స్వార్థం

.
ఒక జీవిని పుట్టించి దానిని నచ్చినట్టు ఆడించి వినోదించే వాడొకడున్నాడు. వాడు మనుషులకి తెలియకపోవడం, తెలుసుకోవడం, తెలుసుండటం అనే మూడింటినిచ్చి ఆడుకోమన్నాడు. ప్రపంచం మైదానం, ఒప్పుకోవడం తప్పుకోవడం పరిధులు, మంచి చెడు ఆడే విధానాలు, గెలుపు ఓటమి గమ్యాలు, కాలం న్యాయనిర్ణేత, సిద్ధాంతం: గెలిచినవారు గెలిచాం కదా అని ఊరుకుంటే ఓడిపోతుంటారు, ఓడినవారు మళ్లీమళ్లీ ఆడుతుంటే గెలుస్తుంటారు. ఈ ఆటను పుట్టించి వీక్షిస్తూ వినోదిస్తున్న పరమాత్మే ప్రేక్షకుడు.అసలు ఆటకు కావలసిన ప్రదేశం, గమ్యాలు, విధానాలు అన్నీ సిద్ధమైనా ఆట మొదలవ్వలేదు. ఆటగాళ్లందరూ నిశ్చలంగా ఆనందంగా కూర్చుని ఉన్నారు. వీరిని కదిలించడానికి ఆటను మొదలుపెట్టడానికి భగవానుడు ఒక అద్భుతాన్ని సృష్టించి ఆటగాళ్లలో ప్రవేశపెట్టాడు. అంతే ఒక్కసారిగా ఆటగాళ్లందరూ చెలరేగిపోయారు. ఆట మొదలైంది. అలా మొదలైన ఆట ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. నేను నెగ్గాలన్న తపనను మనిషిలో కలిగించడానికి అతనిలో ప్రవేశపెట్టబడిన ఆ అద్భుత శక్తి పేరే స్వార్థం. తన వినోదం కోసం స్వార్థాన్ని పుట్టించిన భగవంతుడే ఈ సృష్టికి మొట్టమొదటి స్వార్థపరుడు.

కాలం గడిచే కొద్దీ స్వార్థం అనేక రూపాలు సంతరించుకుంది. బిడ్డ తనవాడు కాబట్టి బావుండాలనే తల్లి యొక్క స్వార్థం ప్రేమ. అవతలి మనిషి లాభం పొందాలంటే తనూ కొంత లాభం పొందాలనే స్వార్థం వ్యాపారం. కృష్ణుడికి పాండవులు నెగ్గాలన్న కోరిక వెనుక ఉన్న స్వార్థం పేరు ధర్మం. అవతలి వారిని నాశనం చేసైనా సరే తాము బాగుపడాలనుకునే స్వార్థం దురాశ. ఇలా ప్రతి విషయంలోను అంతర్లీనంగా, మూలవస్తువుగా వెలుగొందుతున్న ఈ స్వార్థం చిరంజీవి. స్వార్థం అనేది లేని విషయం లేదు. చివరకు ’నిస్వార్థం’ అనే పదంలో కూడా ’స్వార్థం’ ఉంది.

స్వార్థం ఉండటం తప్పుకాదు. అది నిప్పులాంటిది. నిప్పుతో పొయ్యీ అంటించుకోవచ్చు, ఇల్లూ అంటించవచ్చు. పొయ్యి అంటించినప్పుడు అది ఉపయోగకారి. ఇల్లు అంటించినప్పుడు అది వినాశకారి. అలాగే స్వార్థం కూడా. తన కొడుకు మహావీరుడు కావాలన్న జిజియాభాయి స్వార్థం మరాఠా రాష్ట్రానికి ఛత్రపతిని అందించింది. నా సోదరభారతీయులు అన్నగాంధీజీ స్వార్థం భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా చేసింది. తమ పిల్లలు బావుండాలనే స్వార్థం తల్లిదండ్రులకు లేకపోతే వారిమీద శ్రద్ధ చూపించనూ లేరు, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దనూ లేరు. కానీ తమ పిల్లలు తప్పు చేసినా, నా పిల్లలు కదా అని శిక్షించకుండా ఉపేక్షించేలా చేసే మితిమీరిన స్వార్థం పిల్లలకు తప్పుడు ఆలోచనా విధానం నేర్పిస్తుంది, సమాజాన్ని పాడుచేస్తుంది. అనేకమంది రాజకీయనాయకులు, సంపన్నుల పిల్లలు భ్రష్టుపట్టిపోవడానికి కారణం ఈ స్వార్థమే.

నా ఇల్లు పచ్చని చెట్లతో కళకళలాడాలనే స్వార్థం మనలో కలిగితే పర్యావరణ సమస్య చాలావరకూ పరిష్కారం అయిపోయినట్టే. నా కొడుకు బాగా డబ్బున్నవాడు కావాలని కాకుండా గొప్పమనసున్న వాడు కావాలనే స్వార్థం తల్లికి తండ్రికి కలిగితే అవినీతి సమస్యకు ఆయువు మూడినట్టే. ప్రతి మనిషికీ తనను తాను తెలుసుకోవడం కోసం ఎక్కువ సమయం తనతోనే గడపాలనే స్వార్థం కలిగితే మానసిక దౌర్భల్యాలకు మందు లభించినట్టే. స్వార్థాన్నికూడా నిస్వార్థంగా వాడగలిగితే జీవితానికి అర్థం తెలిసినట్టే.

.

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://naagola.wordpress.com/2011/06/10/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%82/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

అభిప్రాయములు మీ ఉద్దేశ్యం…

  1. చాలాబాగా రాసారు. సిద్ధాంతం: గెలిచినవారు గెలిచాం కదా అని ఊరుకుంటే ఓడిపోతుంటారు, ఓడినవారు మళ్లీమళ్లీ ఆడుతుంటే గెలుస్తుంటారు. ఈ లైన్ awesome

    • మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి మేఘన గారు

  2. Superrrrrr

    • మీ ప్రోత్సాహానికి ధన్యవాదములండి అభిరామ్ గారు

  3. Excellent Post. స్వార్థాన్ని అద్భుతంగా నిర్వచించారు

    • ధన్యవాదములండి అలేఖ్య గారు

  4. చాలాబావుంది. నిజంగానే స్వార్ధం లేకుండా ఈ ప్రపంచం ముందుకెళ్లదు. Grt definition for selfishness

    • నిజం చెప్పారు చౌదరి గారు. ఈ ప్రపంచాన్ని నడిపించేది స్వార్థమే

  5. రాజన్ గారు మీ ఆలోచనలు చాలాబావుంటాయి. ఎప్పటికీ దగ్గర ఉంచుకోవలసిన మంచిముత్యాలు.

    • మీ అభిమానానికి కృతజ్ఞుడినండి మదన్ గారు

  6. Sir,

    One small request. Your article assumes that god created human beings and then goes on to suggest god created selfishness.
    I would like to see it the other way. There is a community that strongly believes human created god for his comfort of attribution and reasoning. Perhaps that is where selfishness begins. Could you illuminate us a little from that direction too!

    Best.
    V

  7. శ్రీ రాజన్ గారికి, నమస్కారములు.

    మీ మనసులోని భావాన్ని చక్కగా మాకు అందించారు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.