ఇప్పుడు వారిని శిక్షించడమంటే విశ్వం మొత్తాన్ని నాశనం చెయ్యడమే. నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు.” ఆయన ముఖంలో ఆందోళణ స్పష్టంగా కనపడుతుంది.
.
…..“అవును….నేను కూడా మహ్మద్ ప్రవక్త లాంటి వారిని భూమ్మీదకు పంపి జనాలలో దేవుని గురించి అతని గొప్పతనం గురించి, అతని ప్రేమ పొందాలంటే వాళ్ళెలా జీవించాలో…మొదలైన విషయాలన్నీ చెప్పించాను. కాని ఇప్పుడు వాటి ప్రభావం జనం మీద ఏమీ ఉన్నట్టు లేదు. అలాగే యెహోవా కూడా ఏసుక్రీస్తు ద్వారా కరుణతత్వాన్ని, నమ్మకం గొప్పతనాన్ని చెప్పించాడు. కానీ ఇప్పుడు ఆ ప్రభావం కూడా శూన్యమే.” పెదవి విరుస్తూ అన్నాడు అల్లా.
.
…..” నాకొకటి అనిపిస్తుంది” యెహోవా సాలోచనగా అన్నాడు. “మనం ఇన్ని అవతారాలు ఎత్తినా ఎంతమంది ప్రవక్తలను, దైవ కుమారులను భూమ్మీదకు పంపినా పరిస్థితిలో మార్పురాకపోవడానికి కారణం ఒకటై ఉంటుంది” అన్నాడు. “ఏమిటది?” మిగతా ఇద్దరూ ఆతృతగా అడిగారు. “మనిషి ప్రవృత్తి” సమాధానంగా చెప్పాడు. “కృష్ణుడు, జీసస్, ప్రవక్త…వీళ్ళు పుట్టక ముందూ అరాచకం ఉంది, వీళ్ళు ఉన్నప్పుడూ ఉంది, వీళ్ళు అవతారం చాలించాక కూడా ఉంది. మరి వీళ్ళు వెళ్ళి ఏం చేసారు అంటే….ఎలా బ్రతికితే ఆనందంగా ఉండచ్చో చెప్పారు. దానిని ఆచరించిన వారు ఆనందాన్ని పొందారు. ఇలా ఆనందాన్ని పొందినవారు తరువాత ప్రవక్తలు, అవతారమూర్తులు చెప్పిన ధర్మాలను ఒక చోట చేర్చి వాటికి మతాలని పేరు పెట్టారు. వారి భోదనలను పవిత్ర గ్రంధాలుగా సూత్రీకరించారు.”
.
…..“అవునవును ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. మనం పంపిన మనవాళ్ళెవరూ మతాలు ఏర్పరచమని చెప్పలేదు. ధర్మాన్ని భోదించి అలా బ్రతకమన్నారు. కానీ మానవులు తమ తెలివి తేటలతో ఆ భోదలను మతం గా మార్చేసి ఆ ధర్మాలకు రక రకాల భాష్యాలు చెప్పారు. నేను బుద్ధావతారం ఎత్తి విగ్రహారాదన, పూజలు పునస్కారాలు వద్దన్నాను, దేవుడు నీలోనే ఉన్నాడని ప్రభోదించాను. కానీ ఏం లాభం నేను అలా అవతారం చాలించానో లేదో వాళ్ళు బుద్దుడికో గుడి కట్టి పూజలు పునస్కారాలు మొదలు పెట్టేసారు” అన్నాడు విష్ణువు. “మావాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా, కొంతమంది మూర్ఖులు పవిత్ర యుద్దానికి రక రకాల ఉపమానాలు తీసి మతాల మీద యుద్దం చేస్తున్నారు. వాళ్లనేం చెయ్యాలంటారు” అన్నాడు అల్లా. “అందరి పరిస్థితి అలానే ఉందండి, మా వాళ్లలో కూడా కొంతమంది మతాలపై యుద్దాలు, మతమార్పిడిలంటూ నా సువార్తల రూపు మార్చేస్తున్నారు.” అన్నాడు యెహోవా. “అసలు ఆకాశంలో ఉన్నామో లేమో తెలియని మనకోసం భూమ్మీద వీళ్ళెందుకండి కొట్టుకు చచ్చిపోతున్నారు” నిర్వేదంగా అన్నాడు విష్ణువు. “సరే….ఇంతకి మన తక్షణ కర్తవ్యం ఏమిటి? ఈ ఆపదనుండి మానవాళిని ఎలా కాపాడాలి?” యెహోవా ప్రశ్నించాడు.
.
…..“వీటన్నిటికీ ఒకటే మార్గం….దేవుళ్ళనే మనకి ప్రత్యేకమైన రూపం గాని, ఉండే ప్రదేశం గాని లేవని, నమ్మకమే మనరూపమని….ప్రేమ ఆనందాలే మనం ఉండే ప్రదేశాలన్న నిజం మనుషులకు చెప్పేద్దాం. మనకోసం కొట్టుకునే కంటే వాళ్ళ మనుగడకు కొన్ని దశాబ్ధాల లోపే మంగళం పాడగల పర్యావరణ ప్రమాదాన్ని నివారించడానికి ప్రయత్నించమందాం. వాళ్ల తెలివి తేటలను దేవుడు ఉన్నాడా? లేడా? అనే వాదనల మీద కాక, ప్రాంతాలను, కులాలను, మతాలను వాడుకుని మనుషుల మద్య చిచ్చుపెడుతున్న రాజకీయనాయకుల కుయుక్తులను ఎదుర్కోవడానికి ఉపయోగించమందాం. ప్రతీసారి ప్రవక్తలుగాను, పురుషోత్తములుగాను భూమ్మీదకు వెళ్ళిన మనం ఈ సారి అక్షరాల రూపంలోను, మాటల రూపంలోను వెళదాం. సమాజ శ్రేయస్సు కోసం తమవంతు సాయం అందించే ప్రతీ ఒక్కరి చేతివ్రాతలోను, నోటిమాటలోను నివాసముందాం. ఆయుధాలకు బదులు చిరునవ్వులు విసురుకోమందాం, భయాకోపాలని ధైర్యవంతమైన ప్రేమతో ఎదుర్కోమందాం. మన ముగ్గురం వేరు వేరు కామని ముగ్గురం కలిస్తేనే వాళ్ళు పీల్చే ప్రాణవాయువని తెలియజేద్దాం….” ఆవేశభరితము, అనురాగపూరితము అయిన అల్లా సూచనా ప్రసంగం పూర్తయ్యింది.
.
…..విష్ణువుకి, యెహోవాకీ కూడా ఈ ఆలోచనే సరైనదనిపించింది. ముగ్గురూ కలిసి మెల్లిగా అడుగులు వెయ్యడం ప్రారంభించారు. అలా నడుస్తూ నడుస్తూ ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోయారు. దివ్యకాంతి ఒకటే అక్కడ కనపడుతోంది. ఆ దివ్యమైన వెలుగు భూలోకం వైపు వేగంగా రాసాగింది….

………………………………………..శుభం భూయాత్
.

వ్యసనం

.
గురువు గారండీ, వ్యసనం అంటే ఏమిటండి? అడిగాడు ముకుందుడు. ఇంతలో పక్కనున్న మరో శిష్యుడు కవనుడు కలుగజేసుకొని “వ్యసనం అంటే అలవాటురా. అది కూడా తెలియదా” అన్నాడు ముకుందుడిని చిన్నబుచ్చుతూ. అంతే కదండి గురువుగారూ? ఎందుకైనా మంచిదని గురువుగారి అభిప్రాయం అడిగాడు కవనుడు. గురువుగారు చిరునవ్వు నవ్వి చెప్పారు: “కాదునాయనా…వ్యసనానికి అలవాటుకి హస్తిమశకాంతర భేదం ఉంది”. అవునాండి! మరి అయితే వ్యసనం అంటే ఏమిటండి? అలవాటుకి దానికి తేడా ఏంటండి? మెల్లిగా అడిగాడు కవనుడు. చూపు మాత్రం తనవైపు హేళనగా చూస్తున్న ముకుందుడి మీదే ఉంది. ఇంతలో మిగతా శిష్యులు కూడా వచ్చి చేరారు. గురుబోధ మొదలయ్యింది.
.
నువ్వు ప్రొద్దున్నే ఎన్ని గంటలకు నిద్ర లేస్తావు కవనా? అడిగారు గురువుగారు. నాలుగు గంటలకండి సమాధానం చెప్పాడు. మరి నువ్వు నాయనా? ముకుందుడిని అడిగారు…నాలుగున్నర గంటలకండి! ముకుందుడు చెప్పాడు. అంటే నాలుగు గంటలకు లేవడం కవనుడి అలవాటు, నాలుగున్నరకి లేవడం ముకుందుడి అలవాటు. అలానే కొందరికి ఖద్దరు వస్త్రాలు వేసుకోవడం అలవాటయితే, మరి కొందరికి నూలు వస్త్రాలు వేసుకోవడం అలవాటు. కొందరికి వేణ్ణీళ్ళ స్నానం అలవాటయితే మరికొందరికి చన్నీళ్ళ స్నానం అలవాటు. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళవాళ్ళ సౌలభ్యానికి తగ్గట్టుగా అలవాట్లు ఏర్పడతాయి. ఈ అలవాట్ల వల్ల వాళ్లకు గాని, ఎదుటి వారికి గాని ఎటువంటి ప్రమాదమూ లేదు. కానీ ప్రమాదకరమైన కొన్ని దురలవాట్లు కూడా ఉన్నాయి. ఇవి క్రమంగా అలవాటు నుండి వ్యసనానికి దారితీసి మనిషి పతనానికి కారణమవుతున్నాయి.
.
మరి మన గోపన్న ఎప్పుడూ గోళ్ళు కొరుకుతూ ఉంటాడండి. ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నాడు. మరి అది అలవాటాండి? వ్యసనమాండి? అడిగాడు కవనుడు. అది వ్యసనమే నాయనా! ఒక అలవాటు నీకు ఇబ్బంది కలిగిస్తున్నా నువ్వు మానలేకపోతున్నావంటే అది కచ్చితంగా వ్యసనమే. ఈ వ్యసనాలలో కూడా దుర్వ్యసనాలు, మంచి వ్యసనాలు అని రెండు విభాగాలున్నాయి. దుర్వ్యసనాలు ఆ వ్యసనాలున్న మనిషితో పాటూ వాళ్ళ కుటుంబాలకి చుట్టూ ఉన్న సమాజానికి కూడా హానికరమే. పొగత్రాగడం, మద్యపానం, మత్తు మందు సేవనం మొదలైనవి ఈ విభాగంలోకి వస్తాయి. మంచి పుస్తకాలు చదవడం, ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, ధ్యానం చెయ్యడం మొదలైనవి మంచి వ్యసనాల క్రిందకి వస్తాయి. కాని ఇక్కడ నీవొక విషయం గ్రహించాలి. పైన చెప్పిన ఆరు వ్యసనాలు అలవాట్లుగా మొదలైనవే. ఈ ఒక్కసారే కదా, ఈ ఒక్కసారే కదా అనుకుంటూ మొదలై ఒక్కరోజు కూడా మానలేని స్థితికి వెళ్ళిపోతారు.
.
అయితే వీటిని అలవాట్లుగానే ఉంచుకున్న వారు లేకపోలేదు. మీకు వీటి భేదం బాగా అర్ధం కావడానికి ఒక ఉదాహరణ చెబుతాను వినండి. స్నేహితులు కలిసినప్పుడో, సరదా కలిగినప్పుడో మద్యం సేవించడం ఒక అలవాటు. కానీ అప్పుడప్పుడు త్రాగినా అది మీ ఆరోగ్యానికి చేటు తెస్తుంది కాబట్టి అది దురలవాటు. రోజూ మద్యం సేవించకుండా ఉండలేకపోవడం వ్యసనం. దాని వల్ల ధనము, ఆరోగ్యమూ, బుద్ధి, గౌరవమూ తరగడం మొదలౌతాయి. అందుకే అది దుర్వ్యసనము. పైగా మద్యం మత్తులో చేయరాని ఘోరాలెన్నో చేసే అవకాశం ఉంది కనుక అది సమాజానికి కూడా ప్రమాదకరమే. ఈ నాటి యువత భవితను నాశనం చేస్తున్న మత్తు మందు చాలా ప్రమాదకర వ్యసనం. మత్తు మందులు ఒకసారి అలవాటయితే, అవి దొరకనప్పుడు వాటిని సంపాదించడం కోసం ఎంతటి నీచానికైనా పాల్పడే వారున్నారు. రామాయణ కథలో రావణాసురినికి స్త్రీ వ్యసనం ఉంది. ఆ వ్యసన కారణంగానే అతను రంభ వల్ల శాపాన్నిపొందితే, సీతాదేవిని అపహరించడం వల్ల సమస్త సంపదలను, పుత్రులను, చివరికి ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. అలాగే మహాభారత గాధలో ధర్మరాజుకి జూదం అనే వ్యసనం ఉంది, దాని వలన అతనితో పాటు అతని కుటుంబం ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చిందో మీకు తెలిసినదే.
.
మరి ఈ దుర్వ్యసనాలు ఒకసారి అలవాటయితే వాటి నుండి బయట పడలేమాండి? భారంగా అడిగాడు ముకుందుడు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ముకుందా. కానీ ముందు ఆ వ్యసనం మానుకోవాలన్న తపన ఆ వ్యక్తి కుండాలి, లేకపోతే చుట్టూ ఉన్న వారు ఎంత ప్రయత్నించినా ఆ కార్యం కష్ట సాధ్యమే. అందుకే వ్యసనపరుడికి నువ్వు చేసే పని తప్పు అని కూర్చుని ధర్మ సూక్ష్మాలు వల్లించేకంటే, ఆ వ్యక్తికి ఆ వ్యసనం మీద ఏహ్యభావం కలిగేలా చేయగలగాలి, ఆ వ్యసనం కంటే అతనికి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఎదో తెలుసుకుని అది అలవాటు చెయ్యాగలగాలి. ఉదాహరణకి పొగత్రాగడం మానేద్దాం అనుకున్న వ్యక్తి, తనకు పొగత్రాగాలనిపించినప్పుడల్లా పసందైన తాంబూలం వేసుకునేలా చేయడం లాంటిదన్న మాట. ఇవన్నీ ప్రయత్నం తో కూడుకున్న పనులు. ఇవి చెయ్యాలంటే కోరిక తో పాటు తీరిక ఓపిక కూడా ఉండాలి. ఈ ప్రయత్నాలన్నీ కూడా కనీసం తాము చేసేది తప్పు అనే భావన ఉన్నవారిమీదే పని చేస్తాయి గాని తమ వ్యసనాలని మనస్పూర్తిగా సమర్ధించుకునే వారిమీద పనిచేయవు.
.
ఇక మంచి వ్యసనాల విషయానికి వద్దాం. చాలామంది రోజూ ఏదో ఒక పుస్తకం చదవకుండా ఉండలేరు. అది వారికో వ్యసనం. కానీ దానివల్ల వారికి విషయ పరిఙ్ఞానం పెరుగుతుంది, విషయ పరిఙ్ఞానం పాండిత్యాన్ని కలిగిస్తుంది. చారిత్రక సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగిస్తుంది. మంచి పుస్తకాలు చదవడం వల్ల మనలో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలు తగ్గుముఖం పడతాయి. నేర్చుకోవడంతో పాటూ పదిమందికి చెప్పగలిగే స్థితి కలుగుతుంది. అందుకే పుస్తక పఠనం ఒక మంచి వ్యసనం. ఇక రెండవది ప్రశ్నించే వ్యసనం. చాలా మంది తమకెదురయ్యే ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సాధారణంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువగా కనపడుతుంది. కానీ అది అలవాటు దశలో ఉండగానే వ్యసనంగా మారకుండా పెద్దవాళ్ళు తుంచేస్తుంటారు. కారణం… పిల్లలడిగే ప్రతి ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యమైన విషయం. పిల్లల్లో ఈ వ్యసనాన్ని పెంపొందింపజేస్తే దేశభవిష్యత్తునే మార్చివేయగలరు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు, అసాధారణ నాయకులకు ఈ ప్రశ్నించడం అనే వ్యసనం ఉంటుంది. స్వామి వివేకానందకు ఇలా ప్రతి విషయాన్ని ప్రశ్నించే అలవాటు వ్యసనంగా మారి ధ్యానమనే మరో వ్యసనాన్ని అలవాటు చేసింది. ఈ వ్యసనాలే అతన్ని భారతీయ మహాపురుషులలో ఒకడిగా చేసాయి. ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకుందాం. మీరు ధ్యానాన్ని వ్యసనంగా మార్చుకోగలిగితే దుర్వ్యసనాలన్నీ వాటంతటవే, మరే ప్రత్యేక ప్రయత్నమూ చేయక్కరలేకుండానే మీ నుండి దూరమైపోతాయి. నిశ్చల ధ్యానమంటే ప్రశాంతంగా మరే ఇతర ఆలోచనా లేకుండా నీతో నువ్వు గడపగలగడం. ధ్యానంలో పురోగతి సాధించిన వాడికి తనంటే ఏమిటో తనకి పూర్తిగా తెలుస్తుంది. తనేంచెయ్యాలో, ఏం చెయ్యకూడదో అనుభవంలోకొస్తుంది. తన మనసు మీద తనకి పూర్తి పట్టువస్తుంది.
.
ఆశ్రమంలో ఉన్న మీ అందరికి ధ్యానాన్ని, పుస్తక పఠనాన్ని, ప్రశ్నాసమయాన్ని నిత్యకృత్యంగా ఏర్పరచడంలో ఉన్న ఆంతర్యమిదే. ఈ మూడింటిలోని ఆనందాన్ని అనుభవించడం తెలిసిన నాడు మీకిక గురువు అవసరం ఉండదు. మీకు మీరే గురువులు. నాయనలారా మీ సందేహాలు తీరినట్టేనా? అని గురువుగారు అడగంగానే శిష్యులంతా క్రొత్త విషయం తెలిసిందన్న ఆనందంతో ముక్త కఠంతో జవాబిచ్చారు.
.
……………………… సర్వేజనా సుఖినోభవంతు.