ఒకరికొకరు దగ్గరవ్వడమంటే.. ఎంతదూరం పాటించాలో తెలిసుండటం
జీవితం అంటే.. దారిలో దొరికిన పండుని కూర్చొని తినడం కాదు.. చెట్టునున్న నచ్చిన పండుని కోసుకు తినడం
లేనిదానిని సాధించడం వల్ల కలిగే ఆనందానికి అల్పాయుష్షు
అఖ్ఖర్లేనిదాన్ని వదిలించుకోవడం వల్ల కలిగే ఆనందానికి దీర్ఘాయుష్షు
.
నా విష్ణువు
వైకుంఠ పుర నివాస దేవదేవ జగపతి
ఖగపతిపై దివిసీమల విహరించే శ్రీపతి
ఆదిశేషు పడగ నీడ పవ్వళించు ధరపతి
సర్వవ్యాపి దివ్యజ్యోతి పరంధామ ప్రకృతి ||వైకుంఠ పుర||
సుందర మీనానివై గిరినెత్తిన కూర్మమై
వసుంధరను గాచినట్టి అద్భుత వారాహమై
ఊరువుపై ధనుజునుంచి పొట్టచీల్చి ప్రేగు త్రెంచి
ప్రహ్లాదుని బ్రొచినట్టి ఉగ్రనరసింహమై ||వైకుంఠ పుర||
వామనుడై అరుదెంచి మూడడుగులు యాచించి
త్రివిక్రముడై వ్యాపించిన బాలబ్రహ్మచారివై
బ్రాహ్మణునిగ జనియించి క్షాత్రముతో ప్రభవించి
రాజన్యుల శిక్షించిన పరశురామ దేవరవై ||వైకుంఠ పుర||
సత్యధర్మ రూపమై దివ్యనామ తారకమై
ధారణిపై నడయాడిన సీతారామస్వామివై
దామోదర వాసుదేవ కంసాంతక గోవిందా
గీతామృత బోధకా పూర్ణపురుష శ్రీకృష్ణా ||వైకుంఠ పుర||
అహింసా వ్యాపకా ప్రేమతత్వ బోధకా
నిశ్చల నిర్మల ఆత్మ బుద్ధదేవ భగవానుడా
శ్వేతాశ్వరూఢుడా కరవాలధారుడా
ధర్మసంస్థాపక కల్క్యావతరుడా ||వైకుంఠ పుర||
అవతారపురుషుడా అఖిలాండనాథుడా
ఆదిదేవ జీవేశ్వర నన్ను ప్రేమ కావరా
శ్రద్ధనిమ్ము భక్తినిమ్ము గతితప్పని బుద్ధినిమ్ము
నన్ను నేను తెలుసుకునే ఆత్మప్రబోధమిమ్ము ||వైకుంఠ పుర||