అసలుమనిషి

…..బొటనవ్రేలు పరిమాణంలో ఉన్న కాంతి దశదిశలా తన కిరణాలను ప్రసరిస్తోంది. దేదీప్యమానమైన ఆ కాంతిలో సమస్తమూ కనబడుతోంది. ఆ ప్రదేశములో నవ్వులూ లేవు, ఏడుపులూ లేవు. గంభీరత్వము లేదు, కోమలత్వమూ లేదు. అసలు ఆలోచనలే లేవు. ఉన్నదల్లా శాంతి, దాని వలన వచ్చిన ప్రశాంతత. ఆ వెలుగులో కనబడుతున్న మనిషి అందగాడు. అతనికి కోరిక, భయం లేవు అందుకే బాధ లేదు. సుఖాపేక్ష లేదు, అందుకే దుఃఖమూ లేదు. అసలు అతని ముఖంలో కనబడుతున్న భావం పేరేమిటో? శరీరంలోని అణువణువూ ఆనంద పదార్థమై, ఆ సర్వాణువుల సంయోగము చేత జనించినదేదో ఒక భావ రూపాన్ని ధరించి అతని ముఖాన్ని ఆవరించినట్లుగా ఉంది. గతము, భవిష్యత్తు స్ఫురణకు వస్తే ఆ మనిషి మాయమైపోతున్నాడు. అతను వర్తమాన రథమెక్కిన నిరాలోచనుడు. ప్రశాంతత పరుపుపై పరుండిన ఆనందపూరితుడు. కామక్రోధ, భయదుఃఖములనే చీకటి దుప్పట్లు కప్పుకోని కాంతిపురుషుడు.

…..అక్కడ నుండి దూరంగా కొన్ని అడుగులు వేయగా గోడ ఒకటి అడ్డు తగిలింది. దానిని దాటగానే మసక చీకటి అలుముకుంది. అక్కడ కొందరేదో చేయబోతున్నారు, మిగిలినవారు వారినది చేయనివ్వకుండా ఆపేస్తున్నారు. అక్కడ ఎక్కడ విన్నా ‘వాళ్లను కిందకు లాగేయండి, లాగేయండి’ అనే శబ్ధాలే వినబడుతున్నాయి. ఆ అసహ్యకర రొదలను వినలేక పరిగెడుతూ ఇంకొంత దూరం వెళ్లగానే మరో గోడ అడ్డు తగిలింది.

…..అక్కడ కనబడిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. మనుషులను బళ్లకు కట్టి ఆ బళ్లనెక్కి వెళుతున్నవారు కనిపించారు. బండి మీదున్న వారు బండికి కట్టబడిన వారిని కర్రలతో మోదుతున్నారు. బళ్లకు కట్టబడినవారి కళ్లు తమకు అలా బండినెక్కే అవకాశం, సమయం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ వాతావరణంలో ఉండలేక, మరికొంత దూరం ప్రయాణించగా అడ్డుతగిలిన గోడ దాటగా కనబడిన ప్రదేశమంతా చిత్రంగా ఉంది.

….. అక్కడందరూ నలుగురేసి, అయిదుగురేసిగా విడిపోయి ఉన్నారు. ప్రతి జట్టులోని పెద్దవారు జట్టులో చిన్నవారిని క్షణం కూడా విడచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంతలో విచిత్రంగా చిన్నవారి నుండి ఇంకొంతమంది పుడుతున్నారు. వీరు పుట్టగానే చిన్నవాళ్లు తమ పెద్దవాళ్లను దూరంగా తరిమివేసి, తమనుండి పుట్టినవారిని జాగ్రత్తగా పట్టుకుని ఆనందిస్తున్నారు. తరిమివేయబడినవారు చేసే ‘నాది, నావారు’ అనే ఆర్తనాదాలతో ఆ ప్రదేశం మారుమ్రోగిపోతోంది.

….. అక్కడ నుండి మరింత దూరం ప్రయాణించగా, అడ్డొచ్చిన గోడ దాటగానే ఉన్న ప్రదేశంలో అందరూ కనబడినవన్నీ దాచేస్తున్నారు. ఒకరి దగ్గరకు ఇంకొకరు వెళ్లగానే వాళ్లు ఖాళీ చేతులు చూపుతూ, తమవద్ద ఏమీ లేవన్నట్టు సంజ్ఞలు చేసుకుంటున్నారు. వాళ్లు అటు వెళ్లగానే, ఆబగా మరిన్ని వస్తువులు తెచ్చుకుని దాచేస్తూ కంగారుపడిపోతున్నారు.

….. ఆ ప్రదేశం నుండి ఇంకొంత దూరం ప్రయాణం చేయగా అడ్డుతగిలిన గోడ చాలా వేడిగా కాలిపోతూ ఉంది. దానిని అతికష్టంమీద దాటగా కనబడిన దృశ్యం భయంకరమైనది. అక్కడవారి కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. శరీరాలు కంపించిపోతున్నాయి. ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటూ అరుస్తున్నారు. అక్కడ ఒక్కక్షణం కూడా నిలువలేక పరిగెడుతూ ఉండగా అడ్డుతగిలిన గోడనెక్కి దూకగా కనబడిన దృశ్యం విబిన్నమైనది.

…..మిగిలిన ప్రదేశాల వారంతా వీరికే పుట్టారా? అన్నట్టుగా ఉన్నాయి వీరి రూపురేఖలు. అక్కడున్నవారంతా వారికెదురుగా ఉన్న డబ్బు, బంగారం, భవంతులు, నగ్నశరీరాల వంక కళ్లార్పకుండా ఆబగా చూస్తున్నారు. వారి ముఖాలలో కొంతసేపు ఉత్సాహం, మరికొంతసేపు నిరుత్సాహం. ఏదైనా చేయగలిగే తెగింపు ఒకసారి, అమ్మో అనే భయం మరోసారి. ఇలా అనేకానేక భావాలు మార్చిమార్చి కనబడుతున్నాయి.

 …..ఇన్ని దృశ్యాలను చూసిన ఆశ్చర్యంలో మెల్లగా అడుగులేస్తూ ఉండగా, ఆ మసక చీకటిలో ఒక మనిషి కనిపించాడు. అతనిని ఎక్కడో చూసిన జ్ఞాపకం. కానీ ఆ జ్ఞాపకమేదో కలలో జ్ఞాపకంలా అనిపిస్తోంది. అతను నవ్వుతున్నాడు, కానీ కొంతసేపటికే ఆ నవ్వు ఏడుపుగా మారిపోతోంది. ముఖంలో ధైర్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా, లోపలి బెరుకు తెలుస్తూనే ఉంది. తానెవరో తనకే తెలియని మనిషి, తానెవరో ఇతరులకు తెలియకూడదని తాపత్రయ పడుతున్నాడు. తానొక నకిలీ. కానీ తనకావిషయం తెలియదు. ఇంతకీ ఎవరీ మనిషి? గుర్తుకువచ్చింది. మొట్టమొదట వెలుగులో కనిపించిన మనిషి. నిజమే! ఈ మనిషి అచ్చూ ఆ మనిషినే పోలి ఉన్నాడు. ఇతనో నకిలీ మనిషి. అంటే మొదట కనబడిన మనిషే ఈ మనిషి యొక్క నిజం మనిషి. వర్తమానం తప్ప మరేమీ ఎరుగని మహామనిషి. దుఃఖ మెరుగని పూర్ణానందపు మనిషి. ఒక్కముక్కలో చెప్పాలంటే… సిసలైన అసలు మనిషి 

…..పైన కనబడినదంతా బాహ్య ప్రపంచం కాదు. దానికంటే ఘనమైనది, విశాలమైనది అయిన అంతర ప్రపంచం. ఆ గోడల మధ్య ఉన్నవారంతా మన మనసుకు పుట్టినవారే. చూసిన ప్రతీది పొందాలనే కోరికతో రగిలిపోయే కాముకుడు, ఆలోచనను చంపేసే కోపంతో ఉగిపోయే క్రోధితుడు, ప్రోగుచేసుకున్నదానిని తృప్తిగా అనుభవించక, భయంతో దాచుకునే లోభి, తన ఆనందాన్ని తనవారనుకున్న ఇతరుల చేతులలో పెట్టి దుఃఖించే మోహితుడు, బలధనాదికారములతో విర్రవీగే మదాంధుడు, తోటివారి ఉన్నతి చూసి ఓర్వలేని మాత్సర్యపరుడు, ఇలా అందరూ మనవారే, మనలో పుట్టినవారే. వీరంతా తమతమ సామ్రాజ్యాలను స్థాపించుకుని మనలోని అసలు మనిషిని బయటకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. మహాబలశాలురయిన వీరి అడ్డు తొలగించడమెలా? అసలుమనిషిని చూసేదెలా? లేక ఎప్పటికీ ఇలా నకిలీమనిషిగా నిరంతర వ్యధతో కుమిలిపోతూ ఉండిపోవల్సిందేనా?

లేదు…అలా ఎప్పటికీ కాదు.

…..అనంత బ్రహ్మండాల పెట్టు అయిన మనస్సనే సువిశాల ప్రపంచాన్ని తనలోనే నిక్షిప్తం చేసుకున్న మనిషికి అసాధ్యమున్నదా? ముమ్మాటికి లేదు. త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే మహోన్నతజీవి అయిన మనిషికి అసాధ్యమన్నదే లేదు. ప్రతిమనిషీ ఎవరికివారే ఒక ఆలోచనచేసి, ధ్యానాది సాధనముల సహాయంతో, నిరంతర ఆత్మవిశ్లేషణతో లోపలివైపుకు ముందడుగు వేసి పయనం మొదలుపెడితే , ఆ ప్రయాణంలో ఏదో ఒకరోజు ఆ ఆలోచనకూడా ఆవిరైపోయి,  అసలుమనిషి కనిపిస్తాడు. ఇంతకాలం అంతరప్రపంచంలో ఎన్నో చీకటి గోడల అవతల ఉండిపోయిన ఆ మనిషి, ఈ బాహ్యప్రపంచంలో విహరించగలుగుతాడు. నిజమైన జీవితాన్ని జీవించగలుగుతాడు.

బ్లాగుపుస్తకం మరియు తెలుగు కీబోర్డ్ – ఒక పరిచయం

 ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత ఉరకలేస్తోంది. తమవారు పొరుగు దేశంలో ఉన్నా, పొరుగింట్లో ఉన్నా పెద్దతేడా ఏమీ లేదన్నంతగా సమాచార సాంకేతికత అభివృద్ధి చెందింది. మెల్లిమెల్లిగా కనుమరుగు వైపుకు పయనిస్తున్న చిన్నపాటి ఎన్నో భాషలు ఇంటర్నెట్ పుణ్యాన తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం ఇంగ్లీషు మాత్రమే ఇంటర్నెట్ భాషగా చలామణీ అయ్యేది. ఎవరితోనైనా ఇంటర్నెట్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్నా, తమ అభిప్రాయాలను నలుగురితో పంచుకోవాలన్నా ఇంగ్లీషే శరణ్యం. అందుకే, ఇంగ్లీషు వచ్చిన కొద్దిమందికి తప్ప మిగిలిన జనసామాన్యానికి ‘ప్రపంచం ఓ కుగ్రామం’గా మారిందన్న మాటలో పూర్తిస్థాయి వాస్తవం కనబడేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో పెనుమార్పు వచ్చింది. ప్రపంచం నలుమూలలా అనేక భాషలు ఇప్పుడు కంప్యూటర్ తెరలపై దర్శనమిస్తున్నాయి. వివిధ దేశాలలో ఉన్న తమవారితో మాతృభాషలోనే సందేశాలు పంపుకునే అవకాశం అన్ని భాషలవారికీ లభించింది. ఈ ఒరవడిలో వివిధ భాషలకు విస్తృత ప్రచారం కలిగించగల అత్యుత్తమ మాధ్యమంగా నిలబడిన వ్యవస్థ వెబ్‌లాగ్.  దాని సంక్షిప్త రూపమే, మనకు తరచుగా వినపడే ఇంటర్నెట్ పదం… బ్లాగ్.

కొన్ని సంవత్సరాలుగా తెలుగులో బ్లాగ్స్ వ్రాస్తున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తమలోని సృజనాత్మకతని పుస్తకాల రూపంలో జనంలోకి తీసుకెళ్లలేక పోతున్న కవులు, రచయితలకు ఈ బ్లాగ్స్ గొప్ప ఊరటనిస్తున్నాయి. ఇలా బ్లాగ్స్ వ్రాసేవారి లిస్ట్‌లో వంటావార్పు చేసుకుంటూనే, సరదాగా ఆ వంటలు ఎలా చేయాలో వివరించే మహిళలు ఉన్నారు. ప్రకృతి దృశ్యాలను తమ కెమేరాలతో క్లిక్ మనిపించి, వాటిని బ్లాగ్స్‌లో పోస్ట్ చేసి ఆనందించే పెద్దవారున్నారు. తమపని తాము చేసుకుంటూ, ఖాళీ సమయాలలో తోచిన విషయాల మీద తోచినట్లు వ్రాసుకుని సరదాగా టైమ్‌పాస్ చేసే ఉద్యోగులూ ఉన్నారు. నిరంతరం బిజీగా ఉండే అమితాబ్, అమీర్‌ఖాన్, రామ్‌గోపాల్‌వర్మ వంటి సినీ ప్రముఖులూ ఉన్నారు. కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే చాలా సులువుగా వ్రాయగలిగే ఈ బ్లాగ్స్‌ని వ్రాస్తున్న తెలుగువారి శాతం మాత్రం చాలా తక్కువ. కోట్లమంది తెలుగువారిలో బ్లాగ్స్ చదివేవారి సంఖ్య లక్షల్లో ఉన్నా, వ్రాసేవారి సంఖ్య మాత్రం వేలల్లోనే ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉన్నా, ఒక ప్రధాన కారణం మాత్రం.. బ్లాగ్స్ గురించిన అవగాహనారాహిత్యం. బ్లాగ్స్ ఎలా క్రియేట్ చేయాలో, వాటిలో ఎలా వ్రాయలో, ఏమేమి వ్రాయవచ్చో సరిగా తెలియకపోవడం. సరిగ్గా ఈ సమస్యని తీర్చడానికా అన్నట్లు ఈ మధ్యకాలంలోనే పుస్తక విపణిలోకి, తెలుగువారి ముంగిళ్లలోకి ప్రవేశిస్తున్న పుస్తకం… సురవర.కాం వారి ‘బ్లాగు పుస్తకం’.

ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పనిచేసిన అనుభవం కలిగినటువంటి వ్యక్తి, సాధ్యమైనంతమంది తెలుగువారిని బ్లాగ్‌ప్రపంచ భాగస్వాములుగా చేయాలనే ‘బ్లాగు పుస్తకం’ ఆలోచనకు మూలబిందువు అయిన శ్రీ చావా కిరణ్ గారు, “మనసులో మాట” బ్లాగ్ ద్వారా సంవత్సరాలుగా తెలుగు బ్లాగర్లకు సుపరిచితమైన శ్రీమతి సుజాత గారు, తెలుగుభాషకు తనవంతు సేవ చేయాలన్న తపన కలిగిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, “సత్యాన్వేషణ” బ్లాగర్ అయిన రహ్మనుద్దీన్ షేక్ ఈ పుస్తకానికి రూపకర్తలు.

ఇక ఈ పుస్తకంలోని విశేషాల గురించి ప్రస్తావించాల్సి వస్తే..

  1. ఇది తెలుగులో బ్లాగ్స్ గురించి వచ్చిన మొట్టమొదటి పుస్తకం.
  2. బ్లాగ్ క్రియేషన్‌కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా విడిచిపెట్టకుండా వివరించబడింది.
  3. అవసరమైన ప్రతిచోటా సులభంగా అర్థం చేసుకోవడానికి కలర్ స్క్రీన్‌షాట్స్ జతచేయబడ్డాయి.
  4. బ్లాగ్స్ ఉపయోగించడంలో ఎదురయ్యే సాధక బాధకాలు సోదాహరణంగా వివరించబడ్డాయి.
  5. ఈ-మెయిల్ క్రియేట్ చేసుకునే విధానం పొందుపరచబడింది.
  6. కంప్యూటర్ మీద, ఇంగ్లీష్ భాష మీద కొద్దిపాటి అవగాహన ఉన్న ప్రతీవారు చాలా సులభంగా బ్లాగ్ క్రియేట్ చేసుకోగలిగేటంతటి సరళతలో పుస్తకం వ్రాయబడింది.

ఎంత గొప్ప ఆలోచనైనా అది కార్యరూపం ధరించే సమయంలో కొన్ని పొరపాట్లు దొర్లడం చాలా సహజం. అటువంటి పొరపాట్లు ఈ పుస్తకం ముద్రణలో కూడా దొర్లాయి. క్రొత్త అధ్యాయాలను క్రొత్త పేజీలలో మొదలుపెట్టక పోవడం, పదాల మధ్య అనవసరమైన దూరాలు, కొన్ని అక్షర దోషాలు, ఒకే రచయిత కాకపోవడం వలన కనబడే పదప్రయోగాల మధ్య అంతరం మొదలైనవి ఈ పొరపాట్లలో కొన్ని. ధర కూడా కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. కానీ “బ్లాగు పుస్తకం” రూపకర్తల కృషి, పుస్తకం ద్వారా అందించిన విషయం, తెలుగుభాషకు వారు చేస్తున్న సేవ ముందు పై విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సురవర.కాం వారు ఇటీవల కాలంలో మార్కెట్ లోకి విడుదలచేసిన “తెలుగు కీబోర్డ్”, వారు తెలుగుభాషకు చేస్తున్న సేవకు మరో ఉదాహరణ.

ఎటువంటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండా, ఆన్‌లైన్‌తో పనిలేకుండానే తెలుగుభాషలో టైప్ చేసుకోవడానికి ఉపయోగపడే కీబోర్డ్ ఇది. ఇంగ్లీష్, తెలుగు రెండు భాషలలోను టైప్ చేసుకోగలగడమే కాక, అది పూర్తిగా యునీకోడ్ లే-అవుట్‌లో ఉండటం మరో విశిష్టత. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీ, విస్టా, విండోస్ 7, లినక్స్ అపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేయగలిగే ఈ కీబోర్డ్‌తో చాలా సులువుగా కథలు, నవలలు, ఈ-మెయిల్స్ టైప్ చేసుకోవచ్చు. తెలుగులో బ్లాగ్స్ వ్రాసేవారికి ఇది అత్యంత ఉపయోగకరమైన సాధనం.

తెలుగుభాషను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లాలన్న సురవర వారి ఆశయం వల్ల, ఎందరో తెలుగువారు తెలుగుభాషకు సేవ చేసుకుంటూ ఉపాధి పొందే అవకాశాలు వెల్లువలా వస్తాయని ఆశిద్దాం. ఇటువంటి సంస్థను ఆదర్శంగా తీసుకుని తెలుగును సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లగలిగే మరిన్ని సంస్థలు పుడతాయని భావిద్దాం. ఇలా తెలుగుభాషకు, తెలుగుభాషాభిమానులకు చేయూతనిస్తున్నవారిని మనస్ఫూర్తిగా అభినందిద్దాం.

బ్లాగుపుస్తకం మరియు తెలుగు కీబోర్డ్ గురించి మరింత సమాచారం కోసం http://www.suravara.com ను సందర్శించండి.

ప్రచురితం: on ఫిబ్రవరి 18, 2012 at 9:52 సాయంత్రము  వ్యాఖ్యానించండి  
Tags: , , , ,
Follow

Get every new post delivered to your Inbox.