నందమూరి తారక రామారావు
.
నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే. అసలు దానవీరశూరకర్ణ సినిమా చూసిన తరువాత, ఒకవేళ నిజం దుర్యోధనుడు ఈ భూమ్మీదకు వచ్చినా నువ్వు నువ్వుకాదు ఎన్టీఆరే అసలు నువ్వంటావేమో. పాతాళభైరవిలో సాహసం చేసే డింభకుడిగా అలరిస్తే, కన్యాశుల్కం సినిమా చూసిన తరువాత గురజాడ వారి గిరీశం ఎలా ఉంటాడో ఊహించేసుకుంటాం. గుండమ్మకథ సినిమాలో సగం ఊడిపోయిన బొత్తాలున్న చొక్కా, పొట్టి నిక్కరు వేసుకున్న అంజిగాడు కనపడతాడు తప్ప ఎన్టీఆర్ కనిపించడు. పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు. ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. సుమారు మూడు నూర్లు సినిమాలలో నటించిన ఈ నటరత్నానికి లభించిన అవార్డులు మాత్రం లెక్కకు చాలా తక్కువ. తెలుగు కథానాయకులలో దాదాసాహెబ్ ఫాల్కేలు, పద్మభూషణ్ లు పొందిన నటులందరూ ఎవరిని మహానటుడని పొగుడుతుంటారో అటువంటి ఎన్టీఆర్ కి మాత్రం ’పద్మశ్రీ’ తోనే సరిపెట్టేసింది కేంద్రప్రభుత్వం. ఆయన రాజకీయవేత్తకూడా కావడమే ఇందుకు ప్రబలమైన కారణం కావచ్చు.
.
భారతదేశంలో కేవలం ఇద్దరే ఇద్దరు నటులు అటు సినిమారంగం లోను. ఇటు రాజకీయరంగం లోను తారాపథాన్ని అందుకున్నారు. వారిలో ఒకరు తమిళుల అన్న ఎమ్జీయార్ కాగా ఇంకొకరు తెలుగువారి అన్న ఎన్టీఆర్ . సినిమా కృష్ణునిగా ధర్మసంస్థాపనకోసం అవతరిస్తానని అభయం ఇచ్చిన ఎన్టీఆర్ , ’తెలుగుజాతి ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయ అవతారం ఎత్తాడు. తెలుగుదేశాన్ని స్థాపించి రాజకీయాల్లో నెలల బాలుడిగా ఉండగానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆడవారికి ఆస్తిలో వారసత్వపు హక్కు, కిలో రెండురూపాయిల బియ్యం, మద్యపాన నిషేదం, ట్యాంక్ బండపై తెలుగు మహామహుల విగ్రహ ప్రతిష్ట, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ స్థాపన మొదలైన కార్యక్రమాలు అతని ఆచరణశీలత్వానికి ప్రతీకలు. కానీ రంగుల బురదవంటి రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత బుద్ధికి బురద అంటక మానదు. కొందరు రంగుని చూసి మురిసిపోతుంటే, ఇంకొందరు బురదను చూసి ఛీత్కరించుకుంటారు. ఈ పరిస్థితికి ఎవ్వరూ అతీతులు కారు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులూ, దగ్గరవారి రాజకీయ అవసరాలు కలసి అతనిని ముఖ్యమంత్రి పీఠం నుండి తోసివేసాయి. దశాబ్ధాలపాటు తెలుగు చలనచిత్రసీమని, ఏడేళ్ళపాటు తెలుగు నేలని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ అవమానకరరీతిలో పదవి నుండి ఆ తరువాత ఈ లోకం నుండి నిష్క్రమించాడు. గెలుస్తూ బ్రతికిన ఎన్టీఆర్ ఓడిపోతూ మరణించాడు. తెలుగులో ఎంతమంది గొప్పనటులు వచ్చినా తరాలు దొర్లినా ’మహానటుడి’ స్థానం మాత్రం ఆచంద్రతారార్కం తనకే సుస్థిరం చేసుకుని ఈ సినిమా రాముడు నిజం దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. .
స్వార్థం
కాలం గడిచే కొద్దీ స్వార్థం అనేక రూపాలు సంతరించుకుంది. బిడ్డ తనవాడు కాబట్టి బావుండాలనే తల్లి యొక్క స్వార్థం ప్రేమ. అవతలి మనిషి లాభం పొందాలంటే తనూ కొంత లాభం పొందాలనే స్వార్థం వ్యాపారం. కృష్ణుడికి పాండవులు నెగ్గాలన్న కోరిక వెనుక ఉన్న స్వార్థం పేరు ధర్మం. అవతలి వారిని నాశనం చేసైనా సరే తాము బాగుపడాలనుకునే స్వార్థం దురాశ. ఇలా ప్రతి విషయంలోను అంతర్లీనంగా, మూలవస్తువుగా వెలుగొందుతున్న ఈ స్వార్థం చిరంజీవి. స్వార్థం అనేది లేని విషయం లేదు. చివరకు ’నిస్వార్థం’ అనే పదంలో కూడా ’స్వార్థం’ ఉంది.
స్వార్థం ఉండటం తప్పుకాదు. అది నిప్పులాంటిది. నిప్పుతో పొయ్యీ అంటించుకోవచ్చు, ఇల్లూ అంటించవచ్చు. పొయ్యి అంటించినప్పుడు అది ఉపయోగకారి. ఇల్లు అంటించినప్పుడు అది వినాశకారి. అలాగే స్వార్థం కూడా. తన కొడుకు మహావీరుడు కావాలన్న జిజియాభాయి స్వార్థం మరాఠా రాష్ట్రానికి ఛత్రపతిని అందించింది. నా సోదరభారతీయులు అన్నగాంధీజీ స్వార్థం భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా చేసింది. తమ పిల్లలు బావుండాలనే స్వార్థం తల్లిదండ్రులకు లేకపోతే వారిమీద శ్రద్ధ చూపించనూ లేరు, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దనూ లేరు. కానీ తమ పిల్లలు తప్పు చేసినా, నా పిల్లలు కదా అని శిక్షించకుండా ఉపేక్షించేలా చేసే మితిమీరిన స్వార్థం పిల్లలకు తప్పుడు ఆలోచనా విధానం నేర్పిస్తుంది, సమాజాన్ని పాడుచేస్తుంది. అనేకమంది రాజకీయనాయకులు, సంపన్నుల పిల్లలు భ్రష్టుపట్టిపోవడానికి కారణం ఈ స్వార్థమే.
నా ఇల్లు పచ్చని చెట్లతో కళకళలాడాలనే స్వార్థం మనలో కలిగితే పర్యావరణ సమస్య చాలావరకూ పరిష్కారం అయిపోయినట్టే. నా కొడుకు బాగా డబ్బున్నవాడు కావాలని కాకుండా గొప్పమనసున్న వాడు కావాలనే స్వార్థం తల్లికి తండ్రికి కలిగితే అవినీతి సమస్యకు ఆయువు మూడినట్టే. ప్రతి మనిషికీ తనను తాను తెలుసుకోవడం కోసం ఎక్కువ సమయం తనతోనే గడపాలనే స్వార్థం కలిగితే మానసిక దౌర్భల్యాలకు మందు లభించినట్టే. స్వార్థాన్నికూడా నిస్వార్థంగా వాడగలిగితే జీవితానికి అర్థం తెలిసినట్టే.
.సచిన్ రమేష్ టెండూల్కర్
ఈ ప్రపంచలోకి వచ్చిన 16 సంవత్సరాలుకే క్రీడా జగత్తుకి పరిచయమయిన సచిన్, కెరీర్ ఆరంభంలోనే పాకిస్థాన్, వెస్టిండీస్ వంటి దేశాలతో ఆడి అప్పటి అరివీరభయంకర ఫాస్ట్ బౌలర్ల భరతం పట్టిన చిచ్చరపిడుగుగా క్రికెట్ అభిమానుల గుండెల్లో దూరిపోయాడు. ఫామ్ తో సంబంధం లేకుండా పాత రికార్డులు తిరగరాస్తూ, క్రొత్త రికార్డులు పుట్టిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. అత్యధిక మ్యాచ్ లు, అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లు ఇలా చెప్పుకుంటూ వెళ్లడం కంటే, క్రికెట్ లో ఉన్న అన్ని వ్యక్తిగత రికార్డులు అని ఒక్క ముక్కలో తేల్చేయడం తేలికేమో. అతని అవార్డులు, రికార్డులు పర్వతాల్లా పేరుకుపోతే, అతని అభిమానులు సంద్రంలా ఉప్పొంగుతుంటారు. సాధారణ రిక్షావాలా మొదలు దేశాధినేతల వరకూ అతని అభిమానగణంలో కొలువుతీరిన వారే.
నాణానికి ఒకవైపు అతని ఆటతీరైతే రెండోవైపు అతని వ్యక్తిత్వం. “నేను దేవుడిని చూసాను, అతను భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాలుగవ నంబరు ఆటగాడిగా బరిలోకి దిగుతాడు” అని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం హెడెన్, సచిన్ అద్భుత ఆటతీరు ముందు మోకరిల్లినా, “క్రికెట్ మతమైతే, సచిన్ దేవుడు” అని క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ ని కీర్తించినా, కోట్లాదిమంది వెలకట్టలేని అభిమానం అతనిని ఆకాశంలో నిలబెట్టినా, సచిన్ మాటల్లో కాని, నడవడిలో కాని కించిత్ అహంకారం కూడా కానరాదు. ముంబాయిలోని సామాజిక సేవాసంస్థ అప్నాలయ ద్వారా అనేకమంది అనాథలకు విద్యతో పాటు ఆహారం, వసతి కల్పిస్తున్నాడు. తండ్రికిచ్చిన మాటకోసం కోట్లు కుమ్మరిస్తామన్నా మత్తుపానీయాలకు ప్రచారకర్తగా వ్యవహరించనన్నాడు. తన నివాస భవన నిర్మాణ సమయంలో చుట్టుప్రక్కలవారికి కలిగే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని “నిర్మాణ సమయంలో వచ్చే శబ్ధాల వలన మీకు కలిగే ఇబ్బందికి నన్ను మన్నించండి. మీ కుటుంబంలో ఒకడిగా మారబోతున్న నాకోసం ఓర్పు వహించండి” అని వినయంగా స్వదస్తూరీతో సంతకం చేసి పంపిన లేఖలు అతని హృదయ వైశాల్యానికి నిలువెత్తు ఉదాహరణలు.
అటువంటి ఉన్నత వ్యక్తిత్వం కారణంగానే, బాల్ ట్యాంపరింగ్ వివాద సమయంలో జాతి యావత్తూ అతనికి అండగా నిలబడింది. క్రికెట్ ఎల్బో గాయం కారణంగా, ఆటనుండి శాశ్వతంగా వైదొలగక తప్పదనుకున్నప్పుడు అతనికోసం ప్రార్థనలు చేసింది. భారతావని అతనిని పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులతో సగౌరవంగా సత్కరించింది. నిజానికి సచిన్ అవార్డులతో కొలవడానికి సాధ్యంకాని అసలు సిసలు భారతరత్నం. అసామాన్య క్రీడానైపుణ్యం, అద్భుత వ్యక్తిత్వం మూర్తీభవించిన అతను యువతకు ఆదర్శప్రాయుడు. వయసు మళ్ళినవారికి ప్రేమ, వాత్సల్యం కురిపించడానికి అర్హమైన ఒక సొంత మనీషి. ఒకే వాక్యంలో చెప్పాలంటే, అతను.. ప్రపంచానికి ఒక సందేశాత్మక భారత రాయబారి.
విశ్వనాథ వారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
ఈ కథ అంతా రచయిత కలలో జరుగుతుంది. పంచతంత్రం వ్రాసిన విష్ణుశర్మ, భారతం తెనుగించిన కవిబ్రహ్మ తిక్కన స్వర్గంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇంగ్లీషు నేర్చుకోవడానికి వేరు వేరుగా భూలోకం వస్తారు. ఇంద్రుడు సలహా మేరకు వారు రచయిత కలలో ప్రవేశించి తమకు ఇంగ్లీషు నేర్పమంటారు. సరేనన్న రచయిత, ఇక అక్కడ నుండి పడే పాట్లు అన్నీఇన్నీ కావు. ఆంగ్ల శబ్ధాల వ్యుత్పత్తి, అర్థం, ఉచ్చారణ మొదలైన వాటి గురించి విష్ణుశర్మ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రచయిత తికమక పడే సన్నివేశాలు వినోదంతో పాటు ఆలోచననూ కలిగిస్తాయి. నువ్వు అనడానికి ఇంగ్లీషులో ఏమంటారంటాడు విష్ణుశర్మ. దానికి రచయిత YOU ’యు’ అనాలంటాడు. యు అనడానికి U అంటే సరిపోతుందిగా మరి ముందు YO ఎందుకు దండగ అంటాడు విష్ణుశర్మ. అలాగే OBLIQUE, CHEQUE అనే పదాలలో Q ని వాడవలసిన అవసరం ఏమొచ్చింది? కకారాన్ని పలకడానికి K అనే అక్షరం ఉందికదా అంటాడు. The, Bad, Enough పదాల ఉచ్చరణ విషయంలో కూడా విష్ణుశర్మ ప్రశ్నలు రచయితను అయోమయానికి గురిచేస్తాయి. క్యాపిటల్, స్మాల్ లెటర్స్ గురించిన ఆక్షేపణలు, గ్రామర్ విషయంలో Is, Am, Will, Shall ల ప్రయోగానికి సంబంధించి అడిగే సహేతుకమైన ప్రశ్నలు మనకు నవ్వు తెప్పిస్తున్నా, ఏదో నిజం బోధపడుతున్న భావం కలుగుతుంది. అప్పుడే వికసిస్తున్న పిల్లల మనసులపై పరభాషా ప్రభావం ఎలా ఉంటుంది, మాతృభాష పై సాధికారత వచ్చిన తరువాత పరభాషను నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? సంస్కృతం, తెలుగు మొదలైనవి సంస్కరింపబడిన భాషలుగా ఎందుకు పిలువబడుతున్నవి మొదలైన విషయాల గురించి తిక్కన, విష్ణుశర్మలు కూలంకషంగా మాట్లాడేతీరు మనకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. అప్పట్లో పాడ్యమి, అష్టమి, అమావస్య, పౌర్ణమి తిథులలో విద్య నేర్పేవారుకారట. ఆదివారం సెలవు అన్నది ఆంగ్లేయుల నుండి తీసుకున్నసంస్కృతి అట. తిక్కన కాలం నాటికే ఇంటిపేర్లు అంటూ ప్రత్యేకించి ఏవీ ఉండేవికావట. ఇలాంటి ఆసక్తికర అంశాలతోపాటు పూర్వం విద్యావిధానం ఎలా ఉండేది, భాషను నేర్చుకోవడం ఎలా మొదలుపెట్టాలి మొదలైన విషయాలమీద మంచి అవగాహన కలిగిస్తుంది. చివరకు ఇంత కంగాళీగా ఉన్న భాషను నేర్చుకోమని చెప్పి విష్ణుశర్మ, తిక్కన స్వర్గానికి వెళ్లడానికి సిద్ధపడి ట్రైన్ ఎక్కేస్తారు. మెలకువ వచ్చిన రచయితకు తనకు Head Of The Department గా ప్రమోషన్ వచ్చిందని తెలుస్తుంది. కలలో మాచవరం ఆంజనేయస్వామికి కొట్టిన వంద కొబ్బరికాయల ఫలితమే ఇదని రచయిత ముగింపు వాక్యం పలకడంతో కథ పూర్తవుతుంది.
విశ్వనాథవారి శైలి గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమేమున్నది. కథని పరిగెత్తించిన తీరు, సునిశిత హాస్యం, విష్ణుశర్మ పాత్రచిత్రీకరణ మనల్ని పేజీలవెంట పరుగుపెట్టిస్తాయి. రచయిత స్వగతంగా అనుకునేవి మనకు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తాయి. నవల చదవడం పూర్తయిన తరువాత మనభాష మీద మనకు గౌరవం పెరుగకా మానదు. మన భాష యొక్క అందాన్ని అవలోకనం చేసుకోకా మానము. సరదాగా సాగుతూనే మనల్ని విశ్లేషించుకునేలా చేసే ఓ మంచి నవల “విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు”.
నిరంతర గమ్యం
కాలం తెలివైనది. అది ముందుకు సాగుతూ మనిషి ఆలోచనలు మార్చుకుంటూ వెళిపోతుంటుంది. మారిన ఆలోచనల వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానంలో పడి మూలుగుతున్న మనిషిని చూసి వినోదిస్తుంటుంది. జవాబుదారీతనం కలిగిన స్వతంత్రుల గుంపుగా ఉండవలసిన సమాజాన్ని, భయస్తులు, బద్ధకస్తులు, ముసుగుమనసు మనుషుల కలయికగా మార్చివేసింది. తప్పించుకు తిరగడం ఈ కాలపు తెలివిగా తీర్మానించబడింది. గొప్పదనం హృదయాన్ని బట్టికాక, సమాజంలో హోదాని బట్టి లెక్క వేయబడుతుంది. దురలవాట్లుగా చెప్పబడేవి ఇప్పుడు సాధారణ అలవాట్లుగా భావించబడుతున్నాయి. సంపద, అధికారం, కీర్తి, సౌఖ్యం జీవిత గమ్యాలుగా మారిపోయాయి. తెల్లని అన్నం వంటి వీటికి, ఆనందం అనే శ్రేష్ఠమయిన కూర కలిపి తిన్నప్పుడే రుచిపుడుతుంది, బలం కలుగుతుంది, సంతృప్తీ మిగులుతుంది.
మనిషి అంతరాత్మకు కాక కేవలం సమాజానికి జవాబుదారీగా మారిపోయాడు. అవతలివారి పొగడ్త మీదో, తోటివారికంటే గొప్పవాడనిపించుకోవడం అనే తపన మీదో ఆధారపడి ఆనందాన్ని కొలుచుకుంటున్నాడు. పదిమందీ ప్రశంసిస్తే కలిగే ఆనందం భయంతో కూడిన బాధ్యతను పెంచుతుంది. క్రొత్త ఆలోచనలకు వారి ప్రశంసాకారణాలు పరిధులుగా ఏర్పడిపోతాయి. ఫలితంగా ఆలోచనల్లో స్వతంత్రత, నూతనత్వం మందగిస్తాయి, ఆనందం నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోతుంది. అదే, లోపలి మనిషి ప్రశంస వలన కలిగే ఆనందం స్వతంత్రతతో కూడిన ఉత్సాహాన్నిస్తుంది. సృజనాత్మకతను వికసింపజేస్తుంది. ఆలోచనే ఆనందంగా మారిపోతుంది. కానీ ఈ లోపలి మనిషితో మన బంధం రోజురోజుకీ బలహీనపడిపోతూ ఉంది. మనతో మనం గడపడానికి సమయం కేటాయించుకోలేకపోతున్నాం. మనల్ని మనకు దగ్గరచేసే ఏకాంతం అనేది పుస్తకాల్లో మాటగానే మిగిలిపోతోంది.
సాంస్కృతిక విప్లవం మంచికంటే చేటే ఎక్కువ చేసింది. సంపాదన మీద విపరీతమైన మక్కువ, సమాజంలో ఉన్నతికోసం పడే ఉబలాటం, కుటుంబసభ్యుల మద్య బంధాలని పలుచన చేసింది. భార్యాభర్తల ఉద్యోగాల వల్ల పిల్లలు ఆయాలకు, హాస్టళ్లకు అప్పగించబడుతున్నారు. స్కూలునుండి ఇంటికి రాగానే మంచినీళ్లిచ్చి ప్రేమగా దగ్గరకు తీసుకోవాల్సిన అమ్మ ఇప్పుడు ఆఫీసులో క్షణం తీరిక లేకుండా ఉంటోంది. అమ్మప్రేమ అనే మధురిమ ఒకప్పటి కాలానికి సంబంధించిన మధురభావనగా మిగిలిపోనుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదించిన డబ్బుతో పిల్లల్ని అన్ని వసతులూ గల హాస్టళ్ళు కలిగిన కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రులను అంతకంటే మంచి పేరున్న వృద్ధాశ్రమాలలో చేర్పించి ఋణం తీర్చుకుంటున్నారు. తాము చిన్నతనంలో నేర్చుకున్న న్యూటన్ మూడవ సూత్రాన్ని తెలియకుండానే అమలు చేస్తున్నారు. ప్రతీ చర్యకూ దానికి అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుంది కదా.
ఇప్పటికంటే మన పూర్వతరాలవారే ఎక్కువ శాతం ఆనందంగా ఉన్నారని అంగీకరించగలిగితే, అందుకు కారణమైన వారి అలవాట్లను, జీవన విధానాన్ని వివేచనతో బేరీజు వేసి అవలంబించగలిగితే, ఆనందాన్ని పట్టుకోవడానికి దారి దొరకవచ్చు. కాల పరీక్షకు నిలబడి, తత్వాన్ని మనకు మంచి కథల రూపంలో అందించిన ప్రాచీన సాహిత్యం కచ్చితంగా మనకు సహాయపడుతుంది. అంతరాత్మను వినగలిగే ఏకాంతం మనిషిని ప్రశాంతతకు దగ్గర చేస్తుంది, ఒంటరితనం బారిన పడకుండా కాపాడుతుంది. అలుపెరుగని ప్రయత్నం చేసి అవసరం లేని అలవాట్లను, మన బుద్ధిని తప్పుదారి పట్టించే వ్యక్తులను వదులుకో గలగాలి. మొదట్లో ఇది కష్టంగా అనిపించినా క్రమేణా గొప్ప ఆనందాన్నిస్తుంది. “లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు; అక్కరలేనిదానిని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు.” ’నిన్న’, ’రేపు’ తాళ్లయితే ’నేడు’ ఉయ్యాలబల్ల. గతం యొక్క అనుభవసారాన్ని, భవిష్యత్తు మీద విశ్వాసాన్ని ఆదరువుగా చేసుకుని వర్తమానంలో క్రీడిస్తూ జీవించగలగాలి. నిరంతర గమ్యమయిన ఆనందాన్ని చేరుకోగలగాలి.