…..బొటనవ్రేలు పరిమాణంలో ఉన్న కాంతి దశదిశలా తన కిరణాలను ప్రసరిస్తోంది. దేదీప్యమానమైన ఆ కాంతిలో సమస్తమూ కనబడుతోంది. ఆ ప్రదేశములో నవ్వులూ లేవు, ఏడుపులూ లేవు. గంభీరత్వము లేదు, కోమలత్వమూ లేదు. అసలు ఆలోచనలే లేవు. ఉన్నదల్లా శాంతి, దాని వలన వచ్చిన ప్రశాంతత. ఆ వెలుగులో కనబడుతున్న మనిషి అందగాడు. అతనికి కోరిక, భయం లేవు అందుకే బాధ లేదు. సుఖాపేక్ష లేదు, అందుకే దుఃఖమూ లేదు. అసలు అతని ముఖంలో కనబడుతున్న భావం పేరేమిటో? శరీరంలోని అణువణువూ ఆనంద పదార్థమై, ఆ సర్వాణువుల సంయోగము చేత జనించినదేదో ఒక భావ రూపాన్ని ధరించి అతని ముఖాన్ని ఆవరించినట్లుగా ఉంది. గతము, భవిష్యత్తు స్ఫురణకు వస్తే ఆ మనిషి మాయమైపోతున్నాడు. అతను వర్తమాన రథమెక్కిన నిరాలోచనుడు. ప్రశాంతత పరుపుపై పరుండిన ఆనందపూరితుడు. కామక్రోధ, భయదుఃఖములనే చీకటి దుప్పట్లు కప్పుకోని కాంతిపురుషుడు.
…..అక్కడ నుండి దూరంగా కొన్ని అడుగులు వేయగా గోడ ఒకటి అడ్డు తగిలింది. దానిని దాటగానే మసక చీకటి అలుముకుంది. అక్కడ కొందరేదో చేయబోతున్నారు, మిగిలినవారు వారినది చేయనివ్వకుండా ఆపేస్తున్నారు. అక్కడ ఎక్కడ విన్నా ‘వాళ్లను కిందకు లాగేయండి, లాగేయండి’ అనే శబ్ధాలే వినబడుతున్నాయి. ఆ అసహ్యకర రొదలను వినలేక పరిగెడుతూ ఇంకొంత దూరం వెళ్లగానే మరో గోడ అడ్డు తగిలింది.
…..అక్కడ కనబడిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. మనుషులను బళ్లకు కట్టి ఆ బళ్లనెక్కి వెళుతున్నవారు కనిపించారు. బండి మీదున్న వారు బండికి కట్టబడిన వారిని కర్రలతో మోదుతున్నారు. బళ్లకు కట్టబడినవారి కళ్లు తమకు అలా బండినెక్కే అవకాశం, సమయం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ వాతావరణంలో ఉండలేక, మరికొంత దూరం ప్రయాణించగా అడ్డుతగిలిన గోడ దాటగా కనబడిన ప్రదేశమంతా చిత్రంగా ఉంది.
….. అక్కడందరూ నలుగురేసి, అయిదుగురేసిగా విడిపోయి ఉన్నారు. ప్రతి జట్టులోని పెద్దవారు జట్టులో చిన్నవారిని క్షణం కూడా విడచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంతలో విచిత్రంగా చిన్నవారి నుండి ఇంకొంతమంది పుడుతున్నారు. వీరు పుట్టగానే చిన్నవాళ్లు తమ పెద్దవాళ్లను దూరంగా తరిమివేసి, తమనుండి పుట్టినవారిని జాగ్రత్తగా పట్టుకుని ఆనందిస్తున్నారు. తరిమివేయబడినవారు చేసే ‘నాది, నావారు’ అనే ఆర్తనాదాలతో ఆ ప్రదేశం మారుమ్రోగిపోతోంది.
….. అక్కడ నుండి మరింత దూరం ప్రయాణించగా, అడ్డొచ్చిన గోడ దాటగానే ఉన్న ప్రదేశంలో అందరూ కనబడినవన్నీ దాచేస్తున్నారు. ఒకరి దగ్గరకు ఇంకొకరు వెళ్లగానే వాళ్లు ఖాళీ చేతులు చూపుతూ, తమవద్ద ఏమీ లేవన్నట్టు సంజ్ఞలు చేసుకుంటున్నారు. వాళ్లు అటు వెళ్లగానే, ఆబగా మరిన్ని వస్తువులు తెచ్చుకుని దాచేస్తూ కంగారుపడిపోతున్నారు.
….. ఆ ప్రదేశం నుండి ఇంకొంత దూరం ప్రయాణం చేయగా అడ్డుతగిలిన గోడ చాలా వేడిగా కాలిపోతూ ఉంది. దానిని అతికష్టంమీద దాటగా కనబడిన దృశ్యం భయంకరమైనది. అక్కడవారి కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. శరీరాలు కంపించిపోతున్నాయి. ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటూ అరుస్తున్నారు. అక్కడ ఒక్కక్షణం కూడా నిలువలేక పరిగెడుతూ ఉండగా అడ్డుతగిలిన గోడనెక్కి దూకగా కనబడిన దృశ్యం విబిన్నమైనది.
…..మిగిలిన ప్రదేశాల వారంతా వీరికే పుట్టారా? అన్నట్టుగా ఉన్నాయి వీరి రూపురేఖలు. అక్కడున్నవారంతా వారికెదురుగా ఉన్న డబ్బు, బంగారం, భవంతులు, నగ్నశరీరాల వంక కళ్లార్పకుండా ఆబగా చూస్తున్నారు. వారి ముఖాలలో కొంతసేపు ఉత్సాహం, మరికొంతసేపు నిరుత్సాహం. ఏదైనా చేయగలిగే తెగింపు ఒకసారి, అమ్మో అనే భయం మరోసారి. ఇలా అనేకానేక భావాలు మార్చిమార్చి కనబడుతున్నాయి.
…..ఇన్ని దృశ్యాలను చూసిన ఆశ్చర్యంలో మెల్లగా అడుగులేస్తూ ఉండగా, ఆ మసక చీకటిలో ఒక మనిషి కనిపించాడు. అతనిని ఎక్కడో చూసిన జ్ఞాపకం. కానీ ఆ జ్ఞాపకమేదో కలలో జ్ఞాపకంలా అనిపిస్తోంది. అతను నవ్వుతున్నాడు, కానీ కొంతసేపటికే ఆ నవ్వు ఏడుపుగా మారిపోతోంది. ముఖంలో ధైర్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా, లోపలి బెరుకు తెలుస్తూనే ఉంది. తానెవరో తనకే తెలియని మనిషి, తానెవరో ఇతరులకు తెలియకూడదని తాపత్రయ పడుతున్నాడు. తానొక నకిలీ. కానీ తనకావిషయం తెలియదు. ఇంతకీ ఎవరీ మనిషి? గుర్తుకువచ్చింది. మొట్టమొదట వెలుగులో కనిపించిన మనిషి. నిజమే! ఈ మనిషి అచ్చూ ఆ మనిషినే పోలి ఉన్నాడు. ఇతనో నకిలీ మనిషి. అంటే మొదట కనబడిన మనిషే ఈ మనిషి యొక్క నిజం మనిషి. వర్తమానం తప్ప మరేమీ ఎరుగని మహామనిషి. దుఃఖ మెరుగని పూర్ణానందపు మనిషి. ఒక్కముక్కలో చెప్పాలంటే… సిసలైన అసలు మనిషి
…..పైన కనబడినదంతా బాహ్య ప్రపంచం కాదు. దానికంటే ఘనమైనది, విశాలమైనది అయిన అంతర ప్రపంచం. ఆ గోడల మధ్య ఉన్నవారంతా మన మనసుకు పుట్టినవారే. చూసిన ప్రతీది పొందాలనే కోరికతో రగిలిపోయే కాముకుడు, ఆలోచనను చంపేసే కోపంతో ఉగిపోయే క్రోధితుడు, ప్రోగుచేసుకున్నదానిని తృప్తిగా అనుభవించక, భయంతో దాచుకునే లోభి, తన ఆనందాన్ని తనవారనుకున్న ఇతరుల చేతులలో పెట్టి దుఃఖించే మోహితుడు, బలధనాదికారములతో విర్రవీగే మదాంధుడు, తోటివారి ఉన్నతి చూసి ఓర్వలేని మాత్సర్యపరుడు, ఇలా అందరూ మనవారే, మనలో పుట్టినవారే. వీరంతా తమతమ సామ్రాజ్యాలను స్థాపించుకుని మనలోని అసలు మనిషిని బయటకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. మహాబలశాలురయిన వీరి అడ్డు తొలగించడమెలా? అసలుమనిషిని చూసేదెలా? లేక ఎప్పటికీ ఇలా నకిలీమనిషిగా నిరంతర వ్యధతో కుమిలిపోతూ ఉండిపోవల్సిందేనా?
లేదు…అలా ఎప్పటికీ కాదు.
…..అనంత బ్రహ్మండాల పెట్టు అయిన మనస్సనే సువిశాల ప్రపంచాన్ని తనలోనే నిక్షిప్తం చేసుకున్న మనిషికి అసాధ్యమున్నదా? ముమ్మాటికి లేదు. త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే మహోన్నతజీవి అయిన మనిషికి అసాధ్యమన్నదే లేదు. ప్రతిమనిషీ ఎవరికివారే ఒక ఆలోచనచేసి, ధ్యానాది సాధనముల సహాయంతో, నిరంతర ఆత్మవిశ్లేషణతో లోపలివైపుకు ముందడుగు వేసి పయనం మొదలుపెడితే , ఆ ప్రయాణంలో ఏదో ఒకరోజు ఆ ఆలోచనకూడా ఆవిరైపోయి, అసలుమనిషి కనిపిస్తాడు. ఇంతకాలం అంతరప్రపంచంలో ఎన్నో చీకటి గోడల అవతల ఉండిపోయిన ఆ మనిషి, ఈ బాహ్యప్రపంచంలో విహరించగలుగుతాడు. నిజమైన జీవితాన్ని జీవించగలుగుతాడు.
కామక్రోధలొభమోహమదమాత్సర్యాల పేర్లు చెప్పకుండా ఆ లక్షణాలను వివరిస్తూ చాలాచక్కగా రాశారు. నిజమే మనందరం అసలుమనిషికి దూరమైపొయిన వారమే. కానీ బయటపడటం చాలా కష్టమేమో. ఏదిఏమైనా మీ ఆలోచనకు, రచనా శైలి కి వందకు వంద మార్కులు వెయ్యొచ్చు.